
రైతుల్ని ఆకర్షించడానికి రేవంత్ వ్యూహం
రేవంత్ ప్రభుత్వం జూన్ 30 న మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది.
రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘రైతు ఆశీర్వాద సభ’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ డిస్కాం, యూరియా యాప్ సరిగ్గా పనిచేయకపోవడం వంటి విషయాల వల్ల బీఆర్ ఎస్ రేవంత్ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేస్తూ ప్రచారం చేస్తూ ఉంది. దీనికి తోడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని రైతు కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం జూన్ 30 న మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. గతంలో సిద్దిపేట నర్మెట్ట సభలో రూ. 3,500 కోట్ల తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఒకేసారి రూ. 9,000 కోట్ల రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయబోతోంది. రెండు లక్షల మంది జనంతో ఈ సభని కాంగ్రెస్ అట్టహాసంగా ప్లాన్ చేస్తోంది. మధిర నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సొంత నియోజకవర్గం కావడంతో ఈ సభను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉంటూ ప్రతిపక్షాల విమర్శల నడుమ రూ. 9,000 కోట్ల నిధులను విడుదల చేయించిన క్రెడిట్ ఆయనకు దక్కుతుంది.
ప్రెస్ మీట్లలో సమాధానాలు చెబితే మైలేజ్ రాదని, రెండు లక్షల మంది జనంతో సభ పెట్టి తాము రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. మధిర పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో, ఇక్కడి నుండి నిధులు విడుదల చేసి రైతుల సెంటిమెంట్‌ను తిరిగి తమ వైపుకి తిప్పుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. గత ప్రభుత్వ హయాంలో సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు కూడా వందల కోట్లు దోచిపెట్టారని, తాము మాత్రం అర్హులకే ఇస్తామన్న రివర్స్ అటాక్ చేయడానికి ఈ సభను రేవంత్ వాడుకోబోతున్నారు. ఈ మధిర సభ ద్వారా రేవంత్ రెడ్డి రైతుల్లో పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సాధించడంలో సక్సెస్ అవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయేతర భూములకి, రియల్ ఎస్టేట్ భుములకి వందల కోట్లు దోచిపెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము మాత్రం అర్హులకే ఇస్తామన్న రివర్స్ అటాక్ చేయడానికి ఈ సభను రేవంత్ వాడుకోబోతున్నారు. రైతుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందని బీఆర్ ఎస్ ఆరోపిస్తున్న సందర్భంలో ఈ సభ ప్రకటన రావడం గమనార్హం.

