
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు చట్టబద్ధత ఉందా?
పెళ్లి సాయంపై చట్టపరమైన చిక్కులు!
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చర్చకు కేంద్ర బిందువయ్యాయి. పేద కుటుంబాలకు ఆర్థిక అండగా నిలుస్తున్న ఈ పథకాల అమలు విధానంపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.
2014లో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రూ.1,00,116 చొప్పున ఒకేసారి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వికలాంగుల వివాహాలకు రూ.1,25,145 చెల్లిస్తున్నారు.
ఈ పథకాల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పిటిషనర్ వాదన ప్రకారం... శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ జీవోల ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 245, 246 ప్రకారం ఇలాంటి వ్యయాలకు చట్టపరమైన ఆధారం ఉండాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు అడిగారు. శాసనసభలో చట్టం లేకుండానే కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతో వేల కోట్ల ప్రజాధనాన్ని ఎలా పంపిణీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఈ పథకాలకు సంబంధించిన 8 ప్రభుత్వ జీవోలు, నిధుల కేటాయింపులు, చట్టపరమైన ఆధారాలతో కూడిన పూర్తి వివరాలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ మేరకు బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ శాఖలు, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.
విచారణ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం అప్పుల భారాన్ని ఎదుర్కొంటోందని, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లులు, భూసేకరణ పరిహారం వంటి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రస్తావించింది. అలాంటి పరిస్థితుల్లో ఉచిత పథకాల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడంపై ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటని ప్రశ్నించింది.
పిటిషనర్ ప్రకారం...2014లో రూ.51 వేల సాయంతో ప్రారంభమైన ఈ పథకం...దశలవారీగా పెరిగి ప్రస్తుతం రూ.1,00,116కు చేరుకుంది.2014 నుంచి 2026 వరకు ప్రభుత్వం రూ.13,484.69 కోట్లు ఈ పథకాల కోసం ఖర్చు చేసింది.
కాగ్ నివేదికల ప్రకారం సుమారు రూ.90 కోట్ల మేర అనర్హులకు కూడా లబ్ధి చేకూరిందని ఆరోపించారు.
ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ... పేద కుటుంబాలకు అండగా నిలవడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందని కోర్టుకు తెలిపారు. సంక్షేమ పథకాలను నిలిపివేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రస్తుతం ఈ పథకాల అమలుపై ఎలాంటి స్టే విధించలేదు. అయితే ప్రభుత్వం నాలుగు వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అంటే... ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పథకాలకు శాసనసభ ఆమోదం అవసరమా? కేవలం జీవోలతోనే అమలు చేయవచ్చా? అనే అంశాలపై తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగుతోంది.
ఇప్పుడు ప్రభుత్వం సమర్పించే కౌంటర్ అఫిడవిట్, దానిపై హైకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం రాష్ట్ర రాజకీయాలతో పాటు సంక్షేమ పథకాల భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

