
వరంగల్ కార్పొరేషన్లో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్
మూడు జాతీయ ,రెండు ప్రాంతీయ పార్టీల మధ్యపోటి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్ కార్పోరేషన్ లో ఎన్నికల పోరుకి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అభివృద్ధి అస్త్రంతో వ్యూహరచన చేస్తుంటే, బీజేపీ కేంద్ర ప్రాజెక్టులను హైలైట్ చేస్తోంది. పూర్వవైభవాన్ని పొందేందుకు బీఆర్ఎస్ క్యాడర్ ని యాక్టివ్ చేసే ప్రయత్నంలో ఉంది. అభిమానిని కలిసే పేరుతో పవన్ కళ్యాణ్ కూడా వరంగల్ కి వచ్చారు,అలాగే తాజాగానే తెలంగాణాలో జనసేనని యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ఇంకోవైపు తెలంగాణా రక్షణ సేనని కూడా కవిత రంగంలోకి దింపే అవకాశం ఉంది.
దాదాపు పది లక్షల జనాభా, 66 డివిజన్లతో ఉన్న కార్పోరేషన్ వరంగల్ . గత 2021 ఎన్నికల్లో 48 స్థానాలతో బీఆర్ఎస్ ఏకపక్షంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగా, బీజేపీ 10 స్థానాలతో, కాంగ్రెస్ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.(మిగిలిన నాలుగు స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు) . ఇక్కడ గెలుపు సాధించడం మూడు పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మారింది.గ్రేటర్ వరంగల్ మేయర్ సీటును గెలిచేందుకే అన్నట్లుగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తోంది. నగరానికి భారీ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేస్తోంది. రూ.5, 257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.551 కోట్లతో మంచి నీటి వ్యవస్థ, మామిడియాల విమానాశ్రయానికి రూ.295 కోట్లు, జీడబ్ల్యూఎంసీ పరిధికి రూ.340 కోట్లు, ఇలా వేల కోట్ల నిధులు,ప్రాజెక్టులతో ఇక్కడి ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
2016లో ఒక్క కార్పొరేటర్ తో ఉన్న బీజేపీ, 2021 నాటికి 10 స్థానాలు చేజిక్కించుకుంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామునూర్ విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, అమృత్ భారత్, రైల్వే స్టేషన్ల అభివృద్ధిని ప్రచారాస్త్రాలుగా ఉపయోగించనుంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వరంగల్ లో పర్యటించారు. త్వరలో జాతీయ అధ్యక్షులు, ఇతర బృందం ప్రచారానికి వచ్చేలా వ్యూహాలు వేస్తున్నారు. తెలంగాణా వచ్చాక పదేళ్ళ పాటు గ్రేటర్ వరంగల్ లో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ఇప్పుడుగడ్డు పరిస్థితుల్లో ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,తరచూ ఇక్కడ పర్యటిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముక్కోణపు పోరులో ఎవరు విజేత అవుతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

