మోదీ సర్కార్ మెడలు వంచడంలో అభిజిత్ సెక్సెస్..!
x

మోదీ సర్కార్ మెడలు వంచడంలో అభిజిత్ సెక్సెస్..!

CJP ఉద్యమం, విద్యార్థుల ఆందోళనలు, సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యల మధ్య కీలకంగా మారిన అభిజిత్.


దేశ రాజకీయాల్లో ఏన్నో పార్టీలు విఫలమైన అంశంలో ఒక యువకుడు అభిజిత్ దీప్కే సక్సెస్ అయ్యాడు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అంశాలపై జాతీయ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కానీ ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసేలా మాత్రం ఏ పార్టీ కానీ, ఏ ఉద్యమం కానీ మలుపు తిరగలేదు. కానీ నీట్‌యూజీ-2026 పేపర్ లీక్ అంశాన్ని ఎండగడుతూ, యువతకు బొద్దింకలు అంటూ భారతదేశ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలతో పునాదులు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ, దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేయడంలో అభిజిత్ కీలకంగా నిలిచాడు. దీంతో ప్రస్తుతం దేశమంతా అభిజిత్ సక్సెస్ అయ్యాడనే అంటోంది. పెద్ద రాజకీయ పార్టీలకు సాధ్యం కాని స్థాయిలో ఒక యువ ఉద్యమం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిందని అభిజిత్ దీప్కే మద్దతుదారులు చెబుతున్నారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. రైతుల సమస్యలు, ఆర్థిక విధానాలు, సామాజిక అంశాలు, విద్యా వ్యవస్థ వంటి పలు విషయాలపై రాజకీయ పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిరసనలు చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాలను మార్చే స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో NEET వివాదంపై యువత ఆధారంగా ఏర్పడిన ఉద్యమం ప్రత్యేకంగా నిలిచిందనే చర్చ మొదలైంది.

CJP ఉద్యమం రాజకీయ పార్టీల సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సాగింది. సోషల్ మీడియా ప్రచారం నుంచి ప్రారంభమైన ఉద్యమం క్రమంగా క్షేత్రస్థాయి నిరసనలుగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు.

NEET వివాదం నుంచి ఉద్యమం వరకు

NEET UG 2026 పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగింది. పరీక్షలపై నమ్మకం దెబ్బతిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత, బాధ్యులపై చర్యలు, పరీక్షా వ్యవస్థలో మార్పులు వంటి డిమాండ్లు ముందుకు వచ్చాయి. ఈ డిమాండ్ల చుట్టూనే ఉద్యమం బలపడింది. కాక్రోచ్ ప్రతీకతో యువత ఒకే వేదికపైకి రావడం ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత అదే ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీగా రూపుదిద్దుకుంది. అభిజిత్ దీప్కే నేతృత్వంలో ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. భారీ ర్యాలీలు, ధర్నాలు, ప్రభుత్వంతో చర్చలు వంటి పరిణామాలతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

ఉద్యమం మొదటి నుంచి ప్రధాన డిమాండ్లలో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. పరీక్ష వ్యవస్థపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహించాల్సిందేనని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరీక్షల భద్రత, చట్టపరమైన చర్యలు, NTAలో మార్పులు వంటి అంశాలపై చర్యలు ప్రకటించింది. అయినప్పటికీ ఉద్యమకారులు తమ ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. చర్చలు జరిగినా, నిరసనలు కొనసాగాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో CJP వర్గాలు దీనిని తమ ఉద్యమానికి కీలక ఫలితంగా పేర్కొన్నాయి.

ఈ ఉద్యమ సమయంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా మద్దతు తెలిపారు. ఆయన నిరాహార దీక్ష చేపట్టి పరీక్షా వ్యవస్థలో మార్పులు, విద్యార్థులకు న్యాయం వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే తనకు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే లక్ష్యం కాదని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో లోతైన మార్పులు రావాలని, విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్‌కు CJP ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేదని అభిజిత్ దీప్కే తెలిపారు. ఆయన ఉద్యమానికి మద్దతు ఇచ్చారని, కానీ ఉద్యమ నిర్ణయాలు తమ వేదిక నుంచే తీసుకున్నామని స్పష్టం చేశారు.

NEET UG 2026 వివాదం ఒక పరీక్ష సమస్యగా మొదలై, పెద్ద యువజన ఉద్యమంగా మారింది. ఈ పరిణామం యువత రాజకీయ ప్రభావం, ప్రజా ఉద్యమాల శక్తి, ప్రభుత్వాలపై సామాజిక ఒత్తిడి వంటి అంశాలపై కొత్త చర్చకు దారితీసింది. అభిజిత్ దీప్కే పాత్రపై రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఒక యువ ఉద్యమం జాతీయ స్థాయిలో చర్చకు రావడం ఈ పరిణామాల్లో ప్రధాన అంశంగా నిలిచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ వివాదంలో ఒక కీలక దశ ముగిసింది. అయితే పరీక్షా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల విశ్వాసం పునరుద్ధరణ వంటి అంశాలు ఇంకా ముందున్న సవాళ్లుగానే ఉన్నాయి.

Read More
Next Story