30% ఫారాలే పంపిణీ! SIR కోసం 16 హెల్ప్‌డెస్క్‌లు!
x

30% ఫారాలే పంపిణీ! SIR కోసం 16 హెల్ప్‌డెస్క్‌లు!

4 లైన్ల ఫ్లైఓవర్! GVK నుంచి PVNR వరకు | ఆర్టీసీ కార్గో ప్రైవేట్‌కు అప్పగింత..!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) 30% ఫారాలే పంపిణీ!SIR కోసం 16 హెల్ప్‌డెస్క్‌లు!

2) 4 లైన్ల ఫ్లైఓవర్!GVK నుంచి PVNR వరకు

3) ఆర్టీసీ కార్గోప్రైవేట్‌కు అప్పగింత..!

1) 30% ఫారాలే పంపిణీ! SIR కోసం 16 హెల్ప్‌డెస్క్‌లు!

హైదరాబాద్‌లో SIR ప్రక్రియ.. ఎందుకు నెమ్మదించింది? 16 హెల్ప్‌డెస్క్‌లు ఎందుకు ఏర్పాటు చేశారు?

"మీ ఇంటికి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వచ్చారా? ఒక ఫారం ఇచ్చి వివరాలు నింపమన్నారా? హైదరాబాద్‌లో SIR ప్రక్రియ ఎందుకు నెమ్మదిగా సాగుతోంది? 16 ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు SIR అంటే ఏమిటి? ఇప్పుడు నగరంలో ఏం జరుగుతోంది?

SIR ప్రక్రియలో.. కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, ఒకే వ్యక్తి పేరు రెండుచోట్ల ఉంటే సరిచేయడం, చిరునామా మారిన వారి వివరాలను అప్‌డేట్ చేయడం వంటి పనులు చేపడుతున్నారు. దీని ప్రధాన లక్ష్యం.. ఖచ్చితమైన, తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయడం.ప్రస్తుతం హైదరాబాద్‌లో SIR ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 60 శాతానికి పైగా పూర్తవగా.. హైదరాబాద్‌లో మాత్రం సుమారు 30 శాతం మాత్రమే పూర్తైంది. అయితే ఎన్నికల సంఘం జూలై 2 సాయంత్రంలోగా 100 శాతం ఫారాల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టడంతో అధికారులు, బీఎల్‌ఓలు వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్‌లో SIR ప్రక్రియ మందగించడానికి అధికారులు చెబుతున్న ప్రధాన కారణాలు ఇవే.

1. కొత్తగా నియమించిన బీఎల్‌ఓలకు తగిన అనుభవం, పూర్తి స్థాయి శిక్షణ లేకపోవడం.

2. ఉద్యోగాలు, ఉపాధి కారణంగా చాలా మంది ఓటర్లు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఒకే ఇంటికి పలుమార్లు వెళ్లాల్సి రావడం.

3. ఆన్‌లైన్ ఎన్యూమరేషన్ సాఫ్ట్‌వేర్‌లో పేరు, ఇంటిపేరు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు రావడం వల్ల

4. కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవడం.

5. నగర శివారు ప్రాంతాల్లోని కొందరు ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటరుగా కొనసాగేందుకు ఆసక్తి చూపడం.

ఈ కారణాల వల్ల ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబానికి Enumeration Form అందిస్తున్నారు. ఆ ఫారంలో ఉన్న వివరాలను ఓటర్లతో ధృవీకరిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోతే మళ్లీ వెళ్లాలని ఎన్నికల సంఘం సూచించింది. అవసరమైతే మూడు సార్లు వరకు సందర్శిస్తున్నారు. ఈ ఇంటింటి ధృవీకరణ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో ఓటర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించుకునే అవకాశం ఉంది. SIR ప్రక్రియపై ప్రజలకు ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు 16 ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

ఈ హెల్ప్‌డెస్క్‌లలో.. Enumeration Form ఎలా నింపాలి? ఏ పత్రాలు అవసరం? మీ ప్రాంతానికి సంబంధించిన BLO, ERO, AERO వివరాలు ఏమిటి? వివరాల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేయాలి? వంటి అంశాలపై మార్గదర్శకత్వం అందిస్తున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో హెల్ప్‌డెస్క్‌తో పాటు GHMC కమిషనర్ కార్యాలయంలో మరో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ భారీ స్థాయిలో కొనసాగుతోంది. నగరంలో సుమారు 47.36 లక్షల మంది ఓటర్లు, 4,062 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వేలాది మంది BLOలు ఇంటింటికీ వెళ్లి వివరాలను ధృవీకరిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన Booth Level Agents కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సంఘం అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో ఉంచడమే తమ లక్ష్యమని, తప్పులు, డూప్లికేట్ నమోదులు, పాత వివరాలను మాత్రమే సరిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది.

మొత్తానికి, హైదరాబాద్‌లో SIR ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇదే సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు 16 ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

----------------------

2) 4 లైన్ల ఫ్లైఓవర్! GVK నుంచి PVNR వరకు

హైదరాబాద్‌కు భారీ ఊరట..

4 లైన్ల కొత్త ఎలివేటెడ్ హైవేకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ మరో కీలక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. నగరంలో నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు డిజైన్ రూపొందిస్తుండగా, త్వరలో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ బంజారాహిల్స్‌లోని జీవీకే వన్ మాల్ నుంచి మెహిదీపట్నంలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మార్గమధ్యలో మూడు అప్ ర్యాంపులు, రెండు డౌన్ ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తాజ్ డెక్కన్, మసాబ్ ట్యాంక్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ సమీపంలో అప్ ర్యాంపులు, బంజారాహిల్స్ రోడ్ నెం.12, ఆసిఫ్‌నగర్ రోడ్ వద్ద డౌన్ ర్యాంపులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రస్తుతం ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉండటంతో పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం, ఎయిర్‌పోర్టు వైపు ప్రయాణించే వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాజ్ కృష్ణా హోటల్, కేర్ ఆస్పత్రి, పెన్షన్ ఆఫీస్, ఎన్‌ఎండీసీ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

కొత్త ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ఎయిర్‌పోర్టుకు వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. అలాగే బంజారాహిల్స్ నుంచి విజయ్‌నగర్ కాలనీ వైపు నాలుగు లైన్ల అండర్‌పాస్ నిర్మాణాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సాయిల్ టెస్టులు, ట్రాఫిక్ సర్వేలు కొనసాగుతుండగా, ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత పనులు ప్రారంభించి రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

---------------

3) ఆర్టీసీ కార్గో ప్రైవేట్‌కు అప్పగింత..!

"ఏటా రూ.110 కోట్లకు పైగా ఆదాయం వచ్చే తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించబోతోందా? దీంతో ఆర్టీసీకి నష్టమా? లేక లాభమా? కార్మిక సంఘాలు ఎందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి? అసలు ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఈ వివాదం మొత్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల రవాణాతో పాటు కార్గో అండ్ లాజిస్టిక్స్ సేవలను కూడా నిర్వహిస్తోంది. బస్సుల ద్వారా పార్సిళ్లు, వ్యాపార వస్తువులు, డాక్యుమెంట్లు తదితర సామగ్రిని రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలకు కూడా చేరవేస్తోంది. ప్రస్తుతం ఈ కార్గో సేవలు ఆర్టీసీకి ఏటా సుమారు రూ.100 నుంచి రూ.110 కోట్ల వరకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

ఆర్టీసీ యాజమాన్యం 'అవేజీ ప్రైవేట్ లిమిటెడ్' (Aveji Private Limited) అనే సంస్థను మాస్టర్ ఏజెంట్గా ఎంపిక చేసినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, ఎంపికైన సంస్థకు Letter of Intent కూడా జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. అయితే, ఎంపికైన సంస్థ పేరును ఆర్టీసీ అధికారికంగా ప్రకటించలేదని ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది.

సమాచారం ప్రకారం ఈ ఒప్పందం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ప్రైవేట్ సంస్థ నెలకు రూ.3 కోట్లు, అంటే ఏడాదికి రూ.36 కోట్లను లైసెన్స్ ఫీజుగా ఆర్టీసీకి చెల్లించనుంది. ఈ కొత్త విధానాన్ని ఆగస్టు 1 నుంచి అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారి వాదన ప్రకారం..ఏటా రూ.100 నుంచి రూ.110 కోట్ల ఆదాయం వచ్చే కార్గో సేవలను కేవలం రూ.36 కోట్ల లైసెన్స్ ఫీజుకు అప్పగించడం వల్ల ఆర్టీసీకి భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని అంటున్నారు. సంస్థకు ప్రతి ఏడాది రూ.75 కోట్లకు పైగా ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి కార్గో సేవలను మరింత అభివృద్ధి చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. 500 మందికి పైగా లైసెన్స్డ్ హమాలీలు, కార్గో సిబ్బంది, స్థానిక ఏజెంట్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో కూడా ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తున్నారని, ఇప్పుడు కార్గోను కూడా ప్రైవేట్‌పరం చేయడం ద్వారా ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. వారి వివరణ ప్రకారం.. కార్గో ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వ్యయం, ఇతర ఖర్చులు పోని చూస్తే సంస్థకు మిగిలేది సుమారు రూ.30 కోట్ల నికర ఆదాయమే. ప్రైవేట్ మాస్టర్ ఏజెంట్ నుంచి ఏడాదికి రూ.36 కోట్ల స్థిర లైసెన్స్ ఫీజు వస్తే.. ఆదాయం ఖాయంగా వస్తుంది. నిర్వహణ భారం తగ్గుతుంది. రిస్క్ తగ్గుతుంది. సంస్థకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

ప్రస్తుతం టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఎంపికైన 'అవేజీ ప్రైవేట్ లిమిటెడ్' కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొత్త ఒప్పందాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాయి.

మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ కార్గో ప్రైవేటీకరణ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు యాజమాన్యం ఇది సంస్థకు ప్రయోజనకరమని చెబుతుంటే.. మరోవైపు కార్మిక సంఘాలు ఆర్టీసీ ఆదాయం తగ్గడంతో పాటు వందలాది మంది ఉద్యోగుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందా? లేక కార్మిక సంఘాల నిరసనలతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story