
తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు వాస్తవాలు!!!
ఇటీవల విడుదల అయిన జాతీయ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలలో తెలంగాణా రైతు ఆత్మహత్యలను తక్కువ చేసి చూపారని రాష్ట్రంలోని రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ సంఖ్య ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులను ప్రతిభింభించటం లేదని వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని ఇది దాచే ప్రయత్నం అని విమర్శిస్తున్నాయి.
2024 లో రాష్ట్రంలో కేవలం 43 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ఈ గణాంకాలు చెప్పటం పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. ఇందులో 28 మంది స్వంత భూమి సాగుదారులు కాగా, 15 మంది లీజు తీసుకున్న భూమిని సాగుచేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అంకెల గారడీ బిఆర్ఎస్ హయాం నుంచే మొదలైందని అవి తెలియచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎంత మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి అనే విషయం పై రాజకీయం దుమారం మాత్రం తరచూ జరుగుతోంది. అదే ఏడాదిలో 5,745 మంది రోజు వారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ విషయం పై వివాదం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే గడిచిన సమయం నుంచే మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2025 న కొలువు తీరి అధికార పీఠం ఎక్కింది. అయితే మరో 100 రోజుల్లో దేశ సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 209 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని బిఆర్ఎస్ పెద్ద దూమరమే చేసింది. అయితే ఆ జాబితాలో కరెంట్ షాక్ తో, పిడుగు పడి, ట్రాక్టర్ ఆక్సిడెంట్ లో పొరపాటున చనిపోయిన వాళ్ళను ఈ జాబితాలో చేర్చారని రైతు స్వరాజ్య వేదిక లాంటి సంఘాలు బయట పెట్టాయి. తమ లెక్కల ప్రకారం ఆ కాలంలో 63 రైతు ఆత్మహత్యలు జరిగాయని, సరైన జాబితా ఇవ్వటం ద్వారా రైతులకు న్యాయం చేయవచ్చని తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావచ్చని ఆ సంఘం రాజకీయ పార్టీలకు ఆ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

