చప్పట్ల నుంచి చట్టాల దాకా! రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు
x

చప్పట్ల నుంచి చట్టాల దాకా! రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు

సమాజం అంచుల్లో కాదు... ఇక నిర్ణయాల టేబుల్‌పై ట్రాన్స్‌జెండర్లు!


ర‌చ్చా రాజ‌కీయం @ 5 పి.ఎం.కు స్వాగ‌తం.

1) చప్పట్ల నుంచి చట్టాల దాకా! రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు

2) కోకాపేట్ IT SEZ రద్దు..! భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్?

3) మందు తాగి డ్రైవింగ్‌చేస్తే10 ఏళ్ల జైలు శిక్ష‌!

1) చప్పట్ల నుంచి చట్టాల దాకా! రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశానికే ఆదర్శంగా మారింది. ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో అధికారిక ప్రాతినిధ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నామినేటెడ్ సభ్యుడిగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌డంతో మున్సిపాలిటీల చట్టం-2019లో అవసరమైన సవరణలు చేస్తున్నారు.

ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులు ఉంటారు. తాజా నిర్ణయంతో ఆ సంఖ్యను ఆరుకు పెంచుతున్నారు. అదనంగా సృష్టించే ఒక స్థానాన్ని పూర్తిగా ట్రాన్స్‌జెండర్ల కోసం కేటాయించనున్నారు. దీంతో స్థానిక పాలనలో ఈ వర్గానికి ప్రత్యక్ష ప్రాతినిధ్యం లభించనుంది. ఇది కేవలం రాజకీయ రిజర్వేషన్‌నే కాదు, సామాజిక సమానత్వానికి కొత్త ప్రారంభం. దీంతో స్థానిక పాలనలో ఈ వర్గానికి ప్రత్యక్ష ప్రాతినిధ్యం లభించనుంది.

ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం... సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లను నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో భాగస్వాములను చేయడం. స్థానిక సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికల్లో వారి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సామాజిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. ట్రాన్స్‌జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే కీలక సంస్కరణగా దీనిని చూడవచ్చు. ఇప్పటి వరకు అట్టడుగు వర్గంగా మిగిలిపోయిన వారికి ప్రజాప్రతినిధులతో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించడం సామాజిక సమానత్వానికి కొత్త దిశగా భావిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సాధికారత కోసం పలు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు అమలు చేస్తోంది. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం కూడా ఈ మార్పుకు నిదర్శనంగా నిలిచింది.

ఇప్పుడు నామినేటెడ్ సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా... ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ గుర్తింపు మాత్రమే కాదు, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2) కోకాపేట్ IT SEZ రద్దు..! భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్?

హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటైన కోకాపేట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 25 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగని IT SEZ ప్రాజెక్టును రద్దు చేసి, ఆ భూములను బహిరంగ వేలం వేయాలని HMDA నిర్ణయించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీ-నోటిఫికేషన్‌కు ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ అనుమతి వస్తే.. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి మళ్లీ మార్కెట్‌లోకి రానుంది.

సుమారు 25 ఏళ్ల క్రితం కోకాపేట్‌లోని 117 ఎకరాల భూమిని 11 కంపెనీలకు IT స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) అభివృద్ధి కోసం లీజుకు ఇచ్చారు. అక్కడ ఐటీ కంపెనీలు, కార్యాలయాలు ఏర్పడి వేలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావించింది.

కానీ చాలా కంపెనీలు ప్రాజెక్టులను ప్రారంభించలేదు. మరికొన్ని లీజు నిబంధనలను కూడా పాటించలేదు. దీంతో భూమి ఏళ్ల తరబడి ఖాళీగానే ఉండిపోయింది.ప్రాజెక్టు అమలు కాకపోవడం, భూమి వినియోగంలోకి రాకపోవడం, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం వంటి కారణాలతో IT SEZ హోదాను రద్దు చేయాలని HMDA కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్రం డీ-నోటిఫికేషన్‌కు అనుమతి ఇస్తే.. దాదాపు 95 ఎకరాల భూమి మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది.

ప్రభుత్వానికి తిరిగి వచ్చే ఈ భూమిని HMDA బహిరంగ వేలం ద్వారా విక్రయించనుంది. కోకాపేట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఒకటి కావడంతో ఈ వేలంపై దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కంపెనీల ఆసక్తి ఉండే అవకాశం ఉంది.

కోకాపేట్‌కు ఆనుకుని ఉన్న నియోపోలిస్ లేఅవుట్‌లో గతంలో ఎకరా భూమి రూ.151 కోట్లకు పైగా ధర పలికింది. అదే స్థాయిలో బిడ్లు వస్తే ఈ 95 ఎకరాల వేలం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఆదాయం రూ.10 వేల కోట్లకు మించి ఉండొచ్చని చెబుతున్నప్పటికీ, తుది మొత్తం వేలంలో వచ్చే బిడ్లపైనే ఆధారపడి ఉంటుంది.

వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ప్రభుత్వ భూములను వేలం వేయడం తెలంగాణలో కొత్త విషయం కాదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం (2014–2023) హయాంలో సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ భూములను బహిరంగ వేలం వేసినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ముఖ్యంగా కోకాపేట్, నియోపోలిస్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో విలువైన భూములను విక్రయించి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమీకరించింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల విక్రయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు TGIIC ఆధ్వర్యంలో రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లో కలిపి సుమారు 33.5 ఎకరాలు, HMDA ఆధ్వర్యంలో మొకిల, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 44 ఎకరాల భూములు వేలం పూర్తయ్యాయి. అంటే మొత్తం సుమారు 77 నుంచి 78 ఎకరాల ప్రభుత్వ భూములు విక్రయమైనట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది.

అంతేకాదు.. భవిష్యత్ వేలాల కోసం కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. HMDA పరిధిలో సుమారు 5 వేల ఎకరాల భూమిని గుర్తించింది. తొలి దశలో 2,500 ఎకరాలను అభివృద్ధి చేసి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 13 వేల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

కోకాపేట్‌లో ఈ వేలం జరిగితే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో కీలక మైలురాయిగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. భూముల ధరలు, భవిష్యత్ పెట్టుబడులపై కూడా ఈ వేలం ప్రభావం చూపే అవకాశం ఉంది.

మొత్తానికి.. దాదాపు 25 ఏళ్లుగా నిలిచిపోయిన కోకాపేట్ IT SEZ ప్రాజెక్టుకు ముగింపు పలికే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీ-నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అత్యంత విలువైన ప్రభుత్వ భూములు మరోసారి బహిరంగ వేలంలోకి రానున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఉంది.

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చూస్తే... అప్పులపై ఏడాదికి రూ.21,304 కోట్ల వడ్డీ, మరో రూ.23,025 కోట్ల అసలు రుణాల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. అంటే అప్పుల కోసమే ప్రతి ఏడాది రూ.44 వేల కోట్లకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఇక 2026–27 బడ్జెట్ అంచనాల ప్రకారం... రాష్ట్రానికి రూ.2.43 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుండగా, మొత్తం వ్యయం రూ.3.24 లక్షల కోట్లకు చేరనుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండటంతో... ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం కొత్త రుణాలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ భూముల వేలం వంటి మార్గాల ద్వారా కూడా నిధులు సమీకరిస్తోంది.

3) మందు తాగి డ్రైవింగ్‌చేస్తే10 ఏళ్ల జైలు శిక్ష‌!

మందు తాగి వాహనం నడిపితే... ఇక చిన్న తప్పిదంగా తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి ఎవరి ప్రాణమైనా పోతే... గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ సైబరాబాద్ పోలీసులు భారీ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 237 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 205 మంది ద్విచక్ర వాహనదారులు, 28 మంది కార్ డ్రైవర్లు, 4 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అంటే మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిలో అత్యధికులు బైక్ రైడర్లే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఆల్కహాల్ స్థాయిలుబ్లడ్ ఆల్కహాల్ పరీక్షల్లో...219 మంది 36 నుంచి 200 mg మధ్య,5 మంది 201 నుంచి 300 mg మధ్య,13 మంది 301 నుంచి 550 mg వరకు అత్యధిక ఆల్కహాల్ స్థాయితో పట్టుబడ్డారు. ఈ కేసులన్నింటినీ త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

చట్టం ఏమి చెబుతోంది?మద్యం తాగి వాహనం నడపడం ఒక తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదం జరిగి ఎవరి ప్రాణమైనా పోతే... భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం 9 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. వీటిలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో యువత, చిన్నారులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్‌స్పీడింగ్. మరణాల్లో సగానికి పైగా వేగమే కారణమవుతోంది. హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఓవర్‌స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్‌ను గుర్తించేందుకు స్మార్ట్ కెమెరాలు, డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.మద్యం తాగి డ్రైవింగ్ చేయడం... మీ ప్రాణానికే కాదు, ఎదుటివారి జీవితానికీ ముప్పు. కాబట్టి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా ఇంటికి చేరండి.

Read More
Next Story