పిల్లలు గేమ్‌లో... భవిష్యత్తు రిస్క్‌లో?
x

పిల్లలు గేమ్‌లో... భవిష్యత్తు రిస్క్‌లో?

రీసైకిల్ వాటర్‌తో డేటా సిటీ! | లక్షలాది విద్యార్ధుల్లో పెరిగిపోతున్న అయోమయం


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం....

1) పిల్లలు గేమ్‌లో... భవిష్యత్తు రిస్క్‌లో?

2) రీసైకిల్ వాటర్‌తో డేటా సిటీ!

3) ఫీజు బకాయిలపై ఆగస్టు 15 డెడ్‌లైన్...

1) పిల్లలు గేమ్‌లో... భవిష్యత్తు రిస్క్‌లో?

ఒకప్పుడు పిల్లల చేతిలో ఆటబొమ్మలు ఉండేవి.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వినోదం కోసం మొదలైన ఆన్‌లైన్ గేమింగ్.. కొందరు పిల్లల్లో వ్యసనంగా మారుతోందా? గేమ్‌లో స్కిన్స్, ఎలైట్ పాస్‌లు, వర్చువల్ రివార్డ్స్ కోసం కుటుంబాల డబ్బులు ఖర్చవుతున్నాయా? చదువు, నిద్ర, ఆరోగ్యంపై గేమింగ్ ప్రభావం ఎంత వరకు ఉంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమింగ్ డిజార్డర్‌ను ఎందుకు మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది? "ఆన్‌లైన్ గేమ్స్ పిల్లలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి? తల్లిదండ్రుల ఖాతాల నుంచి వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? గేమింగ్ డిజార్డర్ అనే మానసిక సమస్య ఎంత ప్రమాదకరం? హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ జారీ చేసిన హెచ్చరిక వెనుక ఉన్న కారణాలేంటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?" పిల్లల భవిష్యత్తుపై ఆన్‌లైన్ గేమ్స్ ప్రభావం గురించి ఈ ప్రత్యేక కథనం.

గేమ్స్ ఆడుతుంటే.. డబ్బులు ఎక్కడికి పోతున్నాయి?ఇటీవలి కాలంలో కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయంటూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మొదట ఇవి సైబర్ మోసాలుగా కనిపించినా, దర్యాప్తులో మరో వాస్తవం బయటపడుతోంది. పిల్లలు కుటుంబ సభ్యుల ఫోన్లలో సేవ్ చేసిన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ ఖాతాలను ఉపయోగించి గేమ్స్‌లో కొనుగోళ్లు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

గేమ్‌లో ప్రత్యేక దుస్తులు, ఆయుధాలు, స్కిన్స్, ఎలైట్ పాస్‌లు, ఇతర వర్చువల్ వస్తువులు కొనుగోలు చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఫోన్లలో సేవ్ చేసిన బ్యాంకింగ్ వివరాలు పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండటం సమస్యను మరింత పెంచుతోంది.పిల్లలు ఎందుకు అంతగా ఆకర్షితులవుతున్నారు?

10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ గేమ్స్‌లో గెలవడం మాత్రమే కాదు, ప్రత్యేక వస్తువులు కలిగి ఉండటం కూడా ప్రతిష్టగా మారుతోంది.స్నేహితుల మధ్య గుర్తింపు పొందాలనే కోరిక, కొత్త లెవెల్స్ చేరుకోవాలనే ఆసక్తి, అరుదైన వస్తువులు సొంతం చేసుకోవాలనే తపన పిల్లలను మరింత సమయం, డబ్బు ఖర్చు చేసేలా చేస్తోంది. చాలామంది విద్యార్థులు చదువుల కోసం ఇచ్చిన మొబైల్ ఫోన్లనే గేమింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి.

గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరం?

ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమింగ్ డిజార్డర్‌ను ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది. గేమ్స్ ఆడటంపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సంబంధాల కంటే గేమింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వడం, దాని వల్ల నష్టం జరిగినా అలవాటు కొనసాగించడం వంటి లక్షణాలు ఉంటాయి.ఇది కేవలం ఒక అలవాటు సమస్య మాత్రమే కాదు. దీని వల్ల చదువులో వెనుకబడే ప్రమాదంనిద్రలేమికంటి సమస్యలుచిరాకు, కోపం పెరగడంకుటుంబ సభ్యులతో దూరం పెరగడంసామాజిక సంబంధాలు తగ్గిపోవడంవంటి ప్రభావాలు కనిపించవచ్చు.

నిషేధమే పరిష్కారమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం గేమ్స్‌ను పూర్తిగా నిషేధించడం ఎల్లప్పుడూ సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే అలా చేస్తే పిల్లలు మరింత రహస్యంగా గేమింగ్ చేసే అవకాశం ఉంటుంది.

దానికి బదులుగా పిల్లలతో మాట్లాడటం, గేమ్స్ గురించి తెలుసుకోవడం, సమయ పరిమితులు నిర్ణయించడం, డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించడం మెరుగైన మార్గంగా భావిస్తున్నారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లల డిజిటల్ భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు అవసరం.పిల్లలు ఉపయోగించే పరికరాల్లో సేవ్ చేసిన కార్డులు, యూపీఐ ఆటోఫిల్ తొలగించాలి.ప్రతి కొనుగోలుకు పిన్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయాలి.ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో పేరెంటల్ కంట్రోల్స్ ఏర్పాటు చేయాలి.

లావాదేవీలకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలి.

రోజువారీ స్క్రీన్ టైమ్‌కు పరిమితులు విధించాలి.

రాత్రి ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించాలి.

పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తే నిపుణుల సలహా తీసుకోవాలి.

సాంకేతికతను పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాదు. అలాగే గేమింగ్‌ను పూర్తిగా తప్పు అని కూడా చెప్పలేం. కానీ నియంత్రణ లేని గేమింగ్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు మొబైల్ ఇవ్వడం మాత్రమే కాదు, వారు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో గమనించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. వినోదం వ్యసనంగా మారకముందే అప్రమత్తం కావడం కుటుంబాలందరికీ అవసరం.

-------------------------------------------

2) రీసైకిల్ వాటర్‌తో డేటా సిటీ!

డేటా సెంటర్లకు విద్యుత్ ఎంత కీలకమో... నీరు కూడా అంతే అవసరం. వేలాది సర్వర్లను నిరంతరం చల్లగా ఉంచాలంటే ప్రతిరోజూ లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అయితే భవిష్యత్తులో హైదరాబాద్ శివారులో నిర్మించనున్న భారీ ఆలూర్ డేటా సెంటర్ సిటీ కోసం తాగునీటిని కాకుండా... శుద్ధి చేసిన మురుగునీటినే వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలోని ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన వందల మిలియన్ లీటర్ల నీటిని ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా డేటా సెంటర్లకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు భవిష్యత్తు డిజిటల్ పరిశ్రమలకు నీటి భద్రత... మరోవైపు విలువైన తాగునీటి వనరుల సంరక్షణ... ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఆలూర్ డేటా సిటీ కోసం రూపొందిస్తున్న ఈ ప్రత్యేక వాటర్ మేనేజ్‌మెంట్ మోడల్ ఎలా పనిచేస్తుంది? దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీ వెనుక ఉన్న నీటి వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో.

ఆలూర్ డేటా సిటీ కోసం మురుగునీరే మహా పరిష్కారమా?ఆలూర్ డేటా సిటీ కోసం STP నీటి వినియోగం.. 530 MLD శుద్ధి చేసిన నీరు.. ప్రత్యేక పైప్‌లైన్లతో సరఫరాడేటా సెంటర్ అంటే కంప్యూటర్లు, సర్వర్లు మాత్రమే కాదు... వాటిని 24 గంటలు చల్లగా ఉంచేందుకు అపారమైన నీరు కూడా అవసరం. వేలాది సర్వర్లు నిరంతరం పనిచేసే డేటా సెంటర్లలో కూలింగ్ కోసం ప్రతి రోజూ లక్షల లీటర్ల నీరు వినియోగిస్తారు. అయితే తాగునీటిని పరిశ్రమలకు మళ్లిస్తే ప్రజల అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే భిన్నమైన మోడల్‌ను అమలు చేయబోతోంది. నగరంలోని మురుగునీటిని శుద్ధి చేసి... అదే నీటిని ఆలూర్ డేటా సెంటర్ సిటీకి తరలించే ప్రణాళిక సిద్ధం చేసింది.

రంగారెడ్డి జిల్లా ఆలూర్‌లో 1500 ఎకరాల్లో దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో 11 గిగావాట్ల సామర్థ్యంతో ఈ మెగా డేటా హబ్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, CtrlS, NTT డేటా, STT, సిఫీ వంటి అంతర్జాతీయ సంస్థలు విస్తరణకు ఆసక్తి చూపుతున్నాయి.అయితే ఇంత పెద్ద డేటా సెంటర్ నగరానికి అత్యంత కీలకమైన అవసరం విద్యుత్ మాత్రమే కాదు... భారీ మొత్తంలో నీరు కూడా. వేలాది సర్వర్లను నిరంతరం చల్లబరచేందుకు కూలింగ్ టవర్లు, చిల్లర్ వ్యవస్థలు పెద్దఎత్తున నీటిని వినియోగిస్తాయి. దీంతో మొదట నీటి అవసరాన్ని ఎలా తీర్చాలన్న దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ సమస్యకు ప్రభుత్వం కనిపెట్టిన పరిష్కారం... మురుగునీటి రీసైక్లింగ్. హైదరాబాద్ వాటర్ బోర్డు నిర్వహిస్తున్న 41 ఎస్‌టీపీల్లో ప్రస్తుతం రోజుకు సుమారు 1750 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ధి అవుతోంది. ఇందులో దాదాపు 530 మిలియన్ లీటర్ల నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ప్రణాళిక సిద్ధమైంది.అంటే తాగునీటిని వినియోగించకుండా... ఇప్పటికే శుద్ధి చేసిన నీటినే డేటా సెంటర్ల కూలింగ్‌కు ఉపయోగిస్తారు. దీంతో ఒకవైపు నగర తాగునీటి నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు శుద్ధి చేసిన నీటికి స్థిరమైన వినియోగం ఏర్పడుతుంది. ఇది నీటి సంరక్షణలో కూడా కీలక అడుగుగా భావిస్తున్నారు.

శుద్ధి చేసిన నీరు తయారవడం ఒక్కటే కాదు... అది డేటా సెంటర్లకు చేరాల్సి కూడా ఉంటుంది. అందుకోసం ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది. అత్తాపూర్ నుంచి చందన్‌వెల్లి వరకు 41 కిలోమీటర్ల పైప్‌లైన్... నాగోల్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మరో 56.6 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.ఈ ప్రత్యేక నెట్‌వర్క్ ద్వారా శుద్ధి చేసిన నీరు నేరుగా డేటా సెంటర్లు, పరిశ్రమలకు చేరుతుంది. దీంతో మంచినీటి సరఫరాపై ఎలాంటి భారం పడకుండా పారిశ్రామిక అవసరాలు తీరేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

డేటా సెంటర్ సిటీ అంటే కేవలం డిజిటల్ పెట్టుబడులు మాత్రమే కాదు... నీటి నిర్వహణలోనూ కొత్త విధానానికి శ్రీకారం. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పరిశ్రమలకు వినియోగించడం ద్వారా ఒకేసారి రెండు లక్ష్యాలను తెలంగాణ ప్రభుత్వం సాధించాలని చూస్తోంది. ఒకటి... భవిష్యత్తు డిజిటల్ పరిశ్రమలకు అవసరమైన నీటి భద్రత. రెండోది... విలువైన తాగునీటి వనరులను సంరక్షించడం. ఈ మోడల్ విజయవంతమైతే... దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

-------------------------------

3) ఫీజు బకాయిలపై ఆగస్టు 15 డెడ్‌లైన్...

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎంత ఉన్నాయి? ఈ సమస్య ఎప్పటి నుంచి కొనసాగుతోంది? బకాయిల భారం వల్ల కాలేజీలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? సర్టిఫికెట్లు నిలిపివేత, ఉద్యోగ అవకాశాల కోల్పోవడం వంటి పరిణామాలు ఎంతవరకు నిజం? హైకోర్టు జోక్యంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఆగస్టు 15లోపు బకాయిలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందా? 5 లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ కీలక అంశంపై పూర్తి విశ్లేషణ.

తెలంగాణలో లక్షలాది మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది. వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు, ప్రభుత్వ కొత్త జీవో, కాలేజీల ఆర్థిక ఇబ్బందులు... చివరకు విద్యార్థుల భవిష్యత్తుపైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర కోర్సులు నిర్వహిస్తున్న సుమారు 2,400 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ పథకంలో ఉన్నాయి.

అయితే గత కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఫీజు బకాయిలు ప్రస్తుతం రూ.7,500 కోట్ల నుంచి రూ.12,500 కోట్ల మధ్య ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన బకాయిలు రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు చేరాయని చెబుతున్నాయి.దాదాపు 900కు పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్, బీఎడ్ తదితర విద్యాసంస్థలు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.

ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం మరోవైపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ GO-9 జారీ చేయడంతో కాలేజీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పిటిషన్లలో పేర్కొన్నాయి.ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

"ప్రభుత్వం బకాయిలు చెల్లించదు... విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవద్దంటుంది... మరి కాలేజీలు ఎలా నడపాలి?" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది? పెండింగ్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తుంది? పూర్తి వివరాలతో కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.అంతేకాదు... ప్రభుత్వం తీసుకొచ్చిన GO-9పై వచ్చే మంగళవారం వరకు మధ్యంతర స్టే విధించింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది కీలక హామీ ఇచ్చారు.2026 ఆగస్టు 15 నాటికి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని హైకోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నిధులు విడుదలైతే తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని కాలేజీల యాజమాన్యాలు కూడా వెల్లడించాయి.

ఈ కేసులో మరో కీలక అంశం విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు. ఫీజు బకాయిలు రావడం లేదనే కారణంతో విద్యార్థుల డిగ్రీలు, మెమోలు, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు నిలిపివేయడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వం-కాలేజీల మధ్య ఆర్థిక వివాదాలకు విద్యార్థుల భవిష్యత్తును బలి చేయలేమని స్పష్టం చేసింది. ఏ విద్యార్థి సర్టిఫికెట్‌ను కూడా నిలిపివేయరాదని, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అవసరమైతే ఇండెమ్నిటీ బాండ్ ("ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోతే లేదా భవిష్యత్తులో ఏదైనా బకాయి చెల్లించాల్సి వస్తే, నిబంధనల ప్రకారం నేను బాధ్యత వహిస్తాను. అందువల్ల నా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పుడే విడుదల చేయండి.") తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించింది.

ఈ సంక్షోభం వల్ల ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన పేద కుటుంబాల విద్యార్థులే.

బకాయిల కారణంగా కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా... మరోవైపు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం, ఉన్నత విద్య, విదేశీ చదువులకు దరఖాస్తు చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వం మరో ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసే విధానం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే విధానంపై కూడా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు కోరింది.

ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే...ప్రభుత్వం హైకోర్టు కోరిన పూర్తి రోడ్‌మ్యాప్‌ను సమర్పిస్తుందా?ఆగస్టు 15లోపు వేల కోట్ల రూపాయల బకాయిలు నిజంగానే విడుదల అవుతాయా?లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ కేసులో వచ్చే విచారణ ఇప్పుడు కీలకంగా మారింది.

Read More
Next Story