UPIపై 0.4% ఛార్జ్.. ట్రేడర్ల ఆగ్రహం
x

UPIపై 0.4% ఛార్జ్.. ట్రేడర్ల ఆగ్రహం


UPI పేమెంట్ అంటే ఇప్పటి వరకు కస్టమర్‌కి ఫ్రీ. వ్యాపారికీ ఫ్రీ! కానీ ఇప్పుడు ఈ లెక్క మారుతోంది. ₹2,000 దాటిన కొన్ని UPI merchant paymentsపై 0.4 శాతం MDR! 0.4 శాతం అంటే చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదా? ₹5,000 పేమెంట్‌కి కేవలం ₹20. ₹10,000కి ₹40. ₹50,000కి ₹200. కానీ రోజుకు లక్షలు, కోట్ల రూపాయల UPI పేమెంట్లు తీసుకునే వ్యాపారులకు ఇదే 0.4 శాతం. నెలాఖరులో వేల నుంచి లక్షల రూపాయల ఖర్చుగా మారొచ్చు. ఇప్పటివరకు ఫ్రీగా ఉన్న UPI వ్యవస్థలో ఈ మార్పు ఎందుకు అవసరమైంది? ఇదే ఇప్పుడు UPI చుట్టూ మొదలైన అసలు చర్చ.

2026 ఆగస్టులోనే UPI ద్వారా 24,508.96 మిలియన్ ట్రాన్సాక్షన్లు, అంటే సుమారు 24.5 బిలియన్ లావాదేవీలు, ₹29.82 లక్షల కోట్ల విలువతో జరిగాయి. అయితే, ఇదే UPI ఇకపై పెద్ద మొత్తాల లావాదేవీలపై వ్యాపారులకు అదనపు ఖర్చు తెచ్చిపెట్టనుంది. అక్టోబర్ 15, 2026 నుంచి ₹2,000 దాటిన నిర్దిష్ట Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది.

ఇక్కడే ట్రేడర్లలో ఆందోళన మొదలైంది. 0.4 శాతం అంటే చిన్న సంఖ్యలా కనిపించినా.. రోజుకు వేల రూపాయలు, లక్షల రూపాయల UPI పేమెంట్లు తీసుకునే వ్యాపారులకు నెలాఖరులో ఇది గణనీయమైన ఖర్చుగా మారొచ్చని వారు చెబుతున్నారు. ఉదాహరణకు ₹3,000 UPI పేమెంట్‌పై MDR ₹12. ₹50,000 లావాదేవీకి ₹200. ₹75,000 దాటితే 0.4 శాతం లెక్కన ఎక్కువ వచ్చినా.. ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా ₹300కే పరిమితం చేస్తారు. ఈ మొత్తం కస్టమర్‌ నుంచి కాకుండా వ్యాపారి వైపు నుంచి వసూలవుతుందని ర‌మేష్ అనే వ్యాపారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“మార్జిన్ ఇప్పటికే తక్కువగా ఉంది. UPIని కస్టమర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న సమయంలో ప్రతి పెద్ద లావాదేవీపై MDR చెల్లించాల్సి వస్తే, అది మా నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. నగదు లావాదేవీల కంటే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాల్సిన సమయంలో కొత్త ఖర్చు ఎందుకు?” అని రిటైల్ వ్యాపారి వీర‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

మరో వ్యాపారి వెంక‌ట రాజ కోణంలో చూస్తే.. “రోజుకు ₹5 లక్షల UPI వ్యాపారం జరిగితే, అర్హత ఉన్న మొత్తం లావాదేవీలకు 0.4 శాతం వర్తించే సందర్భంలో రోజువారీ ఖర్చు ₹2,000 వరకు రావచ్చు. చిన్న మార్జిన్‌తో నడిచే వ్యాపారాలకు ఇది తేలికైన విషయం కాదు” అనేది ట్రేడర్ల వాదన.

అయితే ఈ మార్పు అన్ని UPI పేమెంట్లకూ వర్తించదు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. ₹2,000 వరకు ఉండే పేమెంట్లు, అలాగే నిర్దిష్ట చిన్న వ్యాపారుల zero-MDR లావాదేవీలు కూడా ఉచితమే. ప్రభుత్వం ప్రకారం మొత్తం P2M లావాదేవీల్లో సుమారు 96 శాతం ఈ మార్పుతో ప్రభావితం కావు.

రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని రంగాలకు ₹2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతానికి బదులుగా ₹5 ఫ్లాట్ MDR విధానం ఉంటుంది. MDR ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం లేదా NPCI పన్నుగా వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. బ్యాంకులు, పేమెంట్ యాప్స్ తదితర UPI ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములకు ఇది పంపిణీ అవుతుంది. UPI మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, ఆపరేషన్స్, భవిష్యత్ విస్తరణకు ఈ ఆదాయం ఉపయోగపడుతుందని అధికారిక వివరణ.

అయితే ట్రేడర్లకు మాత్రం అసలు ప్రశ్న ఖర్చు గురించే. UPI సౌకర్యం కొనసాగుతూనే, దాని నిర్వహణ భారం ఎంత వరకు వ్యాపారులపై పడాలి? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

Read More
Next Story