
వర్షం వస్తే గుంతలే.. హైదరాబాద్ రోడ్లకు ఏమైంది?
“గ్లోబల్ సిటీ.. అంతర్జాతీయ స్థాయి రోడ్లు ఎప్పుడు?”
అప్పట్లో కేటీఆర్, "హైదరాబాద్‌ను న్యూయార్క్‌లా చేస్తామన్నారు. సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామన్నారు". ఇప్పుడు సి.ఎం. రేవంత్ "టోక్యో, లండన్, దుబాయ్‌తో పోటీ పడే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని" చెబుతున్నారు. నేతల విజన్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. కానీ, హైదరాబాద్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది?
వర్షం పడితే గుంతలు. గుంతల్లో నీరు. దెబ్బతిన్న తారు. అసంపూర్తి ప్యాచ్‌వర్క్. రోడ్డు తవ్వకాలు. ట్రాఫిక్ సమస్యలు. అంటే ప్రశ్న హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో, లండన్, దుబాయితో పోటీ పడే నగరంగా ఎప్పుడు మారుస్తామన్నది మాత్రమే కాదు. ముందుగా హైదరాబాద్ రోడ్లు ఎప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు చేరతాయి?
హైదరాబాద్‌లో వర్షాలు తగ్గాయి. కానీ రోడ్ల కష్టాలు మాత్రం తగ్గలేదు! ఎక్కడ చూసినా గుంతలు. దెబ్బతిన్న తారు. అసంపూర్తి ప్యాచ్‌వర్క్. గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు. వాటిని తప్పించుకునే వాహనాలతో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌లు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి!
హైదరాబాద్ రోడ్లకు అసలు సమస్య ఏంటి? నిధుల కొరతా? లేక ఖర్చు చేస్తున్న డబ్బుకు తగ్గ నాణ్యత, నిర్వహణ లేకపోవడమా? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న!హైదరాబాద్‌లో గుంతల సమస్య కొత్తది కాదు. ప్రతి వర్షాకాలం తర్వాత గుంతలను గుర్తించడం. పూడ్చడం. మళ్లీ గుంతలు ఏర్పడటం. ఇది ఒక సైకిల్‌గా మారింది.
2025లో GHMC 16,541 గుంతలను గుర్తించింది. అక్టోబర్ 10 నాటికి 14,112 గుంతలు పూడ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా నగరంలో గుంతల సంఖ్య 18 వేలకు పైగా నమోదైనట్లు GHMC వెల్లడించింది. ఇక GHMC పరిధిలో మొత్తం రోడ్డు నెట్‌వర్క్ సుమారు 9,100 కిలోమీటర్లు ఉంది. ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా, ఒకసారి వేసిన రోడ్డు ఎంతకాలం నిలుస్తోంది?
గుంత అంటే కేవలం తారు ఊడిపోవడం కాదు. దాని వెనుక మొత్తం రోడ్డు వ్యవస్థలో సమస్య ఉండొచ్చు అంటారు ప్రముఖ స్టక్చర్ ఇంజనీర్ టి.వి.రావు.
"మొదటిది వాటర్‌లాగింగ్. వర్షపు నీరు రోడ్డు పొరల్లోకి వెళ్లి కింద ఉన్న బేస్‌ను బలహీనపరిస్తే.. వాహనాల బరువుతో రోడ్డు క్రమంగా దెబ్బతింటుంది.
రెండోది డ్రైనేజీ. నీరు సరిగ్గా బయటకు వెళ్లకపోతే.. రోడ్డు ఎంత బలంగా వేసినా దెబ్బతినే అవకాశం పెరుగుతుంది.
మూడోది యుటిలిటీ కట్స్. వాటర్ లైన్లు, డ్రైనేజీ, కేబుల్స్ కోసం రోడ్లు తవ్వడం.. ఆ తర్వాత వాటిని సరిగ్గా పునరుద్ధరించకపోవడం మరో కారణం.
నాలుగోది ప్యాచ్‌వర్క్. పై పొరను మాత్రమే పూడ్చి.. కింద బేస్‌లో ఉన్న సమస్యను అలాగే వదిలేస్తే.. వర్షం తర్వాత అదే ప్రాంతంలో మళ్లీ గుంత ఏర్పడే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు భారీ ట్రాఫిక్, హెవీ వెహికల్స్, నిర్మాణంలో మెటీరియల్ నాణ్యత, లేయర్ మందం, కాంపాక్షన్ వంటి అంశాలు కూడా రోడ్డు జీవితకాలాన్ని ప్రభావితం చేస్తున్నాయని టి.వి.రావు చెప్పారు.
అర్బన్ రీజినల్ ప్లానర్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అభిప్రాయం ప్రకారం.. హైదరాబాద్‌లో ప్యాచ్‌వర్క్ చాలాసార్లు హడావుడిగా, తాత్కాలిక పరిష్కారంగా జరుగుతోంది. “ప్యాచ్‌వర్క్ అనేది కేవలం హడావుడిగా చేసే పనిగా కాకుండా, వెల్ డిజైన్, పక్కా ప్లాన్‌తో చేయాలి. క్వాలిటీ లేకపోవడం వల్లే వర్షాలు పడిన తర్వాత మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి” అని ఆయన చెబుతున్నారు.
మరో కీలక సమస్య, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం. వాటర్, డ్రైనేజీ, కేబుల్ వంటి పనుల కోసం ఒక శాఖ రోడ్డు తవ్వితే, ఆ తర్వాత రోడ్డును ఎవరు, ఏ నాణ్యతతో పునరుద్ధరిస్తున్నారు అన్నది కీలకం.
వేదకుమార్ అభిప్రాయం ప్రకారం "రోడ్డు తవ్వాలన్నా, ముట్టుకోవాలన్నా GHMC అనుమతి తప్పనిసరిగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కఠిన చర్యలు ఉండాలి." అంటే రోడ్డు వేసే సమయంలోనే కాదు.. రోడ్డు తవ్వే సమయంలో కూడా నాణ్యత, బాధ్యత ఉండాలి.
హైదరాబాద్ రోడ్ల సమస్యను కేవలం “గుంతలు పూడ్చారా లేదా?” అనే కోణంలో చూస్తే.. అసలు సమస్య కనిపించదు. గుంతలు పూడ్చడం తక్షణ పరిష్కారం మాత్రమే. అసలు ప్రశ్న. ఒక రోడ్డు నిర్మించిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు నిలవాలి? వర్షం పడిన వెంటనే ఎందుకు దెబ్బతింటోంది? రోడ్డు నిర్మాణంలో నాణ్యత ఎలా పరీక్షిస్తున్నారు? డ్రైనేజీని రోడ్డు డిజైన్‌లో భాగంగా ఎంతవరకు పరిగణిస్తున్నారు? యుటిలిటీ కట్స్‌కు ఎవరు బాధ్యత వహిస్తున్నారు? ప్యాచ్‌వర్క్ చేసిన తర్వాత అదే ప్రాంతం మళ్లీ దెబ్బతింటే దానికి బాధ్యత ఎవరిది? ఇవన్నీ కొలిచే వ్యవస్థ లేకపోతే, గుంత పూడ్చడం, మళ్లీ గుంత ఏర్పడటం అనే సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది.
కాబట్టి హైదరాబాద్ రోడ్లపై అసలు లెక్క. “ఎన్ని గుంతలు పూడ్చారు?” కాదు. “ఖర్చు చేసిన డబ్బుకు రోడ్డు ఎంతకాలం నిలిచింది?” నిధులు ఎంత కేటాయించారన్నదే కాదు. ఆ నిధులతో నిర్మించిన రోడ్డు జీవితకాలం ఎంత? వర్షం వచ్చిన ప్రతిసారీ గుంతలు. ప్యాచ్‌వర్క్ చేసిన ప్రతిసారీ మళ్లీ గుంతలే. హైదరాబాద్ రోడ్ల అసలు సమస్య ఇదే.

