
ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి? రేసులో 4 కీలక నేతలు!
ఖైరతాబాద్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ టికెట్‌పై 2023లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖైరతాబాద్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్లో మాత్రం అభ్యర్థి ఎంపికపై చర్చ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ టికెట్ కోసం పలువురు నేతల పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మొదటగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన అనుభవం ఆయనకు ఉంది. పీజేఆర్ కుటుంబానికి ఖైరతాబాద్‌తో ఉన్న పాత రాజకీయ అనుబంధం, నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారవచ్చనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
ఇక దాసోజు శ్రవణ్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. గతంలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రవణ్.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంతో ఉన్న అనుబంధంతో పాటు బీసీ సామాజిక సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉండొచ్చనే చర్చ ఉంది.
మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఉపఎన్నికపై చర్చ మొదలైనప్పటి నుంచే సాయికిరణ్‌ను ఖైరతాబాద్ నుంచి బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన సాయికిరణ్.. ఇప్పుడు అసెంబ్లీ బైపోల్ ద్వారా మరోసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రావాలని చూస్తున్నారనే చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్లో చాలాకాలంగా పనిచేస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డి పేరు కూడా మరోసారి వినిపిస్తోంది. 2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన మన్నె.. 2018, 2023 ఎన్నికల్లో దానం నాగేందర్‌కు అవకాశం ఇవ్వడంతో పార్టీ నిర్ణయానికి సహకరించారని ఆయన వర్గం చెబుతోంది. దీంతో ఈసారి పార్టీ ఆయన పేరును కూడా పరిశీలించవచ్చనే చర్చ ఉంది.
అంటే ప్రస్తుతం ఖైరతాబాద్ టికెట్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు.. విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, తలసాని సాయికిరణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి.అయితే పేరు ఎవరిదైనా.. బీఆర్ఎస్ అధిష్టానం కొన్ని కీలక అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ఎవరికి ఎంత బలం ఉంది? పార్టీ క్యాడర్‌ను ఎవరు సమన్వయం చేయగలరు? స్థానికంగా సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఎవరి రాజకీయ నేపథ్యం ఉపయోగపడుతుంది? గత ఎన్నికలు, బైపోల్స్‌లో వచ్చిన ఫలితాల నుంచి ఏం నేర్చుకోవాలి? అనే అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఇటీవల జరిగిన బైపోల్స్‌లో అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. ఖైరతాబాద్ విషయంలో మాత్రం తొందరపడకుండా సర్వేలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ప్రచారం.
ఇక దానం నాగేందర్ అనర్హతపై స్పందించిన కేటీఆర్.. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే పరిణామాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో ఖైరతాబాద్ ఎన్నిక బీఆర్ఎస్కు మరో సాధారణ ఉపఎన్నిక కంటే రాజకీయంగా ప్రాధాన్యమైన పోరుగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం అసలు ప్రశ్న. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగేది ఎవరు? దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టులో న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో ఒకవైపు. మరోవైపు బీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందో మరోవైపు ఆసక్తిని పెంచుతున్నాయి.
చివరికి విష్ణువర్ధన్ రెడ్డా? దాసోజు శ్రవణ్నా? తలసాని సాయికిరణ్నా? లేక మన్నె గోవర్ధన్ రెడ్డినా? అనేది పార్టీ అధిష్టానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

