రైలు పట్టాలపై రాజకీయ ప్లాన్? కిషన్‌రెడ్డి కొత్త స్ట్రాటజీ..!
x

రైలు పట్టాలపై రాజకీయ ప్లాన్? కిషన్‌రెడ్డి కొత్త స్ట్రాటజీ..!


తెలంగాణలో ఇప్పుడు రైల్వే ట్రాక్‌లపై కేవలం రైళ్లు మాత్రమే పరుగులు పెట్టడం లేదు. రాజకీయ వ్యూహాలు కూడా పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులతో నేరుగా కనెక్ట్ అవుతూ రాజకీయ మైలేజ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రశ్న వినిపిస్తోంది. కిషన్‌రెడ్డి ఫోకస్ రైల్వేలపైనా? లేక రైల్వేల ద్వారా రాజకీయ కనెక్టివిటీ పెంచుకోవడంపైనా?

వందే భారత్ రైళ్లు, కవచ్ టెక్నాలజీ, కొత్త రైల్వే లైన్లు, కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇప్పుడు వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన. తెలంగాణ ప్రజలతో మరింత బలమైన రాజకీయ కనెక్షన్ ఏర్పరచుకునే ప్రయత్నం జరుగుతోందా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను తీసుకుంటే, రోజుకు సుమారు 15 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు. నిత్యం సుమారు 60 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్ అభివృద్ధికి రూ.27 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్, క్యాంటీన్, పార్కింగ్, దివ్యాంగులకు ఆధునిక సౌకర్యాలు. అంటే ఒక సాధారణ రైల్వే స్టేషన్‌ను కేవలం ప్రయాణానికి పరిమితం కాకుండా, ఆధునిక పబ్లిక్ స్పేస్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

కానీ రాజకీయంగా చూస్తే, రోజుకు 15 వేల మంది ఉపయోగించే ఒక ప్రదేశంలో అభివృద్ధి కనిపిస్తే, ఆ అభివృద్ధి ఎవరు చేశారు అనే రాజకీయ చర్చ కూడా సహజంగానే జరుగుతుంది. ఇదే ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుల రాజకీయ ప్రాధాన్యతను పెంచుతోంది.కిషన్‌రెడ్డి చెబుతున్న వివరాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వికారాబాద్, తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది.

ఇక్కడ రాజకీయంగా చూడాల్సిన అంశం ఒక్కటే. రైల్వే స్టేషన్ అంటే కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఓటర్లు కాదు. ఒక రైల్వే స్టేషన్‌ను ఉపయోగించేవారిలో ఉద్యోగులు ఉంటారు. విద్యార్థులు ఉంటారు. వ్యాపారులు ఉంటారు. రోజువారీ ప్రయాణికులు ఉంటారు. వలస కార్మికులు ఉంటారు. కుటుంబాలతో ప్రయాణించే ప్రజలు ఉంటారు. అంటే, రైల్వే ద్వారా ఒకే సమయంలో అనేక సామాజిక వర్గాలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఎప్పటి నుంచో ఒక సవాల్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులకు మధ్య తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించడం. ఇక్కడే రైల్వేలు బీజేపీకి ఒక పెద్ద రాజకీయ అవకాశం ఇస్తున్నాయి. ఎందుకంటే రైల్వేలు నేరుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. అందువల్ల, స్టేషన్ అభివృద్ధి అయినా, కొత్త రైలు వచ్చినా, కొత్త లైన్ నిర్మాణం జరిగినా, వందే భారత్ ప్రారంభమైనా., కవచ్ వంటి సాంకేతికత అమలైనా వాటిని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే రాజకీయంగా కిషన్‌రెడ్డి ప్రచారంలో కనిపిస్తున్న ప్రధాన వ్యూహంగా చూడవచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో రూ.80 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ వంద శాతం విద్యుద్దీకరణ, కవచ్, కవచ్ 2.0, వందే భారత్ రైళ్లు, కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవన్నీ కలిపి చూస్తే, రైల్వే అభివృద్ధిని ఒకే ఒక్క ప్రాజెక్టుగా కాకుండాతెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కథనంగా నిర్మించే ప్రయత్నం కనిపిస్తోంది.

రైల్వే అనేది ఇప్పుడు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. రాజకీయంగా ప్రజలను చేరుకునే అత్యంత శక్తివంతమైన మార్గంగా కూడా మారుతోంది. అందుకే, కిషన్‌రెడ్డి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ, అది కేవలం పనుల పరిశీలన మాత్రమే కాదు. అభివృద్ధిని చూపిస్తూ.. ప్రజలతో రాజకీయ కనెక్టివిటీ పెంచుకునే ప్రయత్నం.

Read More
Next Story