
నోటిఫికేషన్లు ఎండమావిలాగ ఊరిస్తున్నాయా?
కిరణ్ రాథోడ్...పీజీలో పొలిటికల్ సైన్స్ చదివాడు. 2020లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోగానే గ్రూప్ -1 పోస్టు కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లలో పరీక్షలకు హాజరయ్యాడు. అయితే ఆ నోటిఫికేఫషన్లలో కొన్ని విదాదాల కారణంగా రద్దయ్యాయి. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేస్తుందని ఎదురు చూస్తున్నా ఇంతవరకు జారీకాలేదు. ఇంకా ఎంతకాలం గ్రూపులకు హాజరవ్వాలో తెలీటంలేదని రాథోడ్ ఆవేధన వ్యక్తంచేశాడు.
పరికిరాల నరేష్...వేధన మరోరకంగా ఉంది. నరేష్ ఇంజనీరింగులో కంప్యూటర్ సైన్స్ చదివాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కాలేజీలో 9 ఏళ్ళ క్రితం ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్న ఈ ఇంజనీర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రైవేటు కంపెనీల్లో జాయిన్ కాలేదు. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అవసరమైన కోచింగ్ తీసుకుంటున్నా నోటిఫికేషన్లు రావటంలేదు, వచ్చినవి రద్దవుతున్నాయి. రేవంత్ సర్కార్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తుందో, ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తుందో తెలీటంలేదన్న నిర్వేధం కనబడుతోంది.
గ్రూప్-1, గ్రూప్-2, 3, 4 ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత పడుతున్న ఆవేదన పై ఇద్దరి నిరుద్యోగ యువత మాటల్లో స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరితే లైఫ్ సెట్ అయిపోతుందన్న కోరికతో లక్షలాదిమంది నిరుద్యోగులు రాత్రిం, బగళ్ళు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. మరికొందరు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ప్రతిరోజు వస్తారు. దినపత్రికలు, గతంలో జరిగిన గ్రూపు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను ముందుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రతిరోజు వేలాదిమంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు జారీ అవుతాయి, పరీక్షలు జరుగుతాయి, ఉద్యోగాల్లో చేరాలన్న తపనతో ప్రతిరోజు గంటలపాటు లైబ్రరీలోనే పుస్తకాలతో కుస్తీలు పడుతుండటం అందరికీ తెలిసిందే. ఏళ్ళ తరబడి గ్రూప్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్లు కూడా జారీ కాకపోవటంతో యువతలో నైరాశ్యం పేరుకుపోతోంది.
“పేదకుటుంబాల నుంచి వచ్చాం దుర్భరమైన బతుకు బతుకుతున్నాం, నోటిఫికేషన్లు జారీకాక, ఉద్యోగాల్లో చేరలేక నానా అవస్తలు పడుతున్నాము’’ అని కృష్ణమోహన్ అనే నిరుద్యోగి ఆవేధనతో చెప్పాడు. ‘‘నేను ఉద్యోగంలో చేరితే నా కుటుంబాన్ని కాపాడుకోవచ్చనే తపనతో, ఆశతో ఎప్పుడు వస్తాయో తెలీని నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్నాను’’ అని చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలోని ఆవేధన కృష్ణమోహన్ మాటల్లో స్పష్టంగా అర్ధమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో రోజూ వేలాది మంది యువత కూర్చుని గంటల తరబడి చదువుతున్నా కొత్త నోటిఫికేషన్లు, పరీక్షలపై స్పష్టత లేకపోవడం వారిలో ఆందోళనను పెంచుతోంది. 70వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ ప్రభుత్వం చెబుతున్నా కొత్తగా భర్తీ చేయాల్సిన ఖాళీలు ఎన్ని ? నోటిఫికేషన్లు ఎప్పుడు జారీ అవుతాయి ? నియామకాలకు టైమ్‌లైన్ ఏమిటి ? అన్నది సమాధానంలేని ప్రశ్నగా మారింది.
ఉద్యోగంకోసం చదువుతున్న యువత ఆర్థిక, మానసిక ఒత్తిడితో పాటు కుటుంబాలపై పడుతున్న భారం, ఆవిరి అయిపోతున్న ఆశలతో యువతలో నిస్తేజం పెరిగిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు జారీచేస్తుందో తెలీదు, ఉద్యోగాల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలీదు. అయినా భవిష్యత్ మీద ఆశలతో వేలాదిమంది నిరుద్యోగ యువత మాత్రం సిటీ లైబ్రరీకి క్రమం తప్పకుండా హాజరై ప్రిపేర్ అవుతుంటారు. ఉద్యోగం కోసం చదువుతున్న యువతకు హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ ఒక అడ్డాగా మారింది.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లైబ్రరీ తెరిచి ఉంటుంది. చదువుకోవడానికి వచ్చే నిరుద్యోగులకు ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్ కూడా అందిస్తున్నారు. లైబ్రేరియన్ బొల్లం మహేందర్ చెప్పిన వివరాల ప్రకారం ‘‘రోజుకు దాదాపు 2,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు". అంటే ఉద్యోగం కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో, ఒక్క లైబ్రరీకి వచ్చే ఈ వేలాది మంది యువతను చూస్తేనే అర్థమవుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీకోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. అప్పట్లో రేవంత్ హామీలు నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నింపింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియామకాలు జరిగినప్పటికీ కొత్త నోటిఫికేషన్లు, ఖాళీల భర్తీ వేగంపై నిరుద్యోగుల్లో మాత్రం అసంతృప్తి పెరిగిపోతోంది. “ఎప్పుడు నోటిఫికేషన్ జారీ అవుతుందో తెలియదు, ఎప్పుడు పరీక్ష జరుగుతుందో కూడా తెలియదు.” అనే అనిశ్చితి గత మూడుఏళ్ళుగా కొనసాగుతోందని పరికిరాల నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరో వైపు ప్రభుత్వం మాత్రం తాము ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. 2026 జనవరిలో గ్రూప్-3లో ఎంపికైన 1,370 మందికి నియామక పత్రాలు అందించిన సందర్భంగా, తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు, రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి చెప్పారు. జూన్ 2026లో కూడా 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే, కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు జారీ అవుతాయనే నిరుద్యోగుల ప్రశ్నలు మరోవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీ జెండావందనం సందర్భంలో రేవంత్ మాట్లాడుతు ‘‘ప్రతి ఆరునెలలకు జాబ్ నోటిఫికేషన్లు జారీ అవుతాయి’’ అని చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలను పెంచేస్తున్నాయి. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు...“2022 నుంచి 2024 మధ్య గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియను చూస్తే, గ్రూప్ ఉద్యోగాల్లో కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్-1లో 563 పోస్టులు నోటిఫై చేయగా 562 మందిని ప్రొవిజనల్‌గా ఎంపిక చేశారు. గ్రూప్-2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక గ్రూప్-4లో 8,180 పోస్టులు నోటిఫై చేయగా 9.51 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరకు 8,084 మందితో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. ఈ ఒక్క లెక్కే ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువతలో ఉన్న పోటీని చూపిస్తోంది. 8వేల పోస్టులకు 9.5 లక్షల దరఖాస్తులు వస్తున్నాయంటే ఒక్క పోస్టు కోసం ఎంతమంది యువత కలలు కంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సి.ఎం.గా రేవంత్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చారని, కొత్తనోటిఫికేషన్లు ఇవ్వలేదని మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకట కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్య కేవలం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీఅవటమే కాదు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడటంలోనే వయసు పెరిగి పోవడం. ఒక పరీక్షకు చదివి మరో నోటిఫికేషన్ కోసం మళ్లీ ప్రిపేర్ కావడం. ఇలా ఒక ఉద్యోగం కోసం యువత జీవితంలోని ఎంతో విలువైన జీవితాలు నిస్సారంగా గడిచిపోతున్నాయని రవి నాయక్ చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రాహూల్‌గాంధీ ఇచ్చిన భరోసాకు దిక్కులేకుండా పోయింది’’ అని మండిపోయారు. ‘‘మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి ఊరు ఊరు వెళ్ళి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగుల్ని మోసం చేశాడు’’ అని రేవంత్ ను ఉద్దేశించి రవినాయక్ ఆరోపించారు. “దిశ లేని ప్రయాణం చేస్తున్నాం, ఎప్పుడు వస్తాయో తెలీని నోటిఫికేషన్ల కోసం చదువుతున్నాం’’ అంటూ నిరుద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఉద్యోగాలు రావడం లేదు. పెళ్లి కావడం లేదు. ఒత్తిడికి గురవుతున్నాం, డిప్రెషన్‌లోకి వెళ్తున్నాం” ఇది కేవలం పరీక్షకు సంబంధించిన ఒత్తిడి కాదు. ఏళ్ల తరబడి కుటుంబం నుంచి డబ్బులు తీసుకుని కోచింగ్ తీసుకోవాలి. పుస్తకాలు కొనాలి. హాస్టల్ రూమ్ అద్దె చెల్లించాలి. అదే సమయంలో ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రతి నెలా తల్లిదండ్రులతో మాట్లాడుతు “ తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది” అని మభ్యపెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నట్లు నిరుద్యోగులు ఆవేధనతో చెప్పారు.
నిరుద్యోగ సమస్యకు సంబంధించిన అధికారిక గణాంకాలు కూడా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ PLFS (Periodic Labour Force Survey) గణాంకాల ప్రకారం 15–29 ఏళ్ల యువతలో తెలంగాణ నిరుద్యోగ రేటు 2025–26లో 18.1 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 20.9 శాతం కాగా యువతుల్లో పట్టణ నిరుద్యోగ రేటు 30.7 శాతంగా ఉంది. అంటే ఉద్యోగం కోసం పోటీ పడుతున్న యువతలో ముఖ్యంగా పట్టణ యువతులు కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగాల నిరుద్యోగ రేటు మాత్రమే కాదు మొత్తం యువ కార్మిక శక్తికి సంబంధించిన అధికారిక నిరుద్యోగ గణాంకం అని గుర్తుంచుకోవాలి.
నిరుద్యోగులు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారుగ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4లో ఉన్న మొత్తం ఖాళీలు ఎన్ని? ఎప్పుడు నోటిఫికేషన్లు జారీ అవుతాయి ? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ? అని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంమాత్రం గత ప్రభుత్వహయాంలో పెండింగ్‌లో ఉన్న నియామకాలను పూర్తి చేశామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)ని ప్రక్షాళన చేసి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళామని చెబుతోంది. రాజకీయ పార్టీలకు ఇది ఒక హామీ కావచ్చు కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఇది జీవిత సమస్యగా మారిపోయింది.
ఒకవైపు ప్రభుత్వం 70వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. మరోవైపు కొత్త నోటిఫికేషన్ల కోసం వేలాది మంది యువత లైబ్రరీల్లో కూర్చొని ఎదురుచూస్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నది మాత్రమే కాదు. ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటిలో నేరుగా భర్తీ చేయగల పోస్టులు ఎన్ని? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎంపికైన వారికి ఎప్పుడు నియామకాలు ఇస్తారు? ఈ మొత్తం ప్రక్రియకు స్పష్టమైన టైమ్‌లైన్ ఉంటే నిరుద్యోగ యువతకు కనీసం ఒక దిశ కనిపిస్తుంది. లేకపోతే లైబ్రరీలో పుస్తకం తెరిచి పెట్టుకుని నోటిఫికేషన్ కోసం మొబైల్ స్క్రీన్ చూస్తూ గడిపే రోజులు మరింత పెరుగుతాయి.

