ఆక్రమణలను తొలగించటం కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన హైడ్రా చుట్టూ వివాదాలు పెరిగిపోతోంది. హైడ్రా చర్యలవల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిరోజు ఆరోపణలు చేస్తోంది. దీనికి కౌంటర్ గా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎక్కడా పడలేదని మంత్రులు చెబుతున్నారు. ఈమధ్యనే రాయదుర్గం ఏరియాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంపాటలో ఎకరం భూమి రు. 237 కోట్లకు అమ్ముడుపోవటాన్ని ప్రభుత్వం ఎత్తిచూపుతోంది. బీఆర్ఎస్ ఆరోపణలు నిజమే అయితే ఎకరం భూమి రు. 237 కోట్లకు ఎలాగ అమ్ముడుపోతుందని మంత్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో నిర్మాణం పూర్తిచేసుకున్న అనేక అపార్టమెంట్ల ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నమాట కూడా నిజమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ నేతలు హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిపోతోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు ముందస్తుగా ఇచ్చిన అనుమతులు (జీహెచ్‌ఎంసీ, రేరా, హెచ్‌ఎండీఏ లేఅవుట్లు) ఉన్నప్పటికీ, హైడ్రా వాటిని పక్కనపెట్టి చర్యలు తీసుకోవడం చట్టపరంగా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరహా ద్వంద్వ విధానాల వల్ల అటు బిల్డర్లలో, ఇటు సామాన్య కొనుగోలుదారులలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడి మార్కెట్ మందగించిందా? లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాయా?నిజంగానే రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోవడానికి నిజంగా హైడ్రానే కారణమవుతోందా ? లేకపోతే మంత్రులు చెబుతున్నట్లు ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురదచల్లేస్తున్నాయా ?