చివరి రోజు కొత్త చిక్కుల్లో ‘టీవీకే’ అధినేత విజయ్
x
విజయ్

చివరి రోజు కొత్త చిక్కుల్లో ‘టీవీకే’ అధినేత విజయ్

పార్టీ గుర్తులతో చర్చికి, అవి తీసేసీ మసీద్, ఆలయాల సందర్శన


Click the Play button to hear this message in audio format

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కు ఈ మధ్య ఏదీ కలిసి రావట్లేదు. ప్రచార సభలకు అనుమతి రావట్లేదు.. కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకులు, ప్రచారానికి వెళ్తే అభిమానులు పూలు జల్లుతామని నిల్చున్నా భయపడి పారిపోవడాలు ఇలా.. ఏదీ చేసిన ఎదురు తిరుగుతోంది.

ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ తన ప్రచారంలో భాగంగా తిరుచిరాపల్లికి వెళ్లాడు. అక్కడ ప్రచారం ప్రారంభించడానికి ముందు స్థానిక సెయింట్ ఆంథోనీ చర్చిలో తన పార్టీ ఎరుపు-పసుపు రంగు స్కార్ఫ్‌ను ధరించి కనిపించారు. తరువాత ఆయన మరో ఆలయాన్ని, మసీద్ కు కూడా దర్శించాారు. కానీ ఈ రెండు ప్రదేశాలలో తన పార్టీ గుర్తు సూచించే వస్త్రాలు ఆయన ధరించలేదు. దీనితో ఆయనపై విమర్శలు తలెత్తాయి. చర్చి సందర్శన సమయంలో ఆయన చేతులు జోడించి ప్రార్థనలు చేస్తూ మోకాళ్లపై నడవడం కూడా కనిపించింది. విజయ్ రాబోయే ఎన్నికలలో ట్రిచి ఈస్ట్, పెరంబూర్ అనే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

చర్చి సందర్శన సమయంలో విజయ్ బహిరంగ ప్రసంగాలకు దూరంగా ఉండి, కేవలం ప్రతీకాత్మక ప్రచారంపైనే దృష్టి సారించినప్పటికీ, ఆయన చర్యలు మాత్రం విమర్శకు గురయ్యాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, ప్రచార సమయంలో పార్టీ చిహ్నాలను ధరించి ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. "ప్రార్థన కోసం మతపరమైన ప్రదేశాలను సందర్శించడం వేరు, ఎన్నికల ప్రచారంలో పార్టీ గుర్తు ధరించి అలా చేయడం వేరు" అని ఆయన అన్నారు.
చర్చిని సందర్శించడంతో పాటు, విజయ్ తిరుచిలోని కేకే నగర్ ప్రాంతంలో ఉన్న అమ్మన్ ఆలయాన్ని, మసీదును కూడా సందర్శించారు. అయితే, ఆ సందర్భాలలో ఆయన పార్టీ గుర్తును ధరించకపోవడం వివాదాన్ని పెద్దది చేసింది.

జాగ్రత్తగా ఉండాలి..

ఈ విషయంపై 'ది ఫెడరల్' మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తితో మాట్లాడింది. ఆయన ఏ నిర్ధారణకూ రాకముందు జాగ్రత్త ఉండాలని కోరారు. "విజయ్‌పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు చేసే ముందు, ఆయన పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన రికార్డింగ్‌ను పరిశీలించాలి" అని ఆయన అన్నారు.
ఓట్లు అభ్యర్థించడానికి అభ్యర్థులు తమ మత గుర్తింపును ఉపయోగించకూడదని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కూడా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విజయ్ ఎన్నికల రంగ ప్రవేశానికి కేవలం కొన్ని రోజుల ముందు ఆయన చుట్టూ ఈ తాజా వివాదం చెలరేగింది. రాష్ట్ర ఎన్నికల ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)తో ముగుస్తుంది.

ప్రసంగాలు చేయని విజయ్..

వివాదం ఉన్నప్పటికీ, విజయ్ రోడ్‌షోకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చి, తిరుచిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. అతని మద్దతుదారులు శ్రీరంగం ఆలయ రంగనాథుని ఫోటోతో సహా బహుమతులు, ఫోటో ఫ్రేమ్‌లను అందించి, అతనికి ఉత్సాహంగా స్వాగతం పలికారు.
మనప్పరై, లాల్గుడి నియోజకవర్గాల నుంచి వరుసగా టీవీకే అభ్యర్థులు ఆర్. కదిరవన్, కుప్ప కృష్ణన్ ప్రచారమంతటా ఆయనతో పాటు ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలు తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్నాయి. విజయ్ నుంచి ఎటువంటి మాటలు లేకపోవడంతో వారంతా నిరాశ వ్యక్తం చేశారు.
విజయ్ సభలను ఉద్దేశించి ప్రసంగించకపోవడంపై చాలామంది నిరాశ వ్యక్తం చేశారు. "ప్రసంగాలు లేకుండా, ప్రతీకలతో నిండిన" ఎన్నికల ప్రచారం వారి అంచనాలను అందుకోలేకపోయింది. ఇది వ్యూహానికి, మద్దతుదారుల మనోభావాలకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది.

విజయ్ బీజేపీ మనిషి..

టీవీకే అధినేత రాజకీయ ప్రవేశం మైనారిటీ ఓట్లను చీల్చి, పరోక్షంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సహాయపడటానికేనని విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధినేత తోల్. తిరుమావళవన్ ఆరోపించారు.
వీసీకే భాగస్వామిగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన తమిళనాడు ఓటర్లను కోరారు. కీలక అంశాలపై విజయ్ మౌనాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) వినియోగం వంటి విషయాలపై బీజేపీకి వ్యతిరేకంగా విజయ్ స్పష్టమైన వైఖరి తీసుకోలేదని తిరుమావళవన్ ఎత్తి చూపారు. ఈ చట్టం క్రైస్తవ సంస్థలపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story