
ఉపాధి హామీపై రచ్చ! VB-GRAM Gకి తెలంగాణ నో...
95 నియోజకవర్గాల్లో టోల్ లేకుండానే కొత్త రోడ్లు | VIP సెక్యూరిటీ కట్.. కాంగ్రెస్ vs BRS మాటల యుద్ధం!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) ఉపాధి హామీపై రచ్చ! VB-GRAM G కి తెలంగాణ నో...
2) 95 నియోజకవర్గాల్లో టోల్ లేకుండానే కొత్త రోడ్లు
3) VIP సెక్యూరిటీ కట్.. కాంగ్రెస్ vs BRS మాటల యుద్ధం!
1) ఉపాధి హామీపై రచ్చ! VB-GRAM Gకి తెలంగాణ నో
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం VB-GRAM G (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుండగా, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిని బలోపేతం చేయడమే దీని లక్ష్యమని కేంద్రం చెబుతోంది.
అయితే 100 రోజుల ఉపాధి హామీ, రాష్ట్రాల అధికారాలు, నిధుల కేటాయింపు విధానం, గ్రామీణ పేదల జీవనోపాధిపై ప్రభావం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో VB-GRAMGకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఇతర రాష్ట్రాల అభిప్రాయాల సేకరణ. న్యాయపరమైన మార్గాల పరిశీలిస్తోంది. ఈ కొత్త చట్టాన్ని పూర్తిగా ఆమోదించాలా, లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, లేదంటే సొంతంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలా అనే దానిపై జూలై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రధాన అభ్యంతరాలు ఇవి.
1. రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం
MGNREGAలో ఇప్పటి వరకు అయిన ఖర్చుల్ని కేంద్ర ప్రభుత్వం భరించేది. అయితే VB-GRAMGలో రాష్ట్రాల వాటా గణనీయంగా పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఏడాది సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
2. కేంద్ర నిధులు తగ్గే అవకాశం
తెలంగాణకు 2014 తర్వాతసుమారు రూ.36,000 కోట్లకు పైగా MGNREGA నిధులు వచ్చాయి.
కొత్త విధానంలో కేంద్రం వాటా తగ్గితే రాష్ట్రానికి వచ్చే మొత్తం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
3. ఉపాధి హక్కు బలహీనపడుతుందనే వాదన
MGNREGA ఒక చట్టబద్ధమైన ఉపాధి హక్కు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం కొత్త చట్టంలో ఆ హక్కు బలహీనపడే అవకాశం ఉందని అంటోంది.
4. పంచాయతీల అధికారాలు తగ్గుతాయని ఆరోపణ
MGNREGAలో గ్రామ సభ, గ్రామ పంచాయతీలకు పనుల ఎంపికలో కీలక పాత్ర ఉండేది. కొత్త వ్యవస్థలో కేంద్ర మార్గదర్శకాలు ఎక్కువగా ఉంటాయని, స్థానిక స్వయంప్రతిపత్తి తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
5. మహిళా కార్మికులపై ప్రభావం
MGNREGAలో మహిళల పాల్గొనడం అత్యధికంగా ఉంది. కొత్త నిబంధనల వల్ల మహిళల ఉపాధి అవకాశాలు తగ్గవచ్చని తెలంగాణ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది.
6. సాంకేతిక నిబంధనలు
ప్రతి కార్మికుడికి జియోట్యాగ్డ్ ఫోటోలు, డిజిటల్ ధృవీకరణ, కఠినమైన ఆన్‌లైన్ విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణకు ఇప్పటి వరకు ఎంత నిధులు వచ్చాయి?
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014 తర్వాత సుమారు రూ.36,000 కోట్లకు పైగా MGNREGA ద్వారా తెలంగాణకు విడుదలయ్యాయి. ఇంకా సుమారు రూ.500 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఎంత మంది లబ్ధిదారులు?
తెలంగాణలో సుమారు 32 లక్షల జాబ్ కార్డు హోల్డర్లు వున్నారని ప్రభుత్వం చెబుతోంది.
రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది.
ఈ కమిటీ పరిశీలిస్తున్న అంశాలుః
1. సమాఖ్య వ్యవస్థ (Federalism)
కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా కొత్త చట్టం తీసుకువచ్చిందనే అభ్యంతరం.
2. రాష్ట్రాల ఆర్థిక హక్కులురాష్ట్రాలపై అదనపు నిధుల భారం మోపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అనే అంశం.
3. గ్రామీణ కార్మికుల హక్కులు ఉపాధి హామీ బలహీనపడుతుందా?
4. పంచాయతీరాజ్ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల అధికారాలు తగ్గుతున్నాయా?
5. సంక్షేమ పథకాలపై ప్రభావం గ్రామీణ పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం ఉందా?
6. ఇతర రాష్ట్రాలతో కలిసి పోరాటం కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని తెలంగాణ పరిశీలిస్తోంది.
తెలంగాణ చట్టపరమైన అభ్యంతరాలు
1. సమాఖ్య వ్యవస్థ (Federalism)
భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం–రాష్ట్రాలు కలిసి అమలు చేసే సంక్షేమ పథకాలలో రాష్ట్రాల పాత్ర కీలకం. రాష్ట్రాలతో తగిన సంప్రదింపులు లేకుండా విధానంలో పెద్ద మార్పులు చేశారని తెలంగాణ వాదించవచ్చు.
2. 73వ రాజ్యాంగ సవరణ
గ్రామ పంచాయతీలు, గ్రామ సభలకు ఉన్న అధికారాలు కొత్త విధానంలో తగ్గుతున్నాయని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి ఇది విరుద్ధమని కోర్టు ముందు చెప్పవచ్చు.
3. ఉపాధి హక్కు బలహీనపడిందా?
MGNREGA ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధికి చట్టబద్ధ హామీ ఉంది. కొత్త విధానం వల్ల ఆ హామీ స్వరూపం మారిందా లేదా బలహీనపడిందా అనే అంశాన్ని కోర్టు పరిశీలించే అవకాశం ఉంది.
4. ఆర్థిక భారంకేంద్రం
తన ఆర్థిక బాధ్యతను రాష్ట్రాలపై మోపుతోందని తెలంగాణ వాదించవచ్చు. రాష్ట్రాలపై అదనపు నిధుల భారం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అనే అంశం కూడా చర్చకు రావచ్చు.
5. సమానత్వం (ఆర్టికల్ 14)
కొత్త నిబంధనలు అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తున్నాయా? లేక కొన్ని రాష్ట్రాలపై అసమాన ప్రభావం చూపుతున్నాయా? అనే కోణంలో కూడా సవాలు చేసే అవకాశం ఉంది.
2) 95 నియోజకవర్గాల్లో టోల్ లేకుండానే కొత్త రోడ్లు
తెలంగాణలో రహదారుల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ స్థాయిలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా వేల కిలోమీటర్ల రహదారులను విస్తరించేందుకు దాదాపు రూ.22 వేల కోట్లతో భారీ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలోనే 13 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM). ఇందులో రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60 శాతం మొత్తాన్ని ముందుగా గుత్తేదారు సంస్థలు భరిస్తాయి. మిగిలిన 40 శాతం ప్రభుత్వమే దశలవారీగా చెల్లిస్తుంది. గుత్తేదారులు పెట్టిన 60 శాతం పెట్టుబడిని ప్రభుత్వం 15 ఏళ్లలో వార్షిక వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తుంది. దీంతో ఒకేసారి ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడకుండా రోడ్ల అభివృద్ధి చేపట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ఓఆర్‌ఆర్ పరిధి, ఓఆర్‌ఆర్–ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాలకు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌కు వెలుపల ఉన్న గ్రామీణ, పట్టణ రహదారులను హ్యామ్ విధానంలో ఆధునికీకరించనున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహదారులు మెరుగుపడనున్నాయి. రాబోయే మూడేళ్లలో మొత్తం 36 వేల కిలోమీటర్ల రోడ్లను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి దశలో ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 8 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో కలిపే సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఉన్న రెండు వరుసల రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రతి రహదారిపై ట్రాఫిక్, వెడల్పు, వంతెనలు, కల్వర్టులు, భూసేకరణ అవసరం వంటి పూర్తి వివరాలను అధికారులు సేకరించారు.
హ్యామ్ విధానంలో నిర్మించే ఈ రహదారులపై టోల్ ట్యాక్స్ ఉండదు. జాతీయ రహదారుల మాదిరిగా టోల్ ద్వారా కాకుండా, గుత్తేదారు సంస్థలు పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం 15 ఏళ్లపాటు వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. ఈ కాలంలో రహదారుల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారు సంస్థలదే. మంత్రిమండలి ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
3) VIP సెక్యూరిటీ కట్.. కాంగ్రెస్ vs BRS మాటల యుద్ధం!
తెలంగాణలో ప్రముఖుల భద్రత తగ్గించడం వివాదాస్పదం అయింది. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ భద్రతను తగ్గించడంపై బీ.ఆర్.ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, నిబంధనలు, భద్రతా సమీక్ష ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం... రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోవడమే. గత కొన్నేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడం, పోలీసుల చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గతంలో ప్రత్యేక భద్రత అవసరమైన పలువురు ప్రముఖులకు ఇప్పుడు అదే స్థాయి సెక్యూరిటీ అవసరం లేదని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది ప్రముఖుల భద్రతను తగ్గించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరికి ప్రస్తుతం కల్పిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్‌లు, ప్రత్యేక భద్రతా సిబ్బందిలో కోత విధించనున్నారు. ఇంతవరకు అమల్లో ఉన్న "వన్ ప్లస్ వన్", "టూ ప్లస్ టూ" భద్రతా విధానాల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 600 మంది ప్రముఖులకు వివిధ స్థాయిల్లో భద్రత కల్పిస్తున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. భద్రత అవసరాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి... ముప్పు తగ్గిన వారికి సెక్యూరిటీ తగ్గించడం, అవసరమైన వారికి మాత్రమే భద్రత కొనసాగించడం ప్రభుత్వ లక్ష్యంగా చెబుతోంది. దీనివల్ల పోలీసు సిబ్బంది, వాహనాలను మరింత అవసరమైన ప్రాంతాల్లో వినియోగించవచ్చని అధికారులు అంటున్నారు.
అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ భద్రత తగ్గింపుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇది రాజకీయ నిర్ణయం కాదని, పూర్తిగా భద్రతా సమీక్ష ఆధారంగా తీసుకున్న పరిపాలనా నిర్ణయమని చెబుతోంది. అవసరమైతే మళ్లీ భద్రత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

