
సింగరేణి భరోసా యాత్ర ఓట్ల వేటేనా?
చెత్తకు చెక్... నాలాలకు ఊరట..!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) సింగరేణి భరోసా యాత్ర - ఓట్ల వేటేనా?
2) చెత్తకు చెక్...నాలాలకు ఊరట..!
1) సింగరేణి భరోసా యాత్ర ఓట్ల వేటేనా?
సింగరేణి... తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వేలాది కార్మికుల జీవనాధారం. ఇప్పుడు అదే సింగరేణి చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ చేపట్టిన 'సింగరేణి భరోసా యాత్ర' నిజంగానే కార్మికులకు భరోసా ఇవ్వడానికా? లేక రాజకీయ మైలేజ్ కోసమా? కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా పార్టీ నేతలు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు...భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో...బహిరంగ సభలు, గేట్ మీటింగ్‌లు, గనుల సందర్శన, కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
యాత్ర ఎందుకు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల-II కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలను కార్మికులకు వివరించడం. సింగరేణి భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయడం. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశమని బీజేపీ చెబుతోంది.
బీజేపీ వాదనసింగరేణిని బలోపేతం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కొత్త కోల్ బ్లాక్‌ను తీసుకొచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. 41 వేల మంది రెగ్యులర్, 30 వేలకుపైగా కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా కల్పించడానికే ఈ యాత్ర అంటోంది.కాంగ్రెస్ ఏమంటోంది?కాంగ్రెస్ మాత్రం ఇది రాజకీయ యాత్రేనని విమర్శిస్తోంది. సింగరేణిపై బీజేపీ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. కేంద్ర బొగ్గు విధానాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీఆర్ఎస్ వైఖరి సింగరేణి తెలంగాణ ఆస్తి అని బీఆర్ఎస్ చెబుతున్నది. కేంద్ర విధానాలతో ప్రైవేటీకరణ ప్రమాదం పెరుగుతోందని.
ఒక్క కోల్ బ్లాక్ కేటాయింపుతో సమస్యలు పరిష్కారం కావని.తాడిచెర్ల-II బ్లాక్‌తో లాభమేంటి?సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు. 40–50 ఏళ్ల ఉత్పత్తికి అవకాశం. ఏటా సుమారు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం. వేలం లేకుండా కేటాయించడంతో సుమారు ₹2,550 కోట్ల ప్రీమియం భారం తగ్గిందని కేంద్రం చెబుతోంది. ఉద్యోగాలు, రవాణా, అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.
సింగరేణి బొగ్గు గనుల్లో మొదలైన ఈ యాత్ర... కార్మికుల విశ్వాసాన్ని గెలుస్తుందా? లేక తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరతీస్తుందా? సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది.
2) చెత్తకు చెక్... నాలాలకు ఊరట..!
ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన నాలాలు, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పూడిక... ఎక్కడ చూసినా మురుగు... వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయే హైదరాబాద్... ఇప్పుడు మారుతోందా? ఆ మార్పుకు కారణం హైడ్రా చేపట్టిన భారీ పూడిక తీత ఆపరేషన్.
గత ఇరవై రోజులుగా నగరవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన పనులు సాగిస్తున్న హైడ్రా... వరద కాలువలను ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తోంది. ఏకంగా 1,570 ట్రక్కుల పూడికను బయటకు తరలించింది. మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు... డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు... రాత్రింబవళ్లు రంగంలోకి దిగి నాలాలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తున్నాయి. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెత్తను పూర్తిగా తొలగిస్తున్నాయి. ఏళ్లుగా మురుగుతో దుర్వాసన వెదజల్లిన నాలాలు... ఇప్పుడు మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టాయి. వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోవడంతో అనేక కాలనీల్లో నీరు నిలిచిపోయే పరిస్థితి తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఈ సమస్యకు అసలు కారణం ఎవరు?హైడ్రా చెబుతున్న సమాధానం ఒక్కటే... మనమే..! ఇంట్లో పనికిరాని సామాన్లు... ప్లాస్టిక్... నిర్మాణ వ్యర్థాలు... చెత్త కనిపించిన చోటల్లా కాలువల్లో పడేస్తున్నారు. అదే చివరకు వర్షాకాలంలో నగరాన్ని ముంచెత్తుతోంది. నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోతోంది. ఆ నీరంతా తిరిగి రోడ్లపైకి, కాలనీల్లోకి వచ్చేస్తోంది. అందుకే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. "చెత్తను నాలాల్లో వేయొద్దు... ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు ఇవ్వండి... లేకపోతే చెత్త కుండీల్లో మాత్రమే వేయండి. నగరాన్ని కాపాడేది హైడ్రా ఒక్కటే కాదు... ప్రజల బాధ్యత కూడా అంతే ముఖ్యం."ఇప్పుడు ప్రశ్న ఒక్కటే...హైడ్రా నాలాలను శుభ్రం చేస్తోంది... కానీ మన అలవాట్లు మారతాయా? చెత్త కాలువల్లో కాకుండా చెత్త కుండీల్లో పడితేనే... వర్షాకాలంలో హైదరాబాద్ నిజంగా వరదల నుంచి ఉపశమనం పొందుతుంది.

