
తెలంగాణకోసం ప్రాణాలిచ్చారు దక్కిందేమిటి|ముస్లిం ఊరేగింపులో హిందూ ఏనుగు
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం. రౌండప్‌లో...
1) తెలంగాణ కోసం ప్రాణాలిచ్చారు.. దక్కిందేమిటి?
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో జూన్ 23వ తేదీ నుంచి ఉద్యమకారుల గుర్తింపుపై దశలవారీగా సంప్రదింపులు ప్రారంభం అవుతాయి. అందుకోసం విద్యార్థి జేఏసీ, కళాకారులు, రచయితలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రజా సంఘాలు, అడ్వకేట్లు, డాక్టర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని కమిటీ పేర్కొంది. 2001-2014 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో చర్చలు జరుపుతామని వివరించింది. ఈ ఉద్యమకారుల గుర్తింపుపై విస్తృత స్థాయిలో సూచనల సేకరిస్తామంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అభిప్రాయాల స్వీకరణ జరపనున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే... ఎవరు నిజమైన ఉద్యమకారులు? ఉద్యమకారుడిని ఎవరు నిర్ణయిస్తారు? ఇంకా గుర్తింపుకే నోచుకోని ఉద్యమకారులు ఎవరు?
2) ముస్లిం ఊరేగింపు... హిందూ ఏనుగు! బీబీ కా ఆలం వెనుక ఆసక్తికర కథ
ముస్లింల మొహర్రం ఊరేగింపుకు హిందూ దేవాలయాలు, జైన మఠాలకు చెందిన ఏనుగులు పాల్గొనడం ద్వారా హైదరాబాద్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న మతసామరస్యం, పరస్పర విశ్వాసం, మనిషితనాన్ని ఈ కథ ప్రతిబింబిస్తుంది.హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బీబీ కా ఆలం మొహర్రం ఊరేగింపు కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, నగరంలో నెలకొన్న మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మొహర్రం సందర్భంగా నిర్వహించే ఈ చారిత్రక ఊరేగింపులో పాల్గొనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
2026 మొహర్రం సందర్భంగా బీబీ కా ఆలం ఊరేగింపుకు నాయకత్వం వహించేందుకు కేరళకు చెందిన శిక్షణ పొందిన ఉత్సవ ఏనుగు “శ్రీదేవి” ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకుంది. కేరళలో దేవాలయ ఏనుగుల నిర్వహణ సాధారణంగా ప్రైవేట్ యజమానులు, దేవాలయాలు లేదా దేవస్వం బోర్డులు, అటవీ శాఖల సమన్వయంతో జరిగే ప్రత్యేక వ్యవస్థ కింద కొనసాగుతుంది. తెలంగాణలో స్వంతంగా ఈ సంప్రదాయానికి ఉపయోగించే ఏనుగు అందుబాటులో లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాల నుంచి శిక్షణ పొందిన దేవాలయ, మఠాల ఏనుగులను తీసుకువస్తున్నారు.
2019లో కర్ణాటకకు చెందిన “సుధా” అనే శిక్షణ పొందిన జైన/దేవాలయ ఏనుగు బీబీ కా ఆలం ఊరేగింపులో పాల్గొంది.
2021, 2022 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని శ్రీ 1008 శాంతినాథ్ దిగంబర్ జైన మఠానికి చెందిన “మాధురి” అనే ఏనుగు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
2023లో కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన ఏనుగులను ఊరేగింపు కోసం తీసుకువచ్చారు.
2024లో కర్ణాటకలోని శ్రీ కరిబసవేశ్వర మఠానికి చెందిన “రూపవతి” బీబీ కా ఆలం ఊరేగింపులో పాల్గొంది.
2025లో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కరిబసవ స్వామి మఠానికి చెందిన “లక్ష్మీ” ఈ చారిత్రక కార్యక్రమానికి నాయకత్వం వహించింది.ఇలా ప్రతి ఏడాది వివిధ రాష్ట్రాలకు చెందిన హిందూ దేవాలయాలు, జైన మఠాల ఏనుగులు బీబీ కా ఆలం ఊరేగింపులో పాల్గొనడం ద్వారా హైదరాబాద్‌లో మతాల మధ్య ఉన్న పరస్పర గౌరవం, సామాజిక ఐక్యత, మతసామరస్యం మరింత బలపడుతున్నాయి.

