కూటమి బంధం బలహీనమవుతోందా?
x

కూటమి బంధం బలహీనమవుతోందా?

వైసీపీ వ్యూహం వెనుక అసలు లెక్క ఇదే...


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గి, నిరాశ కనిపిస్తోంది. వారిలో మళ్లీ జోష్ తీసుకురావడం ఇప్పుడు పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. అందుకే అధికార కూటమిలో విభేదాలు ఉన్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తే, తమ కేడర్‌లో మళ్లీ నమ్మకం పెరుగుతుందని వైసీపీ భావిస్తోంది. కూటమిలో అంతా సవ్యంగా లేదనే ప్రచారం చేస్తోంది. టీడీపీ, జ‌న‌సేన నేతల మధ్య విభేదాలు ఉన్నా భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా కూటమి అంతర్గత విభేదాలను హైలెట్ చేస్తోంది. కూటమిలో చిచ్చు ఉందని ప్ర‌చారం చేస్తున్న వైసిపికి తాజాగా వ‌ర్మ రూపంలో మ‌రో ల‌డ్డూ దొరికింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్ కూడా రాదంటూ వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతకాలంగా పిఠాపురంలో వ‌ర్మ‌కు, జ‌న‌సేన‌ నేతలు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో స్థానికంగా టీడీపీ, జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్ర‌బాబు ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఫ్లెక్సీ వివాదం తర్వాత టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది. టీడీపీ అధిష్టానం వర్మను ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం సాధారణ రాజకీయ నిర్ణయమే అయినప్పటికీ, దానిని పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా మారుతున్న అసంతృప్తిగా వైసీపీ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

అంతే కాదు, తమిళనాడు రాజకీయాలను కూడా ఈ చర్చలోకి లాగుతున్నారు. విజయ్ ఒంటరిగా పార్టీ పెట్టి ప్రజాదరణ పొందుతున్నాడని, కానీ పవన్ మాత్రం ఇప్పటికీ మిత్రపక్షాలపై ఆధారపడుతున్నాడని పోలికలు తీసుకొస్తున్నారు. ప‌క్క రాష్ట్రంలో విజ‌య్ ఒంట‌రిగా నిల‌బ‌డి గెలిచాడ‌ని.. అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అది సాధ్యం కావ‌డం లేద‌ని కావాల‌నే ఊద‌ర‌గొట్టేస్తున్నారు. వాస్త‌వానికి చూసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నం. అక్కడ స్టార్ ఇమేజ్ ఒకలా పనిచేస్తే, ఏపీలో కుల, ప్రాంతీయ, సంక్షేమ సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇదే సమయంలో కోట వినుత ఘటన, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అశ్లీల వీడియోల వివాదం వంటి అంశాలను కూడా వైసీపీ సోషల్ మీడియా, నేతల వ్యాఖ్యల్లో పదేపదే ప్రస్తావిస్తోంది. ఒక్కో సంఘటనను విడివిడిగా కాకుండా.. “కూటమిలో అంతా బాగోలేదు” కూటమిలో చిచ్చుగా చూపించే ప్రయత్నం చేస్తోంది.

కోట వినుత ఘ‌ట‌నః

శ్రీకాళహస్తికి చెందిన మాజీ జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు (శ్రీనివాసులు) హత్య కేసు 2025లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది.రాయుడు హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా మరికొందరు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాయుడు వినుతకు డ్రైవర్‌గా పనిచేస్తూ, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కి స‌మాచారం ఇస్తున్నాడ‌నే అనుమానంతో వినుత దంప‌తులు అత‌నిపై నిఘా పెట్టడం. రాజకీయంగా ఇది శ్రీకాళహస్తి జనసేన–టీడీపీ వర్గాల మధ్య విభేదాలకు సంబంధించిన అంశంగా మారింది. ఘటన తర్వాత కోట వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించింది.

అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారంః

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అశ్లీల వీడియోల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.2026 జనవరిలో ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, ఆమె విడుదల చేసిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి శారీర‌క సంబంధం కొనసాగించారని, పలుమార్లు గర్భస్రావాలు చేయించారని తన కుటుంబాన్ని కూడా బెదిరించారని ఆరోపించింది.ఈ వ్యవహారంపై జనసేన అధిష్ఠానం వెంటనే స్పందించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టింది. ఇదే సమయంలో టీడీపీకి అనుకూల మీడియా, సోషల్ మీడియా రెండు పార్టీల మ‌ధ్య దూరం పెర‌గ‌కుండా “డ్యామేజ్ కంట్రోల్” ప్రయత్నం చేసింది. ఇది రెండు పార్టీల మధ్య రాజకీయ సమన్వయం ఇంకా కొనసాగుతోందనే సంకేతం.

కోట వినుత ఘటన, అరవ శ్రీధర్ వ్యవహారం, వర్మ ఇష్యూ వంటి పరిణామాలు కూటమి లోపల అంతర్గత అసంతృప్తిని బయటపెడుతున్నా, చిన్న కుదుపు అనుకోవ‌చ్చు. కానీ కూటమి విచ్చినం అవ్వ‌డానికి ఆస్కారం లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట నిజమే అయినా, ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను చూస్తే టీడీపీ, జనసేన సంబంధాలు సమీప భవిష్యత్తులో కొనసాగేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీడీపీ ఇప్పటి వరకు జనసేనను బహిరంగంగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించలేదు. అదే సమయంలో జనసేన కూడా టీడీపీపై నేరుగా రాజకీయ యుద్ధానికి దిగలేదు.

వాస్తవానికి ఈ కూటమి కేవలం భావోద్వేగ సంబంధం కాదు. ఇది రాజకీయ అవసరాలపై నిర్మితమైన వ్యూహాత్మక బంధం. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించడంలో ఈ కలయిక కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ రాష్ట్రంలో వైసీపీ బలమైన ప్రతిపక్షంగానే ఉంది. అలాంటి పరిస్థితిలో టీడీపీ, జనసేన విడిపోవడం రెండు పార్టీలకూ రాజకీయంగా నష్టదాయకమే న‌ని ఇరు పార్టీల నేత‌ల‌కు తెలుసు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్‌కు ఉన్న యువత, కాపు సామాజిక వర్గ ప్రభావం పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడుతున్నాయి. టీడీపీకి జనసేన మద్దతు అవసరం ఉన్నట్లే, జనసేనకు అధికారంలో భాగస్వామ్యం ద్వారా రాజకీయ స్థిరత్వం అవసరం ఉంది. అందుకే చిన్న చిన్న విభేదాలు, వ్యక్తిగత వివాదాలు ఉన్నా, కూటమి వెంటనే కూలిపోతుందని అనుకోవడం క‌రెక్ట్ కాదు. పార్టీల కింది స్థాయి నేతల మధ్య ఉన్న విభేదాలు వైసిపి కోరుకుంటున్నట్లు కూటమిని బలహీనపరిచేంత స్థాయిలో లేవు.

Read More
Next Story