జంటనగరాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త
x
MMTS Trains

జంటనగరాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త

జంట నగరాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. నగర శివార్లలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుండటంతోపాటు మౌలాలి-హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపనుంది. దీంతో దశాబ్దాలుగా రైల్వే ప్రయాణికులు పడుతున్న సమస్యలు తీరనున్నాయి.


హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో దశాబ్దాలుగా రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు భారతీయ రైల్వే అధికారులు చరమగీతం పాడనున్నారు. జంటనగరాలతోపాటు నగర శివారు ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో అత్యంత రద్దీగా మారింది. సికింద్రాబాద్ స్టేషనులో పది ఫ్లాట్ ఫాంలున్నా 227 రైళ్లు వచ్చిపోతుండటంతో ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. దీనికి తోడు చెన్నై, విశాఖపట్టణం, కోల్‌కతా, ఢిల్లీ, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సికింద్రాబాద్ స్టేషనుకు వస్తుండటంతో ఇక్కడ రైళ్లు నిలిపేందుకు ప్లాట్ ఫాం ఖాళీ లేక గంటల తరబడి పలు రైళ్లను అవుటర్ లోనే నిలిపివేయాల్సి వస్తుంది. పలు రైళ్లు సకాలంలో నగరానికి వచ్చినా స్టేషనులో ప్లాట్ ఫాం ఖాళీ లేక అవుటర్ లోనే నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో దశాబ్దాలుగా రైల్వే ప్రయాణికులు గమ్యస్థానానికి చేరువకు వచ్చినా రైలుకు స్టేషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో అవుటర్ లోనే నిలిపి ఉంచాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇలా రైల్వే ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషను చేరువకు వచ్చినా స్టేషనుకు చేరుకోవాలంటే నిరీక్షణ తప్పేది కాదు. ప్రస్థుతం కొత్తగా నగర శివార్లలోని చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ మార్చి మొదటివారంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దీంతో అవుటర్‌లో రైళ్ల నిరీక్షణకు ఇక తెర పడనుంది.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధం

జంటనగరాల్లో ప్రస్థుతం సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పెరిగిన ప్రయాణికుల సంఖ్యతో పాటు రద్దీని నివారించేందుకు కొత్తగా 221 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. అవుటర్ రింగ్ రోడ్డుకు అర కిలోమీటరు దూరంలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషను దూరంలో ఉండటంతో ప్రయాణికులకు అనువుగా మారనుంది. చర్లపల్లిలో ఏడు ప్లాట్ ఫాంలలో రెండింటిని ఎంఎంటీఎస్ రైళ్లకు కేటాయించారు. 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, పాదచారుల వంతెనలు,బయో మరుగుదొడ్లు, ఎల్ఈడీ తెరలు, లైట్లు, రైల్వే టికెట్ కౌంటర్లు, పార్శిల్ బుకింగ్ కౌంటరును నిర్మించారు. స్టేషను నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించేలా రోడ్లను విస్తరించనున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రావడం వల్ల తమ ప్రాంత ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుందని వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

అధునాతన సౌకర్యాలు

అధునాతన సౌకర్యాలతో రైల్వే ప్రయాణికులకు ఈ రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ స్టేషనులో ప్రయాణికులు వేచి ఉండేందుకు వెయిటింగ్ రూంలు, కెఫిటేరియాలు, రెస్టారెంట్లు నిర్మించారు. ఈ ప్లాట్ ఫాం 24 రైలు బోగీలు నిలిపేలా స్టేషన్‌‌ను నిర్మించారు. రెండు సబ్ వేలను కూడా నిర్మించారు. విశాలమైన రెండు ఐల్యాండ్ ప్లాట్ ఫాంలు, రైళ్ల నిర్వహణకు రైల్వేయార్డు, 8 లక్షల లీటర్ల కెపాసిటీతో కూడిన నీళ్ల ట్యాంకు, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు. విమానాశ్రయం పోలి ఉండేలా అధునాతన సౌకర్యాలతో రైల్వే ప్రయాణికుల కోసం టెర్మినల్ సిద్ధం చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం, రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లకు పచ్చజెండా ఊపడం వల్ల ప్రయాణికుల కష్టాలు తీరి సౌకర్యాలు మెరుగుపడతాయని దక్షిణ మధ్య రైల్వే మజ్ధూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు యాదవరెడ్డి చెప్పారు.

మార్చి మొదటివారంలో మోదీ ప్రారంభం

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తోపాటు మౌలాలి – హైటెక్‌ సిటీ రెండో దశ ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి మొదటివారంలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో రైళ్ల ఒత్తిడిని తగ్గించడానికి లింగంపల్లి నుంచి సనత్ నగర్, మౌలాలీ, చర్లపల్లి మీదుగా విజయవాడ వైపు రైళ్లు రాకపోకలు సాగించవచ్చని సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ అధికారి చెప్పారు. దీంతోపాటు హైటెక్ సిటీ నుంచి సనత్ నగర్, మౌలాలీ వరకు రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు మార్చి మొదటివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య రెండో రైల్వే లైను పనులు పూర్తయ్యాయి.

మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మార్గంలో కొత్తగా ఆరు స్టేషన్లు

మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నారు. మౌలాలి-సనత్‌నగర్ మధ్య 22 కిలోమీటర్ల పరిధిలో మరో ఆరు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మౌలాలి ప్రాంతాల వారు కేవలం 30 నిమిషాల్లోనే ఐటీ సంస్థలు ఉండే హైటెక్ సిటీకి చేరుకునే అకాశం ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది వరకూ ఐటీ ఉద్యోగులు ఉంటారని రైల్వే ప్రయాణికుల సంఘం అద్యక్షుడు నూర్ చెప్పారు.

పట్టాలెక్కనున్న రెండోదశ ఎంఎంటీఎస్ రైళ్లు

ఇటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుండటంతోపాటు ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కడంపై జంటనగరాల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి ప్రాంత వాసులు ఐటీ కారిడార్‌కు రావాలంటే నేరేడ్‌మెట్, ఆర్‌కేపురం వంతెన, కంటోన్మెంట్, బేగంపేట మీదుగా వస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు సనత్‌నగర్‌, పీర్జాదీగూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్, అమ్ముగూడ, నేరేడ్‌మెట్, హౌసింగ్‌బోర్డు కాలనీ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనున్నాయి. దీంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.

Read More
Next Story