సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక రాజకీయమా? ప్రోటోకాల్‌ సమస్యా?
x

సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక రాజకీయమా? ప్రోటోకాల్‌ సమస్యా?


రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్ వేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలన్న సీఎం ప్రయత్నాలు, అమెరికా పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావాలన్న లక్ష్యం, కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరణ, ఇవన్నీ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రశ్న “సీఎం వెళ్లలేకపోయారు. మరి తెలంగాణ పెట్టుబడులపై ప్రభావం ఎంత?” అన్నదే.

2000 మార్చి 24న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి, ఆ పర్యటన ద్వారా రాజకీయంగా గణనీయమైన మైలేజ్ సాధించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఓ వీధికి పెట్టడం, దానిపై ట్రంప్ స్పందించడం, హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ నిర్మాణం, ట్రంప్‌కు సంబంధించిన వ్యాపారాలను మరింత విస్తరించే ప్రయత్నాలు, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం అమెరికాతో సంబంధాలను పెంచుకోవాలనుకున్న సంకేతాలుగా కనిపించాయి.

అమెరికా ఉపాధ్యక్షుడి జె.డి. వాన్స్ భార్యకు తెలుగు మూలాలు ఉండటాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అనుకూల అంశంగా చూసింది. ఈ పరిచయాల ద్వారా ఉపాధ్యక్షుడిని కలవాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అమెరికా పర్యటనలో ట్రంప్‌ను వైట్‌హౌస్‌లో కలవాలని రేవంత్‌రెడ్డి భావించారు. తెలంగాణకు పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు తీసుకురావడం, అమెరికా ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పర్యటనలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అయితే కేంద్ర విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.

కేంద్రం మాత్రం దీనికి రాజకీయ రంగు లేదని చెబుతోంది. “అమెరికా పర్యటనకు సంబంధించి ప్రతిపాదిత వివరాలు తగిన విధంగా లేవు. అందువల్ల రేవంత్‌రెడ్డికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో యూకే పర్యటనకు అనుమతి ఉంది.” అంటే విదేశీ పర్యటనకు వ్యతిరేకత కాదని, అమెరికా పర్యటన ప్రతిపాదనలోని విధివిధానాలు, దౌత్యపరమైన అంశాలే కారణమని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

అసలు టార్గెట్ పెట్టుబడులే!

సీఎం అమెరికా వెళ్లకపోయినా తెలంగాణ పెట్టుబడుల వేట మాత్రం ఆగడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రధానంగా దృష్టి పెట్టిన ఫ్యూచర్ సిటీలో ఐటీ, సెమీకండక్టర్/చిప్ తయారీ, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (AI), ఫైనాన్స్, గ్లోబల్ ఎడ్యుకేషన్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. అమెరికా పర్యటనలో హార్వర్డ్, MIT, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందాలు, ఎంఓయూలు కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సీఎం వెళ్లలేకపోయినా అధికారుల బృందం అమెరికా వెళ్లి ఈ చర్చలను కొనసాగించనుంది. “నేను వెళ్లకపోయినా మీరు వెళ్లి యూనివర్శిటీలతో సంప్రదింపులు జరపండి.” రేవంత్‌రెడ్డి అధికారులకు ఇచ్చిన ఈ ఆదేశం ఇప్పుడు కీలకంగా మారింది.

అమెరికా పర్యటన రద్దయినంత మాత్రాన తెలంగాణకు వచ్చే పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ ‘ది ఫెడరల్’తో మాట్లాడుతూ, అధికారులు అమెరికా వెళ్లి పెట్టుబడులు, ఒప్పందాలకు సంబంధించిన చర్చలు కొనసాగించనున్నందున సీఎం పర్యటన రద్దు ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ మిషన్ మాత్రం కొనసాగనుంది.

అయితే పర్యటన రద్దు రాజకీయంగా మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.వి. చంద్రవదన్ ప్రకారం, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సాధారణ ప్రైవేట్ విజిట్ కాదు. విదేశీ ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో భేటీలు ఉంటే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి, దౌత్య సమన్వయం తప్పనిసరి. “అధికార హోదాలో ఉన్నవారు విదేశాలకు వెళ్లాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సిందే.” అయితే రేవంత్‌రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరణ వెనుక రాజకీయ అనుమానాలు కూడా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ యూనివర్సిటీల్లో ప్రసంగాలు, అంతర్జాతీయ వేదికలు రాజకీయ వ్యాఖ్యలకు వేదిక కావచ్చన్న ఆందోళన కేంద్రానికి ఉండి ఉండవచ్చని చెప్పారు.

ప్రోటోకాల్ ప్రకారం వెళ్లే మంత్రులు, ఉన్నతాధికారులకు విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు, గ్రీన్ ఛానల్ వంటి ఏర్పాట్లు ఉంటాయని చంద్ర‌వ‌న్ పేర్కొన్నారు. పాస్‌పోర్టుల విషయంలోనూ అధికారుల హోదాను బట్టి వేర్వేరు కేటగిరీలు ఉంటాయని తెలిపారు. diplomatic passport సాధారణంగా ఎరుపు రంగులో, ఉన్నతాధికారులకు సంబంధించిన అధికారిక పాస్‌పోర్టులు తెలుపు రంగులో ఉంటాయని వివరించారు. అయితే విదేశీ పర్యటనకు అనుమతి లేకుండా వెళ్లడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రిటైర్డ్ పొలిటిక‌ల్ సైన్స్ శాస్త్ర ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాత్రం మరింత స్పష్టంగా రాజకీయ కోణాన్ని ప్రస్తావించారు. “రాజకీయ దురుద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు.” కేంద్రం మిత్రపక్షాల ముఖ్యమంత్రులకు ఒక రకంగా, రాజకీయంగా అనుకూలంగా లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు కేంద్రం సహకరించడాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు.

బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ, సీఎం లేకపోయినా అధికారుల బృందానికి అమెరికాలో పెట్టుబడులు, ఒప్పందాలపై సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చామని చెప్పారు. “పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల్లో లోపాల కారణంగానే నిర్ణయం జరిగింది. దీనిని రాజకీయంగా చూడకూడదు.”విదేశీ పర్యటనల్లో అధికారిక అవసరం, ఆహ్వాన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రోటోకాల్, దౌత్య అంశాలు, భద్రత, ఎఫ్‌సీఆర్‌ఏ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.

2012లో యూపీఏ హయాంలో అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలకు, జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటన, 2019లో అరవింద్‌ కేజ్రీవాల్‌ పర్యటనల విషయంలో ఇలాంటి వివాదాలు వచ్చాయి. అలాగే, గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్‌ నేతలు లేఖలు రాసిన విషయాన్ని బీజేపీ గుర్తుచేస్తోంది. అందువల్ల రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడాన్ని రాజకీయ వివక్షగా చూడటం సరికాదని బీజేపీ పేర్కొంటోంది.

“తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అందులో తెలంగాణ కూడా కీలక భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫెడ‌ర‌ల్‌తో చెప్పారు. “రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.” అమెరికా పర్యటనకు అనుమతులు నిరాకరించడం బాధాకరమని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో రాజకీయ వివాదం ఎంత ఉన్నా, పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా అమెరికా వెళ్లలేకపోయినా అధికారులు వెళ్లనున్నారు. యూనివర్సిటీలతో చర్చలు, ఎంఓయూలు, పెట్టుబడిదారులతో సమావేశాలు కొనసాగనున్నాయి.

ఫ్యూచర్ సిటీ కోసం ఐటీ నుంచి AI వరకు, చిప్ తయారీ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ వరకు, ఫైనాన్స్ నుంచి గ్లోబల్ ఎడ్యుకేషన్ వరకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ అసలు టార్గెట్. డిసెంబర్ గ్లోబల్ సమ్మిట్ కూడా దీనికి మరో కీలక వేదిక కానుంది.

ఇక రాజకీయంగా చూస్తే, సి.ఎం.రేవంత్ అమెరికా టూర్‌ను కేంద్రం ఆపింది. కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆ బ్రేక్ ఎంత వరకు పనిచేస్తుందన్నదే అసలు పరీక్ష.

Read More
Next Story