టెంక పురుగుకు చెక్.. తెలంగాణ మామిడి రైతులకు రూ.24 కోట్ల గుడ్‌న్యూస్!
x

టెంక పురుగుకు చెక్.. తెలంగాణ మామిడి రైతులకు రూ.24 కోట్ల గుడ్‌న్యూస్!

మామిడి రైతుల ఎగుమతి సమస్యకు శాశ్వత పరిష్కారం – శామీర్‌పేటలో గామా ఇరేడియేషన్ సెంటర్


ప్రతి ఏడాది టెంక పురుగు కారణంగా వేల టన్నుల మామిడి పండ్లు నష్టపోతున్నాయి. రైతుల ఆదాయం తగ్గడంతో పాటు విదేశీ ఎగుమతులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం రూ.24 కోట్లతో శామీర్‌పేటలో అత్యాధునిక గామా ఇరేడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2027 మామిడి సీజన్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ కేంద్రం రైతులకు ఎలా ఉపయోగపడనుందో ఈ కథనం.

తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు 3 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే టెంక పురుగు కారణంగా దాదాపు 20 శాతం పంట నష్టపోతోంది. పండ్ల నాణ్యత దెబ్బతినడంతో రైతులకు సరైన ధరలు రావడం లేదు. అంతేకాదు జపాన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా ప్రభావితమవుతున్నాయి.

ఈ సమస్యకు పరిష్కారంగా శామీర్‌పేటలో గామా రేడియేషన్ ఆధారిత ఇరేడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో మామిడి పండ్లను ప్రత్యేక క్వారంటైన్ ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేస్తారు. గామా కిరణాల ద్వారా పండ్ల లోపల ఉండే పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా నాశనం అవుతాయి.

ఫ్రూట్ ఫ్లై లేదా టెంక పురుగు పిందె దశలోనే పండులోకి ప్రవేశిస్తుంది. పండు పక్వానికి వచ్చే సరికి పురుగు పెరిగి టెంకను పూర్తిగా దెబ్బతీస్తుంది. అయితే ఇరేడియేషన్ ప్రక్రియ ద్వారా ఈ పురుగులను నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రక్రియ వల్ల పండ్ల రుచి, నాణ్యత, పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఇరేడియేషన్ వల్ల మామిడి పండ్ల నిల్వ కాలం కూడా పెరుగుతుంది. దీంతో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. ఎగుమతులు పెరగడంతో రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం శామీర్‌పేటలో కేంద్ర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సివిల్ పనులతో పాటు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక అనుమతులు, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) భద్రతా ప్రమాణాల పరిశీలన కూడా జరుగుతోంది. రేడియేషన్ కేంద్రాల ఏర్పాటుకు కఠినమైన భద్రతా సర్టిఫికేషన్లు, ట్రయల్ రన్స్ తప్పనిసరి కావడంతో కొంత సమయం పడుతోంది.ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2027 మార్చి-ఏప్రిల్ నాటికి ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణ మామిడి రైతులు టెంక పురుగు రహిత పండ్లను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ముంబై, బెంగళూరు నగరాల్లో ఇలాంటి కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎగుమతులకు కొత్త ఊపు రానుంది. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కోహెడలో మరో ఇరేడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.ఏళ్లుగా మామిడి రైతులను ఇబ్బంది పెడుతున్న టెంక పురుగు సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారం అందుబాటులోకి రానుంది. శామీర్‌పేట గామా ఇరేడియేషన్ కేంద్రం పూర్తయితే తెలంగాణ మామిడి పండ్లకు ప్రపంచ మార్కెట్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read More
Next Story