
హోటళ్లలో కొత్త ట్రెండ్.. లైవ్ కిచెన్ డిస్‌ప్లే..!
New Trend in Hotels: Live Kitchen Display!
హోటల్‌లో మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ... నిజంగా ఎలాంటి కిచెన్‌లో తయారవుతోంది? అక్కడ పరిశుభ్రత ఉందా? సిబ్బంది హైజీన్ నిబంధనలు పాటిస్తున్నారా? ఇలాంటి సందేహాలకు ఇకపై ఊహల్లో కాదు... మీ కళ్ల ముందే సమాధానం దొరకబోతోంది. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస తనిఖీల తర్వాత హోటల్ రంగంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే... లైవ్ కిచెన్ డిస్‌ప్లే.
హైదరాబాద్‌లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన వరుస తనిఖీలు హోటల్ పరిశ్రమను ఒక్కసారిగా అప్రమత్తం చేశాయి. పలు హోటళ్లు, క్లౌడ్ కిచెన్లలో బయటపడిన అపరిశుభ్ర పరిస్థితులు, గడువు ముగిసిన ముడి పదార్థాలు, హైజీన్ లోపాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయట భోజనం చేసే విషయంలో ప్రజల్లో ఆందోళన పెరిగింది.
ఈ పరిస్థితుల్లో కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నగరంలోని కొన్ని రెస్టారెంట్లు కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. అందులో భాగంగానే హైటెక్ సిటీలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్ 'లైవ్ కిచెన్ డిస్‌ప్లే' విధానాన్ని అమలు చేసింది.రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే కస్టమర్లకు కనిపించేలా భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
ఈ స్క్రీన్లను నేరుగా కిచెన్‌లోని సీసీటీవీ కెమెరాలకు అనుసంధానం చేశారు. దీంతో కస్టమర్లు తమ ఆర్డర్ ఎలా తయారవుతోంది? కిచెన్ ఎంత పరిశుభ్రంగా ఉంది? సిబ్బంది గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్ వంటి హైజీన్ నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలుగుతోంది.
కేవలం వంట చేసే ప్రాంతం మాత్రమే కాదు... ముడి పదార్థాల నిల్వ గదులు, కోల్డ్ స్టోరేజ్, డీప్ ఫ్రీజర్లు, వాషింగ్ ఏరియాలు వంటి కీలక విభాగాలను కూడా ఈ సీసీటీవీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో ఆహారం తయారయ్యే మొత్తం ప్రక్రియ కస్టమర్లకు పారదర్శకంగా కనిపిస్తోంది.
ఈ కొత్త విధానానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో హోటల్‌కు వెళ్లినప్పుడు ఆహారం రుచి బాగుందా లేదా అన్నదే ప్రధానంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆహారం ఎలాంటి వాతావరణంలో తయారవుతోంది? పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోటల్ యాజమాన్యాలు కూడా ఈ విధానం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతోందని చెబుతున్నాయి. అంతేకాదు... కస్టమర్లు నిరంతరం గమనిస్తున్నారనే బాధ్యతతో సిబ్బంది కూడా పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఒకప్పుడు రుచే హోటల్‌కు గుర్తింపు. ఇప్పుడు రుచితో పాటు పరిశుభ్రత కూడా ప్రత్యక్షంగా కనిపించాలనే వినియోగదారుల ఆలోచన పెరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ తనిఖీల ప్రభావంతో మొదలైన ఈ 'లైవ్ కిచెన్ డిస్‌ప్లే' విధానం... భవిష్యత్తులో మరిన్ని హోటళ్లకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

