
సిగాచి నిజం దాచేశారా? 54 ప్రాణాలకు న్యాయం జరిగిందా?
ఓటర్ల జాబితాలో పేరు పోతుందా? తెలంగాణలో SIR భయం..| స్పై కెమెరాలకు చెక్! ట్రయల్ రూమ్స్‌పై నిఘా!
రచ్చా రాజకీయం @ 5 పి.ఎం...
1. సిగాచి పేలుడుకు ఏడాదైంది. నిజాం దాచేశారా? కోటి హామీ ఏమైంది?
2. తెలంగాణాలో సర్ భయం. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు అందవా?
3. నిఘా కెమెరాలపై పోలీసుల లాఠీ!
సిగాచి నిజం దాచేశారా? 54 ప్రాణాలకు న్యాయం జరిగిందా?
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదానికి ఏడాది పూర్తవుతోంది. కానీ... బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగిందా? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టిందా? కంపెనీ తన బాధ్యతను నిర్వర్తించిందా?
2025 జూన్ 30 ఉదయం సిగాచి కెమికల్ ప్లాంట్‌లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ రసాయన ధూళి పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. 46 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 8 మందిని తర్వాత చట్టపరంగా మృతులుగా ప్రకటించారు. మొత్తం 54 మంది ప్రాణాలు కోల్పోగా... 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది వలస కార్మికులే.
ప్రమాదం తర్వాత పౌరసంఘాలు, మానవ హక్కుల సంస్థలు, తెలంగాణ పీపుల్స్ జేఏసీ కలిసి హైకోర్టును ఆశ్రయించాయి. బాధితులకు సరైన పరిహారం, చట్టబద్ధమైన హక్కులు అందేలా న్యాయపోరాటం సాగింది. ఈ కేసు విచారణలో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, డ్రగ్స్ కంట్రోల్ శాఖలను కూడా హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ 128 పేజీల నివేదికలో కీలక విషయాలు బయటపెట్టింది. భద్రతా ప్రమాణాలను తీవ్రంగా ఉల్లంఘించడం, పర్యవేక్షణలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ప్రమాదానికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. దీంతో ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమనే విమర్శలు వినిపించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. కంపెనీ కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు అదే సమాచారం ఇచ్చింది. అయితే తర్వాత బయటకు వచ్చిన వివరాల ప్రకారం సగటున చెల్లించిన మొత్తం రూ.45 లక్షలకే పరిమితమైందనే ఆరోపణలు వచ్చాయి.
2026 మార్చిలో హైకోర్టులో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో కంపెనీ కీలక అంశాన్ని వెల్లడించింది. తాము చెల్లించిన రూ.42 లక్షలు కేవలం కంపెనీ ఎక్స్‌గ్రేషియా కాదని... అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయం, అలాగే కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ మొత్తాలను కూడా కలిపి చూపినట్లు తెలిపింది. ఈ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
మరణించిన వారి కుటుంబాలతో పాటు గాయపడిన కార్మికుల పరిస్థితి కూడా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. పూర్తి చికిత్స, ప్రకటించిన ఆర్థిక సాయం అందలేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి.
సిగాచి పేలుడు కేవలం ఒక ఫ్యాక్టరీ ప్రమాదం మాత్రమే కాదు... కార్మికుల భద్రత, పారిశ్రామిక బాధ్యత, ప్రభుత్వ పర్యవేక్షణపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన ఘటన. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే భద్రతా ప్రమాణాల అమలు, బాధ్యులపై చర్యలు, బాధితులకు పూర్తి న్యాయం జరగడం అత్యవసరం. అదే ఈ ఘటన నేర్పిన అతిపెద్ద పాఠం.
--------
ఓటర్ల జాబితాలో పేరు పోతుందా? తెలంగాణలో SIR భయం..
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ...
అంటే SIR ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు SIR అంటే ఏమిటి? ఎందుకు కొందరిలో భయం పెరుగుతోంది? ఈ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఏమి చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ చర్చకు కారణమైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బోరబండకు చెందిన 51 ఏళ్ల టాక్సీ డ్రైవర్ షేక్ ముజీబ్ జూన్ 28న ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఓటర్ల జాబితాలో పేరు కనిపించకపోవడం, ఆధార్, పాస్‌పోర్ట్ వంటి పత్రాల్లో వివరాలు సరిపోకపోవడం వల్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పత్రాల సవరణ కోసం భారీగా ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కుటుంబం చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు SIR ప్రక్రియలో ఏమి చేస్తారు? ఎన్నికల కమిషన్ ప్రకారం... ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా ఉండకుండా చూడటం, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా లేదా వ్యక్తిగత వివరాల్లోని తప్పుల సవరణ, డూప్లికేట్ నమోదులను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశాలు.
అయితే... కొందరిలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. పేరులో స్పెల్లింగ్ మార్పు, ఇంటి నంబర్ మారడం, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడం, ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర పత్రాల్లో వివరాలు ఒక్కలా లేకపోవడం వంటి కారణాలతో తమ పేరు జాబితా నుంచి తొలగిపోతుందేమోనని భయపడుతున్నారు.
ఈ ప్రక్రియలో "తార్కిక వ్యత్యాసాలు" అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఒకే వ్యక్తి రెండు చోట్ల నమోదు కావడం, వయస్సులో తేడాలు ఉండటం, కుటుంబ వివరాలు సరిపోకపోవడం, పేర్లలో మార్పులు కనిపించడం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు... ప్రతిపక్ష పార్టీలు, పౌర సంఘాలు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పాత రికార్డులతో పోల్చడం వల్ల నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ముఖ్యంగా తరచూ చిరునామా మార్చుకునే వారు, అద్దె ఇళ్లలో నివసించే వారిపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎన్నికల కమిషన్ మాత్రం... ఎవరినీ అన్యాయంగా తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తోంది. తప్పులు సరిచేసి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని చెబుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ వివరాలను సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం SIR ప్రక్రియ ఎలా అమలవుతుంది? ప్రజల సందేహాలను ఎలా నివృత్తి చేస్తారు? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
-----------
స్పై కెమెరాలకు చెక్! ట్రయల్ రూమ్స్‌పై నిఘా!
స్పై కెమెరాలు... ఇప్పుడు మహిళలకు పెద్ద భయంగా మారుతున్నాయి. ట్రయల్ రూమ్స్, రెస్ట్‌రూమ్స్, హోటళ్లు, లాడ్జిల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ పోలీసులు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఇప్పటికే 100కు పైగా షాపింగ్ మాల్స్, హోటళ్లు, లాడ్జిలకు నోటీసులు జారీ చేశారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్‌రూమ్స్‌లో రహస్య కెమెరాలను పూర్తిగా అరికట్టడమే ఈ డ్రైవ్ లక్ష్యం.ఇకపై ప్రతి షాపింగ్ మాల్, హోటల్, లాడ్జిలో కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్‌ను తప్పనిసరిగా నియమించాలి. అలాగే స్పై కెమెరాలను గుర్తించే ప్రత్యేక డిటెక్షన్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. యాజమాన్యాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి వాటి రికార్డులను భద్రపరచాలి.
గత కొంతకాలంగా ట్రయల్ రూమ్స్, హాస్టళ్లు, హోటళ్లు, లాడ్జిల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం, సోషల్ మీడియా, అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం కూడా జరిగింది. ఇటీవల సైదాబాద్‌లో జరిగిన ఘటన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
రహస్య కెమెరాలపై నిఘా కోసం హైదరాబాద్ పోలీసులు 'షీ నేత్ర టీమ్స్'ను రంగంలోకి దించారు. నగరంలోని ఏడు జోన్లలో ప్రత్యేక బృందాలు అత్యాధునిక డిటెక్టర్లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లు, హాస్టళ్లు, కాలేజీలు, ఆస్పత్రుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగనున్నాయి.
కొత్త నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడం, సంస్థలను సీజ్ చేయడం, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వంటి చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.
ట్రయల్ రూమ్స్ లేదా రెస్ట్‌రూమ్స్‌లో అనుమానాస్పద పరికరాలు లేదా రహస్య కెమెరాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డయల్ 100 లేదా 112కు కాల్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్ షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 9490616555కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని పోలీసులు తెలిపారు.
Next Story

