‘సింగ్ గీతం’ ఓటీటీ వెర్షన్‌ ను మారుస్తున్న నాగ్
x

‘సింగ్ గీతం’ ఓటీటీ వెర్షన్‌ ను మారుస్తున్న నాగ్

ఓటీటీలో ‘సింగ్ గీతం’ సరికొత్తగా!


దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో ఆన్‌లైన్ ద్వారా ఇంట్లోనే ఉండి దర్శకత్వం వహించిన వినూత్న చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రయోగాత్మక చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలై, విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఒక గ్రామంలోని ప్రజలు మాట్లాడే మాటలన్నీ పాటలుగా మారిపోతే, వారు ఆ వింత సమస్య నుండి ఎలా బయటపడ్డారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ రిలీజ్ చేయకుండా, విడుదలైన రెండు రోజుల తర్వాత లాంచ్ చేయడం వంటి అనేక వినూత్న ప్రయోగాలను ఈ చిత్రం విషయంలో మేకర్స్ ఇప్పటికే చేశారు.



ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం కాగా, దీని డిజిటల్ విడుదలలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు నిర్మాత నాగ్ అశ్విన్ తాజాగా ప్రకటించారు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన ప్రింట్‌ను లేదా అదనపు దృశ్యాలను మాత్రమే ఓటీటీలలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. కానీ ‘సింగ్ గీతం’ విషయంలో భవిష్యత్తు ఆదరణను దృష్టిలో ఉంచుకుని, థియేటర్ వెర్షన్ కంటే మరింత మెరుగైన సాంకేతిక వెర్షన్‌ను ఓటీటీ ప్రేక్షకులకు అందించాలని చిత్ర బృందం నిర్ణయించింది.

నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా క్లైమాక్స్‌లో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG) విజువల్స్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉందని తమకు అనిపించిందని పేర్కొన్నారు. ఓటీటీలో ఈ సినిమాను రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు కాబట్టి, డిజిటల్ రిలీజ్‌కు ముందే ఆ గ్రాఫిక్స్ పనులను మరింత మెరుగుపరచడానికి తమ సాంకేతిక బృందం కసరత్తు చేస్తోందని చెప్పారు. కేవలం థియేటర్లతోనే అయిపోయిందని వదిలేయకుండా, ఓటీటీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ప్రేక్షకులకు ఒక అత్యుత్తమ దృశ్యకావ్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నట్లు నాగి స్పష్టం చేశారు.

Read More
Next Story