Telangana CM Revanth Reddy
x

రేవంత్‌ ‘జలపరీక్ష’లో సక్సెస్ అవుతారా ?

మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపటంలో,కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించటంలో రేవంత్ సక్సెస్ అవుతారా ?


తెలంగాణా రాష్ట్రాన్ని నీటిరాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. మహారాష్ట్ర నీటి ప్రాజెక్టు విషయంలో రేవంత్ బిజెపిని టార్గెట్ చేస్తుంటే కర్నాటక ప్రాజెక్టుల విషయంలో రేవంత్ ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. తుమ్మిడిహట్టి బారేజ్ నిర్మాణం ఎత్తు విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి మహరాష్ట్రతో వివాదం నడుస్తోంది. చర్చలతో ఈసమస్యని పరిష్కరించుకుందామని రేవంత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తున్నారు



కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపు, నావలి రిజర్వాయర్ విస్తరణ,అప్పర్ భద్ర వంటి ప్రాజెక్టుల ద్వారా తన నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఎగువన భారీ ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల దిగువన ఉన్న తెలంగాణకు వరద ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రవాహాల తగ్గుదల వల్ల తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల ఉనికి ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా కృష్ణా నది నీటి మీదే ఆధారపడ్డాయి. కర్ణాటక ప్రాజెక్టుల వల్ల ఈ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం ఉంది. కేవలం వ్యవసాయమే కాకుండా, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌లలో నీటి మట్టాలు పడిపోవడం వల్ల హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల తాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన కొరత ఏర్పడుతుంది.

ఇంకో వైపు గోదావరి బేసిన్ పరిధిలోని తుమ్మడిహట్టి బారేజ్ ఎత్తు వివాదంపై తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను రక్షించాలంటూ తాజాగానే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖలు రాశారు. అక్కడ సానుకూల స్పందన లేదు. ఇంకో వైపు ఇప్పుడు కర్ణాటక లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా, తెలంగాణా ప్రయోజనాల కోసం అక్కడి ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఆపేలా చేయగలరా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.ఇప్పటికే తుమ్మిడిహట్టి విషయంలోనూ,అలాగే మెట్రో లాంటి విషయాల్లో బీజేపిని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణా రైతాంగ ప్రయోజనాల కోసం ఒప్పించకపోతే అది విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారుతుంది.

Read More
Next Story