రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
గన్‌పార్క్ వద్ద పొలిటికల్ వార్! | ఉస్మానియాలో అరుదైన సర్జరీ | చెత్త డంపింగ్.. సరిహద్దు రచ్చ!
1) అరెస్టులతో హైడ్రామా! గన్‌పార్క్ వద్ద పొలిటికల్ వార్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం.. చివరకు రోడ్లపై హైడ్రామాగా మారింది. గన్‌పార్క్ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు అరెస్టుల వరకు వెళ్లింది?
వివాదానికి కారణం గురుకుల హాస్టళ్లలో అవినీతి ఆరోపణలు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వం భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసిరారు. "ఆరోపణలు నిజమైతే ప్రజల ముందే చర్చకు రండి" అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకున్నారు.
అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నేతలను ఆహ్వానించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. "బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. టెండర్ల ప్రక్రియ మొత్తం నాలుగు శాఖల పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల అభివృద్ధి చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ పదేళ్ల కొనుగోళ్లపై కూడా చర్చకు సిద్ధమే" అంటూ బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేశారు.
అయితే బీఆర్‌ఎస్ కూడా వెనక్కి తగ్గలేదు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. "మీరు గురుకులాలపై మాట్లాడితే.. మేం
గత ప్రభుత్వ అప్పులపై చర్చకు సిద్ధం" అని ప్రకటించారు. మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు వస్తానన్నారని, అందుకే కేటీఆర్ అక్కడే ఉంటారని హరీశ్‌రావు తెలిపారు.
ఆ తర్వాత హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గన్‌పార్క్‌కు బయల్దేరారు. కానీ మధ్యలోనే పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల తీరుపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? హాస్టళ్లలో అవినీతి జరిగిందనే భయంతోనే ప్రభుత్వం పోలీసులను ముందుకు పెడుతోంది. గన్‌పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తాం" అంటూ కారులో నుంచి దిగిపోయారు.
దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ముందుకు దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. చివరకు పోలీసు బందోబస్తును దాటేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకవైపు గురుకులాల అవినీతి ఆరోపణలు...
మరోవైపు ప్రభుత్వ అప్పులపై ప్రతిసవాళ్లు...
చివరకు గన్‌పార్క్ వద్ద రాజకీయ పోరు అరెస్టుల వరకు వెళ్లింది.
ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది.
-----------------
2) ఉస్మానియాలో అరుదైన సర్జరీ! 5 అవయవాల మార్పిడి
ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స!
దేశంలోనే తొలిసారి.. 5 అవయవాల మార్పిడి
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి దేశ వైద్యరంగంలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే తొలిసారిగా ఒక రోగికి ఐదు ఉదర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. దాదాపు 36 గంటల పాటు సాగిన ఈ అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిపుణులైన వైద్యుల బృందం పూర్తి చేసింది. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించడం మరో విశేషం.
ఈ శస్త్రచికిత్స సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు నిర్వహించారు. తీవ్రమైన జీర్ణవ్యవస్థ సమస్యతో బాధపడుతున్న ఆయనకు కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్న పేగు, పెద్ద పేగులోని కుడి భాగాన్ని ఒకేసారి మార్పిడి చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స తెలంగాణ వైద్యరంగానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
ఉస్మానియా ఆస్పత్రిలో దేశంలోనే తొలి 5 అవయవాల మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో చారిత్రక ఘట్టంహైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఐదు జీర్ణవ్యవస్థ అవయవాలను ఒకేసారి మార్పిడి (Five-Organ Multi-Visceral Transplant) చేసి చరిత్ర సృష్టించారు. ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావడం ప్రభుత్వ వైద్యరంగానికి గొప్ప మైలురాయిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోగి ఎవరు?
సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్. తీవ్రమైన జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరమైంది.ఏయే అవయవాలను మార్పిడి చేశారు?ఒకేసారి ఈ ఐదు అవయవాలను మార్పిడి చేశారు. ఒకేసారి ఐదు ఉదర అవయవాల మార్పిడి శస్త్రచికిత్స (మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్).కడుపు (Stomach)డ్యూడినమ్ (Duodenum)ప్యాంక్రియాస్ (Pancreas)చిన్న పేగు (Small Intestine)పెద్ద పేగులోని కుడి భాగం (Right Colon)
ఆపరేషన్ ఎంతసేపు జరిగింది?
ఈ శస్త్రచికిత్స దాదాపు 36 గంటల పాటు నిరంతరంగా కొనసాగింది.గ్యాస్ట్రోఎంటరాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్, నర్సింగ్ తదితర విభాగాల వైద్యులు కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.ఎవరి నేతృత్వంలో జరిగింది?ఈ అరుదైన శస్త్రచికిత్సకు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. చి. మధుసూదన్ నాయకత్వం వహించారు.
ఎందుకు ఇది ప్రత్యేకం?
మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటి. ఒకేసారి ఐదు అవయవాలను మార్పిడి చేయడం అత్యంత అరుదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి శస్త్రచికిత్స జరగడం భారత వైద్యరంగంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు.
ఖర్చు ఎంత?
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స చేయడానికి సాధారణంగా కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.అయితే ఉస్మానియా ఆస్పత్రిలో ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించారు. దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో 5 అవయవాల మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఐదు అవయవాలు రోగి శరీరం నుంచి తీసినవి కావు. బ్రెయిన్‌డెడ్ అయిన 35 ఏళ్ల మహిళ అవయవదానం చేయడంతో, ఆమె నుంచి తీసుకున్న కడుపు, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగు (రైట్ కోలన్)ను ఒకేసారి రోగికి అమర్చారు.
డోనర్ గర్భధారణ సమయంలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్‌టెన్షన్ (PIH) కారణంగా తీవ్రమైన బ్రెయిన్ హేమరేజ్కు గురై బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. అదే డోనర్ నుంచి ఒక కిడ్నీ, కార్నియాలు, చర్మాన్ని కూడా ఇతర రోగులకు వినియోగించారు.అయితే డోనర్ పేరు, స్వగ్రామం వంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు. భారతదేశంలోని NOTTO, జీవనదాన్ మార్గదర్శకాల ప్రకారం డోనర్, రిసిపియెంట్ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం తప్పనిసరి.
--------------
3) చెత్త పంచాయతీ..! రెండు రాష్ట్రాల మధ్య టెన్షన్
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో చెత్త డంపింగ్ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్తను తెలంగాణలోని మల్గి గ్రామ శివారులో పారబోస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర నిరసనకు దిగారు. చెత్త వాహనాలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, ప్రధాన రహదారిపైనే చెత్త పారబోశారనే ఆరోపణలతో అంతర్రాష్ట్ర రాకపోకలు గంటల పాటు నిలిచిపోయాయి. కాలుష్యం, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డంపింగ్ యార్డును తొలగించి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్తను.. తెలంగాణలోని మల్గి గ్రామం సమీపంలో డంప్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరసన బుధవారం తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు గంటల పాటు నిలిచిపోయాయి. చెత్త వాహనాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన అధికారులు ప్రధాన రహదారిపైనే చెత్త పారబోసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బీదర్-మల్గి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బీదర్ మున్సిపాలిటీకి చెందిన వ్యర్థాలను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామ శివారులో పారబోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చెత్త కారణంగా కాలుష్యం పెరిగి.. దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని చెబుతున్నారు.
చెత్తతో వచ్చిన మున్సిపల్ వాహనాలను బుధవారం రోజున మల్గి గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీదర్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది.. మల్గి-బీదర్ ప్రధాన రహదారిపైనే చెత్తను పారబోసినట్లు స్థానికులు ఆరోపించారు. సుమారు 40 వాహనాల చెత్తను రోడ్డుపై కుమ్మరించడంతో అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా మూసుకుపోయింది.
దీంతో తెలంగాణ-కర్ణాటక మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, రోడ్డుపై పారబోసిన చెత్తను తొలగించే ఏర్పాట్లు ప్రారంభించారు.
తమ గ్రామ శివారులో డంపింగ్ యార్డు కొనసాగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మల్గి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా సరిహద్దు ప్రాంతంలో చెత్త పారబోయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.