
ఓట్ల గల్లంతుపై సీఎం సీరియస్! కాంగ్రెస్ నేతలకు సీఎం వార్నింగ్
పద్మశ్రీ ఇచ్చారు... పట్టా ఇవ్వరా? | RTC విలీనం అసలు సాధ్యమేనా? 40 వేల ఉద్యోగులు... ₹10 వేల కోట్ల భారం
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) ఓట్ల గల్లంతుపై సీఎం సీరియస్! కాంగ్రెస్ నేతలకు సీఎం వార్నింగ్
2) పద్మశ్రీ ఇచ్చారు... పట్టా ఇవ్వరా?
3) RTC విలీనం అసలు సాధ్యమేనా? 40 వేల ఉద్యోగులు... ₹10 వేల కోట్ల భారం
1. ఓట్ల గల్లంతుపై సీఎం సీరియస్! కాంగ్రెస్ నేతలకు సీఎం వార్నింగ్
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేస్తూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతు కాకుండా చూసే బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందని ఆయన హెచ్చరించారు.
సర్వే ప్రారంభమైన నాటి నుంచి 10 రోజుల పాటు నాయకుల పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చురుకుదనం కనిపించకపోతే నియోజకవర్గ ఇంచార్జ్‌లను మార్చేందుకు కూడా వెనుకాడబోమని అల్టిమేటం జారీ చేశారు. ఓటర్ల జాబితా సవరణను తేలికగా తీసుకోవద్దని, పేదల పేర్లు తొలగిపోతే వారికి భవిష్యత్తులో పలు సంక్షేమ పథకాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు గాంధీ భవన్‌లో ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బూత్ స్థాయి వరకు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నియోజకవర్గాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రీ-మ్యాపింగ్ ప్రక్రియలోనే రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశం అన్ని రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు మ్యాపింగ్‌కు దూరంగా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్‌లో 45 శాతం, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 43 శాతం, రంగారెడ్డిలో 56 శాతం ఓటర్ల వివరాలు ఇంకా సరైన మ్యాపింగ్‌లోకి రాలేదు. మొత్తంగా దాదాపు 57 లక్షల మంది ఓటర్ల సమాచారం ధృవీకరణ దశలోనే ఉంది.
జనాభా వలసలు, తరచూ ఇళ్లు మారడం, పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, కుటుంబ వివరాల్లో వ్యత్యాసాలు, వయసు నమోదులో సాంకేతిక లోపాలు వంటి కారణాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. అయితే మ్యాపింగ్ కాలేదనే కారణంతో ఎవరి పేరునూ వెంటనే తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని మూడు సార్లు సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వివరాలను సేకరించనున్నారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, నోటీసుల ప్రక్రియ కొనసాగుతుంది. మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసి, ఎన్నికల నమోదు అధికారులు (EROలు) విచారణ నిర్వహించి, అవసరమైన ఆధారాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నిరక్షరాస్యులు, వలస కూలీలు, తరచూ ఇళ్లు మారే అద్దెదారులు ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అర్హులైన ఒక్క ఓటరు కూడా సాంకేతిక కారణాలతో ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరమే అయినప్పటికీ, నిజమైన ఓటర్ల హక్కులు కాపాడటం ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.
2. పద్మశ్రీ ఇచ్చారు... పట్టా ఇవ్వరా?
ప్రపంచ వేదికపై తెలంగాణ కిన్నెర కళకు గుర్తింపు తీసుకొచ్చిన కళాకారుడు... 52 దేశాల ప్రతినిధుల ముందు కిన్నెర నాదాన్ని వినిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత... నేడు తనకే కేటాయించిన ఇంటి స్థలం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అవార్డులు వచ్చాయి... సన్మానాలు వచ్చాయి... కానీ తన భూమికి మాత్రం ఇప్పటికీ పట్టా రాలేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు దర్శనం మొగిలయ్య."
"నాగర్‌కర్నూల్ జిల్లా ఔసలికుంట గ్రామానికి చెందిన దర్శనం మొగిలయ్య, తెలంగాణకు చెందిన అరుదైన 12 మెట్ల కిన్నెర కళను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ జానపద కళాకారుడు. ఐదు తరాలుగా వస్తున్న ఈ కళను కాపాడేందుకు జీవితాన్నే అంకితం చేశారు." "కిన్నెర అనేది దక్కన్ ప్రాంతానికి చెందిన శతాబ్దాల నాటి తీగ వాయిద్యం. ఒకప్పుడు 7 నుంచి 9 మెట్లు మాత్రమే ఉండే ఈ వాయిద్యాన్ని, మొగిలయ్య తన ప్రతిభతో 12 మెట్ల కిన్నెరగా అభివృద్ధి చేశారు.
వెదురు, సొరకాయ బుర్రలు, తేనెటీగల మైనం, ఎద్దు కొమ్ములు వంటి సహజ వస్తువులతో తయారయ్యే ఈ వాయిద్యం తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచింది." "పేదరికం కారణంగా చదువు లేకపోయినా, కళపై ఉన్న అంకితభావంతో మొగిలయ్య కూలీగా పని చేస్తూనే కిన్నెర సంప్రదాయాన్ని కొనసాగించారు. భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్‌లో ఆయన గొంతు, కిన్నెర నాదం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి.
ఆ తరువాత 2022లో కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో ఆయనను సత్కరించింది." "మొగిలయ్య సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. హైదరాబాద్ సమీపంలోని కుంట్లూరులో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. నెలకు పది వేల రూపాయల గౌరవ వేతనం మంజూరు చేసింది. అంతేకాదు, ఆయన జీవిత చరిత్రను ఎనిమిదో తరగతి పాఠ్యాంశంలో కూడా చేర్చింది."
"అయితే ఇప్పుడు అదే 600 గజాల భూమి వివాదంలో చిక్కుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయిందని మొగిలయ్య చెబుతున్నారు. కానీ ఆ భూమిపై మరో వ్యక్తి హక్కు ఉందంటూ వివాదం తలెత్తడంతో పట్టా ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు." "కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కాలేదని మొగిలయ్య చెబుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదని వాపోతున్నారు."
"నేను పద్మశ్రీ అవార్డు అందుకున్న కళాకారుడిని. కానీ నా సమస్య మాత్రం ఎవరికీ పట్టడం లేదు. నాకు కేటాయించిన భూమిలోనే నన్ను నిలవనివ్వడం లేదు." "ప్రభుత్వం అందించిన కోటి రూపాయలను పిల్లల వివాహాలు, వైద్య ఖర్చుల కోసం వినియోగించాల్సి వచ్చిందని మొగిలయ్య చెబుతున్నారు. ప్రస్తుతం కోర్టు కేసులు, ప్రయాణ ఖర్చులు, న్యాయవాదుల ఫీజులు భరించలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు." "ప్రయాణ ఖర్చులకు, ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నా... నా భూమి నాకు దక్కాలి." "తన జీవితంలో మిగిలిన రోజుల్లో ఆ భూమిని పిల్లలకు పంచాలని ఉందని మొగిలయ్య చెబుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు ఎదుర్కొంటున్నానంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు."
"తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక కళాకారుడు... దేశ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న వ్యక్తి... నేడు తనకే కేటాయించిన భూమి కోసం పోరాడాల్సి వస్తోంది. కిన్నెర నాదంతో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శనం మొగిలయ్యకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది."
3. RTC విలీనం అసలు సాధ్యమేనా? 40 వేల ఉద్యోగులు... ₹10 వేల కోట్ల భారం...
40 వేల మంది ఉద్యోగులు... దాదాపు 10 వేల కోట్ల బాధ్యతలు... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ... ఇప్పుడు అదే హామీ ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారిందా? తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎందుకు ఇంకా అమలు కాలేదు? కార్మిక సంఘాలు ఇప్పుడు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి? అసలు RTC విలీనం అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక, పరిపాలనా వాస్తవాలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
RTC విలీనం అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం TGSRTC ఒక ప్రభుత్వ యాజమాన్య సంస్థ. అంటే ఇది నేరుగా ప్రభుత్వ శాఖ కాదు. దీనికి ప్రత్యేక చట్టం, ప్రత్యేక బోర్డు, ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి. ప్రస్తుతం RTC ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కార్పొరేషన్ ఉద్యోగులు. వారి వేతనాలు ప్రధానంగా RTC ఆదాయాలపై ఆధారపడి ఉంటాయి. అయితే విలీనం జరిగితే, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది. వేతనాలు, పెన్షన్లు, సర్వీస్ రూల్స్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్తాయి. ఉద్యోగ భద్రత పెరుగుతుందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కానీ ఈ ప్రక్రియ అంత సులభం కాదు.
RTC విలీనం డిమాండ్ కొత్తది కాదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచే ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే, ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పెన్షన్ సమస్యలు, సంస్థ ఆర్థిక ఇబ్బందులు. 2019 RTC సమ్మె తర్వాత ఏమైంది? 2019లో జరిగిన చారిత్రాత్మక RTC సమ్మెతో ఈ అంశం మరింత వేడెక్కింది. అప్పుడు వేలాది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. విలీనం ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మారింది. అయితే అప్పటి ప్రభుత్వం విలీనానికి అంగీకరించలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని ప్రకటించింది. దీంతో RTC ఉద్యోగుల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరిగాయి. విలీనంపై సానుకూల సంకేతాలు ఇచ్చామని జేఏసీ చెబుతోంది. ఇప్పుడు వివాదం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం RTCలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇక్కడే కొత్త వివాదం మొదలైంది. జేఏసీ డిమాండ్ ఏమిటంటే, ముందుగా విలీనం చేయాలి... తర్వాత ఎన్నికలు జరపాలి. ప్రభుత్వం మాత్రం, ముందు ఎన్నికలు... తర్వాత విలీనం అంశంపై నిర్ణయం అనే దిశగా అడుగులు వేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
8 ఏళ్లుగా ఎన్నికలు ఎందుకు జరగలేదు?
2019 RTC సమ్మె తర్వాత అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘాల గుర్తింపును రద్దు చేసింది. ఆ తర్వాత: కోవిడ్ ప్రభావం ఆర్థిక సమస్యలు పరిపాలనా కారణాలు వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలైలో ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

