
'సిద్ధాపూర్ డంప్‌యార్డ్' పై పెరుగుతున్న వ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల మధ్య ఎకోటౌన్ ప్రాజెక్ట్ పై వివాదం మొదలైంది. ఒక పరిశ్రమ వ్యర్థాన్ని మరొక పరిశ్రమ ముడిసరుకులా ఉపయోగపడేలా,అధునాతన జపాన్ టెక్నాలజీతో తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో రాబోతుంది. దీని కోసం ప్రభుత్వం 86 ఎకరాలు కేటాయించింది. అలాగే దీని ఏర్పాటు కోసం జీవో నెం.641 ని జారీ చేసింది. ఇది సాధారణ డంపింగ్ యార్డ్ కాదని జపాన్ లో ఉన్న ‘కిటాక్యుషు’ లో విజయవంతమైన నమూనా అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే ఈ డంపింగ్ యార్డ్ వల్ల హాని జరుగుతుందని సిద్దాపూర్ గ్రామస్తులు బీఆర్ ఎస్ నేతలను కలిసాక, బీఆర్ఎస్ నేతలు దీనిపై దృష్టి సారించారు.
ఈ ప్రాజెక్ట్ ని స్థానికులతో పాటు ,పర్యావరణవేత్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం సిద్దాపూర్‌లో ప్రతిపాదించిన డంప్ యార్డు ప్రాంతానికి ఆనుకునే ‘గుట్ట చెరువు’ ఉంది. ఈ చెరువు నీటితోనే రైతులు వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ చెత్తను డంప్ చేయడం ప్రారంభిస్తే, ఆ రసాయనాలు, వ్యర్థాలు చెరువు నీటిలో కలిసిపోయి సాగునీరు, తాగునీరు పూర్తిగా విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు,స్థానిక రైతులు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు, సమీపంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ‘జహంగీర్ పీర్ దర్గా’ ఉంది. నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులపై కూడా ఈ కాలుష్య ప్రభావం ఉంటుందని కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం 20 గ్రామాల ప్రజలకి నష్టం వాటిల్లుతుందని బీఆర్ ఎస్ విమర్శ. వెంటనే ప్రభుత్వం ఈ జీవోని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బీఆర్ ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు.
ఈ రెండు వాదనల్లో ఏది నిజం?

