
తెలంగాణలో కూరగాయలకు కొరత తప్పదా ? (వీడియో)
రబీ సీజన్ కు సంబంధించి మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంటల వ్యర్ధాలను రైతులు తగలబెట్టారు
ఇపుడు పప్పు ధాన్యాలు, నూనెలను దిగుమతి చేసుకుంటున్నట్లే తొందరలో కూరగాయలను కూడా దిగుమతి చేసుకోక తప్పదా ? తప్పదనే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జీవీ రామాంజనేయులు. తెలంగాణ ఫెడరల్ యూట్యూబ్ తో శుక్రవారం మాట్లాడుతు ఇప్పటికే కొన్ని కూరగాయలను తెలంగాణ దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరిని ఎక్కువగా ప్రోత్సహించిన కారణంగా రైతుల్లో అత్యధికులు వరిని తప్ప ఇతరత్రా పంటలను సాగుచేయటాన్ని ఇష్టపడటంలేదన్నారు. ఈ కారణంగానే తెలంగాణలో ఎక్కడ చూసినా వరి పంటే కనబడుతుంది అని చెప్పారు.
వరి విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్ళించటంలో ప్రభుత్వం తగినంత చొరవ చూపించటంలేదని ఆవేధన వ్యక్తంచేశారు. మొక్కజొన్న, పత్తి, నూనెగింజలు, రాగులు, సజ్జలు, వేరుశెనగ, చెరకు లాంటి అనేక ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆకుకూరలు, కూరగాయలను పండించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడంలేదు అన్నారు. వరికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నందు వల్లే రైతులు కూడా వరిని కాకుండా ఇతర పంటల సాగును ఇష్టపడటంలేదు అని తెలిపారు.
అవసరానికి మించి వరి పండించటమే కాకుండా ఖరీఫ్, రబీ సీజన్లలోనూ వరుసగా వరిని మాత్రమే పండిస్తున్న కారణంగా పంటల వ్యర్ధాలను తొలగించటంలో భాగంగా రైతులు పంటల వ్యర్ధాలను తగలబెట్టేస్తున్నట్లు రామాంజనేయులు చెప్పారు. దీనివల్ల వాతావరణానికి ఎంతో హాని జరుగుతోంది అన్నారు.
రబీ సీజన్ కు సంబంధించి మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంటల వ్యర్ధాలను రైతులు తగలబెట్టారు. పంట వ్యర్ధాలను తగలబెట్టే సమస్య ఎక్కువగా వరి పండించే పొలాల్లోనే కనబడుతోంది. ఖరీఫ్-రబీ సీజన్లు రెండుసార్లు వరి సాగుచేసే రైతులు పంటల వ్యర్ధాలను తగలబెడుతున్నారు. ఒక్కసారిగా లక్షల ఎకరాల్లో పంటల వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల ప్రమాదకరమైన రశాయనాలు నత్రజని, భాస్వరం, పొటాష్ గాలిలో కలిస్తున్నాయి.
ప్రమాదకర రశాయనాలు కలిసిన గాలిని పీల్చడం వల్ల జనాల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయనంలో టన్ను వ్యర్ధాన్ని కాల్చటం వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, 1460 కిలోల కార్బన్ డయాక్సైడ్, 200 కిలోల బూడిద వెలువడుతుందని తేలింది. పంట వ్యర్ధాలను కాల్చటమనే సమస్య రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ముఖ్యంగా రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు మరో ఏడు జిల్లాల్లో ఎక్కువగా ఉంది.

