ర్యాంకుల రేసులో.. టీచర్లపై కనిపించని భారం!
x

ర్యాంకుల రేసులో.. టీచర్లపై కనిపించని భారం!


ఒక విద్యార్థి ర్యాంక్ కోసం రాత్రింబవళ్లు చదువుతాడు. కానీ

ఆ ర్యాంక్ కోసం అతనితో పాటు నిద్ర కోల్పోయే మరో వ్యక్తి కూడా ఉంటాడు.

ఆయ‌నే టీచర్.

పోటీ పరీక్షలో విద్యార్థి ఫెయిల్ అయితే ప్రశ్నలు కేవలం అతనిపైనే రావు. అతనికి బోధించిన ఫ్యాకల్టీపై కూడా వస్తాయి. ర్యాంక్ వస్తే ఇన్‌స్టిట్యూట్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ర్యాంక్ రాకపోతే టీచర్ పనితీరు కొలమానంగా మారుతుంది. సిలబస్. టెస్టులు. రిజల్ట్స్. ర్యాంకులు. ఈ నిరంతర రేసులో విద్యార్థులపై ఒత్తిడి కనిపిస్తుంది. కానీ ఆ ర్యాంకుల వెనుక టీచర్లపై పడుతున్న కనిపించని భారం గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతాం. టీచర్స్ డే సందర్భంగా, కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్న టీచర్ల జీవితంలో క్లాస్‌రూమ్‌కు అవతల ఉన్న ఆ ఒత్తిడి, బాధ్యత, నిరంతర పోరాటం...

విద్యార్థి పరీక్ష రాస్తాడు. రిజల్ట్ కోసం టీచర్ కూడా ఎదురుచూస్తాడు. ఎందుకంటే కోచింగ్ సెంటర్ల ప్రపంచంలో ఒక విద్యార్థి ర్యాంక్, కేవలం అతని భవిష్యత్తును మాత్రమే నిర్ణయించదు. ఆ ర్యాంక్ వెనుక బోధించిన టీచర్ పనితీరు, అతని ఉద్యోగ భద్రత, మేనేజ్‌మెంట్‌లో అతని విలువ కూడా దాగి ఉంటుంది.

సిలబస్, టెస్ట్, ర్యాంక్. ఈ నిరంతర సైకిల్‌లో కోచింగ్ టీచర్ క్లాస్ తీసుకోవడమే కాదు, ప్రతి ఫలితంతో తన పనితీరును నిరూపించుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 5. ఉపాధ్యాయ దినోత్సవం రోజు, గురువుల సేవలు, వారి త్యాగాలు, విద్యార్థుల విజయాల్లో వారి పాత్ర గురించి మాట్లాడుకుంటాం. కానీ పోటీ పరీక్షల కోసం పనిచేస్తున్న కోచింగ్ ఫ్యాకల్టీ జీవితంలో మరో కోణం ఉంది. విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి ఉంటే, ఆ ర్యాంకుల వెనుక టీచర్లపై కూడా కనిపించని ప్రెషర్ ఉంటుంది.

హైదరాబాద్‌కు చెందిన ఫిజిక్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చంద్రశేఖర్ రావు మాటల్లో చెప్పాలంటే, కోచింగ్ సెంటర్లలో “సిలబస్, టెస్ట్, ర్యాంక్ అనే సైకిల్ చాలా వేగంగా నడుస్తుంది. ఒక విద్యార్థి ఫెయిల్ అయితే అది కేవలం అతని వ్యక్తిగత పనితీరుగా చూడరు. ఫ్యాకల్టీ పనితీరుపైనా ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ టీచర్ పనితీరును కూడా రిజల్ట్స్‌తో కొలిచే పరిస్థితి ఉంది.

”కెమిస్ట్రీ ఫ్యాకల్టీ రామకృష్ణ కూడా టీచర్ పని క్లాస్‌రూమ్‌తో ముగియదని చెబుతున్నారు. “క్లాస్ ముగిసిన తర్వాత కూడా తదుపరి లెక్చర్ ప్రిపరేషన్, టెస్ట్ పేపర్లు, డౌట్స్, పెర్ఫార్మెన్స్ రివ్యూ, ఇలా ఒక‌దాని త‌రువాత ఒక పని గురించిన ఆలోచ‌నలే వెంటాడుతుంటాయి. విద్యార్థి మంచి ర్యాంక్ సాధించినప్పుడు అందరూ ఇన్‌స్టిట్యూట్ గురించి మాట్లాడతారు” అంటున్నారు.

జనరల్ నాలెడ్జ్ ఫ్యాకల్టీ సత్యనారాయణ మాటల్లో.. “విద్యార్థి పరీక్ష రాస్తాడు. కానీ అతని ర్యాంక్ కోసం ఆందోళన చెందేది విద్యార్థి ఒక్కరే కాదు. తల్లిదండ్రులు, మేనేజ్‌మెంట్‌తో పాటు టీచర్ కూడా ఆ ఫలితాన్ని తన బాధ్యతగా తీసుకుంటాడు.

”బయాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ శిరీష మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. “విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి ఉంటే, ఆ ర్యాంకుల వెనుక టీచర్లపైనా కనిపించని ప్రెషర్ ఉంటుంది. వరుస బ్యాచ్‌లు, ఎక్కువ పని గంటలు, మేనేజ్‌మెంట్ అంచనాలు, రిజల్ట్స్ ఆధారంగా ఉద్యోగ భద్రతపై ఆందోళన, ఇవన్నీ ఫ్యాకల్టీ జీవితంలో భాగమే.

మ్యాథ్స్ ఫ్యాకల్టీ వెంకట్ రెడ్డి చెప్పిన మాటలు కోచింగ్ వ్యవస్థలోని టైమ్ ప్రెషర్‌ను చూపిస్తున్నాయి. “క్లాస్ పూర్తి చేయాలి, తదుపరి బ్యాచ్‌కు వెళ్లాలి, సిలబస్ టార్గెట్ చేరాలి. విద్యార్థికి సందేహం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రతి సందేహానికి సమయం దొరకదు.”

అయితే IIT మ్యాథ్స్ ఫ్యాకల్టీ కాలేషా అభిప్రాయం ప్రకారం, కోచింగ్ టీచర్ బాధ్యత సంప్రదాయ బోధన కంటే భిన్నమైనది. పరీక్షల సరళిని నిరంతరం అధ్యయనం చేస్తూ, మారుతున్న పోటీకి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.

విద్యార్థి చేతిలో కనిపించే ర్యాంక్ వెనుక టీచర్ శ్రమ ఉంటుంది. ఫలితం కోసం టీచర్ చేసే పని మాత్రం క్లాస్ ముగిసిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక, కనిపించని టీచర్ నిరంత‌ర శ్ర‌మ దాగివుంది.

Read More
Next Story