కవిత నిరాహార దీక్ష ఎందుకు చేయబోతుంది?
x

కవిత నిరాహార దీక్ష ఎందుకు చేయబోతుంది?

కవిత నిరాహార దీక్ష ఎందుకు చేయబోతుంది?


సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం కల్వకుంట్ల కవిత ఈ నెల 20నుండి నిరాహార దీక్ష చేయనున్నారు. కొద్దిరోజులుగా సింగరేణి కార్మికులతో భేటీ అయ్యేందుకు కవిత ‘బాయిబాట’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతలో రామగుండం, మంథని, భూపాలపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్‌తో పాటు మొత్తం 11 నియోజకవర్గాల్లో, రెండో విడతలో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పినపాక, సత్తుపల్లి వంటి కీలకమైన సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించారు. అక్కడ కార్మికులతో ముఖాముఖీ మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ పర్యటనల సమయంలోనే కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కవిత డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడు నిరాహార దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు.


నిరాహారదీక్షను తెలంగాణా రక్షణ సేనకు సింగరేణిలో అనుబంధ సంఘమైన హెచ్ఎంఎస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. దీని గురించి హెచ్ఎంఎస్ యునియన్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడుతూ ‘‘2 వేలమందికి వారసత్వ ఉద్యోగాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘కొందరికి ఫిజికల్ ఫిట్ నెస్ లేదని, మరి కొందరి పేర్లు రికార్డుల్లో తప్పు ఉన్నాయి’’ అన్న నెపంతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మెడికల్ బోర్డ్ ను కూడా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే కవిత ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరగబోతోందని రియాజ్ చెప్పారు.

ఈ దీక్షను కేవలం ఒక నిరసనగా కాకుండా సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద కార్మిక ఉద్యమంగా మార్చేందుకు తెలంగాణా రక్షణ సేన మరియు హెచ్ఎంఎస్ సంఘాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని డివిజన్ల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈ దీక్షా శిబిరానికి తరలివచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు. రికార్డులలో చిన్నపాటి తప్పుల పేరుతో దశాబ్దాల కాలంగా సంస్థను నమ్ముకున్న వారికి అన్యాయం చేయడం తగదని, మెడికల్ బోర్డు పునరుద్ధరణతో పాటు నిలిచిపోయిన అన్ని వారసత్వ ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యం. ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో మరియు సింగరేణి కార్మిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

Read More
Next Story