బీఆర్ఎస్ రూటు ఎందుకు మార్చింది ?
x

బీఆర్ఎస్ రూటు ఎందుకు మార్చింది ?


ఇంతకాలం పార్టీ ఆఫీసుకే పరిమితమైన బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావుతో పాటు నేతలు, క్యాడర్ ఒక్కసారిగా గురువారం హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, గురుకులాల భవనాల నిర్మాణాలు, నిర్వహణలో అవినీతి, ఉద్యోగాల భర్తీ, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర అంశాలపై బీఆర్ఎస్ తీవ్రస్ధాయిలో మండిపడింది. ఈ నేపధ్యంలోనే అప్పులపై సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కిస్తున్నట్లు అనుమానం పెరిగిపోతోంది. నగరంలోని గన్ పార్క్, తెలంగాణ భవన్, గాంధీభవన్ ప్రాంతాల్లో రెండుపార్టీల నేతలమధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ఇకనుండి బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్లో సమావేశాలు, మీడియా సమావేశాలకు పరిమితంకాకుండా నగరంలోని రోడ్లపైనే ఆందోళనల పేరుతో రాజకీయాలను వేడెక్కించాలని డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది.




ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జిల్లాల వారీగా కూడా క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు, రైతు భరోసా, రుణమాఫీ అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కేవలం ప్రెస్ మీట్‌లకే పరిమితమైతే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేమనే ఉద్దేశంతోనే, క్షేత్రస్థాయి పోరాటాలకు వారు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు ఇప్పటికీ బలమైన క్యాడర్ మరియు ప్రజాదరణ ఉండటంతో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకోవడమే కాకుండా, కాంగ్రెస్‌కు గట్టి చెక్ పెట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు, బీఆర్ఎస్ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంపై అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అప్పుల కుప్పగా మారిన తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. గన్ పార్క్, గాంధీభవన్, తెలంగాణ భవన్ పరిసరాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం, తోపులాటలు నగరంలో హైటెన్షన్‌ను క్రియేట్ చేసాయి.. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తుండగా, రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Read More
Next Story