
ఓవైసీపై ఎందుకంత ప్రేమ - ఎమ్మెల్యే రాజాసింగ్
బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ పై హైకోర్టు సీరియస్... తీర్పు ఎలా ఉండబోతోంది?
బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ (Fatima Owaisi Educational Institution) వ్యవహారం తెలంగాణ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేదా గుర్తింపు లేదని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది.
ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా విద్యాసంస్థకు ప్రభుత్వ అనుమతులు లేనప్పుడు అక్కడ విద్యా కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయంటూ కోర్టు ప్రశ్నించింది.హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లపై హైకోర్టు ప్రశ్నలువిద్యాశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేదా గుర్తింపు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అనుమతులు లేని విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు హాల్‌టికెట్లు, విద్యా సర్టిఫికెట్లు ఎలా జారీ అవుతున్నాయని ప్రశ్నించింది.
దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ.. విద్యార్థులు గుర్తింపు పొందిన ఇతర కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారని, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలో కేవలం అకాడమిక్ సౌకర్యాలు మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు మాత్రం గుర్తింపు పొందిన ఆయా విద్యాసంస్థల నుంచే జారీ అవుతున్నాయని కోర్టుకు వివరించారు.
జీహెచ్‌ఎంసీపై హైకోర్టు అసంతృప్తిభవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం సమర్పించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి, భవన నిర్మాణ అనుమతులపై మూడు నెలల క్రితమే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశంజీహెచ్‌ఎంసీ, విద్యాశాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలు వారం రోజుల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గడువులోగా కౌంటర్లు దాఖలు చేయని పక్షంలో, ఈ నెల 9న అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది.
10 వేల మందికి పైగా విద్యార్థులు ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలో ప్రస్తుతం సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్లు సమాచారం. కేజీ నుంచి పీజీ వరకు పేద ముస్లిం మహిళలకు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో విద్యను అందిస్తున్న సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అయితే ఈ కేసులో హైకోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు విద్యాసంస్థకు సంబంధించిన భవన అనుమతులు, ఇతర నిబంధనల అంశాలు న్యాయపరిశీలనలోనే కొనసాగనున్నాయి.

