
తెలంగాణకు తాగునీటి ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరువలో జలాశయాలు
క్రీడా వేదికగా హుస్సేన్‌సాగర్ అంతర్జాతీయ సెయిలింగ్ సందడి | వరుస మరణాల భయం.. ఊరంతా అడవిబాట..!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) తెలంగాణకు తాగునీటి ముప్పు... డెడ్ స్టోరేజ్‌కు చేరువలో జలాశయాలు
2) క్రీడా వేదికగా హుస్సేన్‌సాగర్... అంతర్జాతీయ సెయిలింగ్ సందడి..
3) వరుస మరణాల భయం.. ఊరంతా అడవిబాట..!
1) తెలంగాణకు తాగునీటి ముప్పు.. డ్యామ్‌లు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి..!
ఒకవైపు వర్షాలు ముఖం చాటేయడం... మరోవైపు ఎల్‌నినో ప్రభావం... ఫలితంగా తెలంగాణలో తాగునీటి పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ప్రధాన జలాశయాలు వేగంగా ఖాళీ అవుతుండగా... భూగర్భ జలమట్టాలు కూడా క్రమంగా పడిపోతున్నాయి.
భారీ వర్షాలు త్వరలో కురవకపోతే... రానున్న నెలల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.నాగార్జునసాగర్ వద్ద డేంజర్ బెల్స్తెలుగు రాష్ట్రాల తాగునీటి, సాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు డెడ్ స్టోరేజ్‌కు చేరువలో ఉంది.
సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం అది కేవలం 513 అడుగులకు పడిపోయింది. డెడ్ స్టోరేజ్ స్థాయి 510 అడుగులు. అంటే మరో మూడు అడుగులు తగ్గితే... సాధారణంగా నీటిని వినియోగించే అవకాశం దాదాపు ఉండదు.
సాగర్ మొత్తం నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు కేవలం 138 టీఎంసీలే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.
ప్రస్తుతం ఎక్కడికి మాత్రమే నీటి విడుదల?ఇప్పటికే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఏఎంఆర్‌పీ ద్వారా సుమారు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 500 అడుగుల కంటే దిగువకు వెళ్తే... కాలువలు, ప్రధాన గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం కూడా సాధ్యం కాదు.
డెడ్ స్టోరేజ్‌కు చేరితే ఏం జరుగుతుంది?సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంటే... ముందుగా ప్రభావం ఖరీఫ్ సాగుపై పడుతుంది. కృష్ణా ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాల్లో సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయానికి నీటి సరఫరా దాదాపు అసాధ్యంగా మారుతుంది.
అంతేకాదు... ఆ తర్వాత సాగర్‌లో మిగిలిన నీటి వినియోగం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB), కేంద్ర జలశక్తి శాఖ నియంత్రణలోకి వెళ్తుంది. అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ ఇష్టానుసారం సాగర్ నీటిని ఉపయోగించలేవు. బోర్డు అనుమతితో, అత్యవసర అవసరాల మేరకే నీటిని విడుదల చేస్తారు.
విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావంసాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరితే... కుడి, ఎడమ గట్టులపై ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోతుంది. మిగిలిన నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే రిజర్వ్ చేస్తారు. వ్యవసాయం, పరిశ్రమలకు ఒక్క చుక్క నీరు కూడా కేటాయించే అవకాశం ఉండదు.
తెలంగాణలో జలాశయాల పరిస్థితి ఎలా ఉంది?
మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలే ఆధారం. ఈ జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా... ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు కేవలం 333.44 టీఎంసీలు మాత్రమే. గత ఏడాది ఇదే సమయంలో 522.31 టీఎంసీలు నిల్వ ఉండగా... ఈసారి పరిస్థితి మరింత దిగజారింది.
ఉత్తర తెలంగాణలో మరింత ఆందోళన
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్‌కు పైన వినియోగించదగిన నీరు ఇప్పుడు కేవలం 3 టీఎంసీలే మిగిలి ఉంది. కానీ తాగునీటి అవసరాలకే ప్రతి నెల దాదాపు అర టీఎంసీ నీరు అవసరం అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న నెలల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఏ ఏ జలాశయాలు ప్రమాద స్థాయిలో ఉన్నాయి?
లోయర్ మానేరు, ఎల్లంపల్లి, కడెం, జూరాల, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూర్, కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి, వైరా, ఉదయసముద్రం, ధర్మసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
ఈ జలాశయాలపైనే హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న నిల్వలను బట్టి చూస్తే... మంజీరా, సింగూర్, గోదావరి వ్యవస్థల నుంచి సెప్టెంబర్ చివరి వరకు మాత్రమే తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్ అవసరాల కోసం సింగూర్‌లో కనీసం 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు సూచనలు వెళ్లాయి.
భూగర్భ జలాల పరిస్థితి కూడా ఆందోళనకరమేడ్యామ్‌ల్లోనే కాదు... భూగర్భ జలాల పరిస్థితి కూడా వేగంగా దిగజారుతోంది. జూన్ నాటికి తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతుకు పడిపోయింది. భూమికి 31 అడుగుల లోతుకు వెళ్లిపోయాయి.
2) వరుస మరణాల భయం.. ఊరంతా అడవిబాట..!
జమ్మికుంట మున్సిపాల్టీ, వార్డు నెంబర్ 13, 14 వార్డుల్లో ఊరి దోషం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పది రోజుల్లో 10 మంది వరుస మరణాల నేపథ్యంలో ప్రజలు పురోహితుడి సూచన మేరకు నిన్న ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి అడవి బాట పట్టారు. అశుభ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందనే నమ్మకంతో ప్రజలు ఒకరోజు ఊరంతా ఖాళీ చేసి శివారులో వంటలు చేసుకుని గడిపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శాస్త్ర సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ 'కీడు వంటలు' వంటి సంప్రదాయాలు కొనసాగుతున్న తీరు సామాజికంగా ఆసక్తికర అంశంగా నిలిచింది. ఊరికి పట్టిన కీడు తొలగిపోవాలనే నమ్మకంతోనే తాము ఈ కీడు వంటల కార్యక్రమం చేపట్టామని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పడనప్పుడు కూడా ఇలాగే ఊరు విడిచి వెళ్లేవారమని వారు గుర్తు చేసుకున్నారు.
భయం పెరిగితే మూఢనమ్మకాలు బలపడతాయి.. శాస్త్రీయ అవగాహన లేకపోతే సంప్రదాయాలే పరిష్కారంగా మారతాయి. వరుస మరణాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రజల్లో భయం ఎలా మూఢనమ్మకాలకు దారితీస్తుందో, ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయాలతో ఎక్స్‌ప్లైనర్.గ్రామంలో వరుస మరణాలు... ఒక్కసారిగా ఇళ్లకు తాళాలు... తెల్లవారుజామునే ఊరంతా అడవిబాట..!
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా... తెలంగాణలో నిజంగానే జరిగిన ఘటన ఇది. సైన్స్, టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా... కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ శతాబ్దాల నాటి ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఇది తాజా ఉదాహరణ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుస మరణాలు స్థానికుల్లో తీవ్ర భయాన్ని నింపాయి. ఆ భయమే... ఒక కాలనీ మొత్తాన్ని ఊరు విడిచి వెళ్లేలా చేసింది.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14వ వార్డుల్లో గత కొద్ది రోజుల వ్యవధిలోనే వివిధ కారణాలతో సుమారు పది మంది మరణించారు. వరుసగా జరుగుతున్న మరణాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. గ్రామానికి ఏదో కీడు పట్టిందనే భావనతో గ్రామ పెద్దలు స్థానిక పురోహితుడిని సంప్రదించారు. ప్రస్తుతం గ్రామంపై దోషం ఉందని, దాన్ని తొలగించాలంటే సంప్రదాయం ప్రకారం 'కీడు వంటలు' నిర్వహించాలని పురోహితుడు సూచించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ సూచనను విశ్వసించిన కాలనీవాసులు ఆదివారం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామ శివారుకు వెళ్లిపోయారు. సంప్రదాయం ప్రకారం ఇళ్ల ముందు కల్లాపి కూడా చల్లకుండా... పిల్లలు, పెద్దలతో కలిసి అడవి ప్రాంతానికి చేరుకున్నారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని గడిపారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందనే నమ్మకంతోనే ఈ ఆచారాన్ని పాటించినట్లు వారు తెలిపారు. గతంలో కరువు పరిస్థితులు లేదా వర్షాలు కురవని సందర్భాల్లో కూడా ఇలాగే 'కీడు వంటలు' నిర్వహించేవారని పెద్దలు గుర్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రీయ యుగంలోనూ ఇలాంటి మూఢనమ్మకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని సామాజిక కార్యకర్తలు, ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరుస మరణాలకు అసలు కారణాలను వైద్యపరంగా గుర్తించి, అవసరమైతే ఆరోగ్య పరీక్షలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రజల్లో భయాన్ని తొలగించడమే కాకుండా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అని చెబుతున్నారు.
3) క్రీడా వేదికగా హుస్సేన్‌సాగర్ అంతర్జాతీయ సెయిలింగ్ సందడి..
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు మరోసారి అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మారింది. ప్రతిష్ఠాత్మక 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ తో పాటు భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ILCA ఓపెన్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ పోటీలను మేజర్ జనరల్ పునీత్ కపూర్ ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన సెయిలర్లు, సెయిలింగ్ క్లబ్‌ల ప్రతినిధులు, క్రీడాకారులకు స్వాగతం పలికారు.
ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ మరియు సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పోటీలకు ముందు యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (YAI) సర్టిఫికేషన్ కోచింగ్ క్యాంప్, ఇంటర్నేషనల్ రేస్ ఆఫీసర్ సెమినార్, నేషనల్ రేస్ ఆఫీసర్ సెమినార్‌లను నిర్వహించి అధికారులు, నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు.
హుస్సేన్‌సాగర్‌లోని అనుకూల వాతావరణం కారణంగా ఇది దేశంలోని అత్యుత్తమ సెయిలింగ్ శిక్షణ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిందని మేజర్ జనరల్ పునీత్ కపూర్ తెలిపారు. సెయిలింగ్ క్రీడ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATS), లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (LCAI), వివిధ సెయిలింగ్ క్లబ్‌లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ టోర్నమెంట్ ప్రత్యేకత ఏంటి?
40 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను 1985 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మరో ప్రత్యేకత ఉంది. భారత్‌లోనే తొలిసారిగా ILCA ఓపెన్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ను హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది.
ఈ పోటీల్లో భారత్‌తో పాటు కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి సుమారు 140 మంది సెయిలర్లు పాల్గొంటున్నారు. వీరు ILCA-7, ILCA-6, ILCA-4 విభాగాల్లో హుస్సేన్‌సాగర్‌లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
జూలై 18 వరకు జరిగే ఈ పోటీలు Yachting Association of India (YAI) ర్యాంకింగ్ ఈవెంట్ కూడా కావడం విశేషం. ఇక్కడ సాధించిన ఫలితాలు జాతీయ ర్యాంకింగ్‌తో పాటు భవిష్యత్ అంతర్జాతీయ పోటీల ఎంపికలో కీలకంగా పరిగణిస్తారు.ఈ టోర్నీలో విజేతలకు ఛాంపియన్ టైటిల్, ట్రోఫీలు, మెడల్స్ అందజేస్తారు. అలాగే YAI ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లు ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, భారత జాతీయ జట్టు ఎంపిక వంటి కీలక అవకాశాల్లో ప్రయోజనం కల్పిస్తాయి.

