
2 ఏళ్లలో 3,315 ఎకరాలు! లక్షన్నర కోట్ల భూమిని కాపాడిన హైడ్రా!
శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న బహదూర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు
శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న బహదూర్‌గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేస్తుంటే.. మరోవైపు రైతులు తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని తొలగించడం, గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని బహదూర్‌గూడ గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. హైడ్రా సిబ్బంది భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ 10 రోజులుగా రైతులు దీక్ష నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి అధికారులు దీక్షా శిబిరాన్ని తొలగించడంతో పాటు అక్కడ కూడా ఫెన్సింగ్ వేశారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించి, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ భూమిని భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేటాయించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. తమ భూములు తీసుకుంటే మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని, లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
అధికారుల ప్రకారం బహదూర్‌గూడలోని 650 ఎకరాలు ప్రభుత్వ భూమి. 1954 కాస్రా పహాణి ప్రకారం 25, 26 సర్వే నంబర్లలో ఉన్న ఈ భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది. 2002 నుంచి 2006 మధ్య నిర్వహించిన సర్వేల్లో కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారణ అయిందని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో కొందరు ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించినా.. 2006లో సీసీఎల్‌ఏ తిరస్కరించింది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున భూముల కేటాయింపుపై నిషేధం ఉందని అప్పుడే స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
హైడ్రా ప్రకారం.. కొందరు రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా.. మరికొందరు ఫామ్ హౌస్‌లు నిర్మించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని హైడ్రా వెల్లడించింది.
హైడ్రా తాజా చర్యల్లో మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.బహదూర్‌గూడలో – 650 ఎకరాలురాయదుర్గంలో – 84 ఎకరాలుకంటోన్మెంట్ పరిధిలో – 106 ఎకరాలుఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
హైడ్రాకు రెండేళ్లు.. ఇదిలా ఉండగా హైడ్రా ఏర్పాటు అయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో సంబరాలు నిర్వహించారు. పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాల నుంచి రక్షించబడటంతో నగరానికి మేలు జరిగిందంటూ ప్రజలు ర్యాలీలు చేపట్టారు. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
హైడ్రా ఇప్పటివరకు 3,315 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిందని, వాటి మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా హైడ్రా తరహా చర్యలను విస్తరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఒకవైపు ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమిని రక్షించే చర్య అని చెబుతోంది. మరోవైపు రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహదూర్‌గూడ భూ వివాదం ఇప్పుడు చట్టపరంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

