గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
x

గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం

తెలంగాణ అప్పులపై అగ్గి రాజేసిన రాజకీయాలు! | వర్క్ సైట్ స్కూళ్లు.. వలస పిల్లలకు విద్యా భరోసా


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) గంజాయి, అక్రమ మద్యంపై దాడులు పోలీసుల మెగా సెర్చ్ ఆపరేషన్

2) తెలంగాణ అప్పులపై అగ్గి రాజేసిన రాజకీయాలు!

3) వర్క్ సైట్ స్కూళ్లు..వలస పిల్లలకు విద్యా భరోసా

1) గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్ధివాడ, ఫతేనగర్ ప్రాంతాల్లో 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్'లో భాగంగా భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ ఎ. రమణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఒక అదనపు డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10 సెర్చ్ పార్టీలు, 10 కట్-ఆఫ్ పార్టీలు, ఐదు లిఫ్టింగ్ పార్టీలు, ఒక హోల్డింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేసి 25 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL), విక్రయాల కోసం నిల్వ ఉంచిన 82 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

గంజాయి వినియోగదారులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పదంగా ఉన్న 15 మందికి H-NEW బృందం సహాయంతో డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయింది. దీంతో వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఐదు త్రిచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నగరంలో మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ మద్యం విక్రయాల అరికట్టడం, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు భవిష్యత్తులోనూ మరింత విస్తృతంగా కొనసాగుతాయని వెల్లడించారు.

2) లేబర్ క్యాంపుల్లో లెర్నింగ్ క్యాంప్..! 'వర్క్ సైట్ స్కూళ్లు'

తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని తాజాగా విడుదలైన Socio-Economic, Education, Employment, Political and Caste (SEEEPC) సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 89 వేల మంది చిన్నారులు వివిధ రకాల కూలీ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సర్వే పేర్కొంది. వీరిలో అత్యధికంగా మాదిగ (ఎస్సీ), లంబాడీ (ఎస్టీ), మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మైనార్టీ బాల కార్మికుల శాతం అధికంగా నమోదైంది. పేదరికం, విద్యకు దూరం కావడం, తరచూ వలసలు వెళ్లాల్సి రావడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా గుర్తించారు.

మరోవైపు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల పిల్లల విద్య కూడా పెద్ద సవాల్‌గా మారింది. నిర్మాణ రంగంలో పనిచేసే తల్లిదండ్రులు పనుల కోసం ప్రాంతాలు మారుతుండటంతో పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. ఫలితంగా కొందరు చదువు మధ్యలోనే మానేస్తుండగా, మరికొందరు బాల కార్మికులుగా మారుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం 'వర్క్ సైట్ స్కూళ్లు' అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనే తాత్కాలిక పాఠశాలలను ఏర్పాటు చేసి, వలస కార్మికుల పిల్లలకు విద్యతో పాటు భద్రత, సంరక్షణను అందిస్తోంది.దేశంలోనే తొలి వర్క్ సైట్ స్కూల్ నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంపులో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలే. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంగ్లీష్, గణితం, హిందీ వంటి పాఠాలతో పాటు ఆటలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, పిల్లల సంరక్షణ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.

ఈ పాఠశాలల ద్వారా తల్లిదండ్రులు పనిలో ఉన్న సమయంలో పిల్లలు లేబర్ క్యాంపుల్లో నిర్లక్ష్యంగా తిరగకుండా సురక్షిత వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతోంది. చిన్నారుల భద్రత, నిరంతర విద్య, బాల కార్మిక వ్యవస్థ నివారణ అనే మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.

ఇప్పటికే నార్సింగిలో మరో రెండు వర్క్ సైట్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 100 లేబర్ క్యాంపుల్లో ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మరుగుదొడ్లు, ప్రత్యేక ఆటస్థలాలు, ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు వంటి అదనపు సౌకర్యాలు కూడా అందించనుంది.ప్రస్తుతం తెలంగాణలో సుమారు 9 లక్షల అంతర్‌రాష్ట్ర వలస కార్మికులు పనిచేస్తున్నారు. వారి పిల్లలకు విద్య అందించడం, బాల కార్మిక వ్యవస్థను తగ్గించడం, వలస కుటుంబాలకు భరోసా కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వర్క్ సైట్ స్కూళ్ల కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

3) తెలంగాణ అప్పులపై అగ్గి రాజేసిన రాజకీయాలు!

తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటూ భిన్నమైన గణాంకాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంపై రూ.8.21 లక్షల కోట్ల వరకు ఆర్థిక భారం ఉందని చెబుతుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులు సుమారు రూ.4 లక్షల కోట్ల పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది.

అయితే ఈ రెండు లెక్కల్లో ఏది నిజం? ఎందుకు ఇంత పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది? అధికారిక నివేదికలు ఏమి చెబుతున్నాయి? ఈ అంశాన్ని గణాంకాల ఆధారంగా పరిశీలిద్దాం.

తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పు ఎంత?

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్ర అప్పులు సుమారు రూ.72 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల మధ్య ఉన్నట్లు వివిధ అధికారిక పత్రాల్లో నమోదయ్యాయి. ప్రారంభ గణాంకాల్లోనే లెక్కింపు విధానంలో తేడాలు ఉండటంతో తర్వాతి కాలంలో కూడా అప్పుల లెక్కలపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో రాష్ట్రంపై ఉన్న మొత్తం ఆర్థిక భారాన్ని వివరించింది.

ప్రభుత్వం ప్రకారం...ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు, విద్యుత్ సంస్థల బకాయిలు, ఇతర పెండింగ్ ఆర్థిక బాధ్యతలు అన్నింటినీ కలిపితే రాష్ట్రంపై మొత్తం ఆర్థిక భారం రూ.8.21 లక్షల కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది.

రాష్ట్ర ఆదాయంలో దాదాపు 34 శాతం వడ్డీ చెల్లింపులకు, మరో 35 శాతం వేతనాలు, పెన్షన్లకే వెళ్తోందని ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మిగిల్చి వెళ్లిందని, అందువల్ల సంక్షేమ పథకాల అమలుకు కూడా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ వివరిస్తోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, దీనికి సంబంధించిన అన్ని గణాంకాలు ప్రభుత్వ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ వాదన ఏమిటి?

కాంగ్రెస్ చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకారం...ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు,ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) చట్ట పరిధిలో నమోదైన రుణాలుమాత్రమే ప్రభుత్వ అప్పులుగా పరిగణించాలి.

2023 చివరి నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పులు సుమారు రూ.4.17 లక్షల కోట్ల పరిధిలోనే ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతోంది. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను నేరుగా ప్రభుత్వ అప్పుల్లో కలపడం సరికాదని వాదిస్తోంది.

అలాగే తాము చేసిన అప్పులతో కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, రహదారులు వంటి మౌలిక వసతులు నిర్మించామని పేర్కొంటోంది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగుతున్న వివాదం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుల అంశం రాజకీయ చర్చగా కొనసాగుతోంది.

ప్రస్తుత ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, అందుకే కొత్తగా అప్పులు తీసుకోవాల్సి వస్తోందని చెబుతోంది.

మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా రుణాలు తీసుకుందని, ఆ నిధులు ఎక్కడ వినియోగించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తోంది.

కాగ్ (CAG) అధికారిక గణాంకాలు

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక ప్రకారం, 2024 మార్చి 31 నాటికి...రాష్ట్ర ప్రత్యక్ష అప్పులు, ఇతర లయబిలిటీస్ కలిపి : రూ.4,03,664 కోట్లు.

ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్లు తీసుకున్న ఆఫ్-బడ్జెట్ రుణాలు : రూ.1,20,944 కోట్లు

జీఎస్టీ పరిహారం కోసం కేంద్రం ఇచ్చిన బ్యాక్-టు-బ్యాక్ రుణాలు : రూ.6,949 కోట్లు

ఈ మూడు అంశాలను కలిపితే రాష్ట్రంపై మొత్తం ఆర్థిక బాధ్యత సుమారు రూ.5.3 లక్షల కోట్ల పరిధిలో ఉంటుందని కాగ్ గణాంకాలు సూచిస్తున్నాయి.

ఆర్‌బీఐ (RBI) నివేదిక ఏమి చెబుతోంది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నివేదికల్లో కూడా ప్రత్యక్ష ప్రభుత్వ అప్పుల గణాంకాలు కాగ్ లెక్కలకు దగ్గరగానే ఉన్నాయి.

అంటే... బడ్జెట్‌లో నమోదైన ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులను మాత్రమే పరిగణిస్తే రాష్ట్ర అప్పులు సుమారు రూ.4 లక్షల కోట్ల పరిధిలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.

అసలు వివాదం ఎక్కడుంది?

ఇదే మొత్తం రాజకీయ వివాదానికి కేంద్ర బిందువు.

కాంగ్రెస్ లెక్కింపు విధానం

ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులు

కార్పొరేషన్ రుణాలు

ప్రభుత్వ గ్యారంటీలు

విద్యుత్ సంస్థల బకాయిలు

ఇతర ఆర్థిక బాధ్యతలు వీటన్నింటినీ కలిపి మొత్తం రాష్ట్ర ఆర్థిక భారంగా చూపుతోంది.

బీఆర్ఎస్ లెక్కింపు విధానం

బడ్జెట్‌లో నమోదైన ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులను మాత్రమే ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తోంది.

కార్పొరేషన్ల రుణాలను ఆయా సంస్థల బాధ్యతగా చూస్తోంది.

అందువల్ల రాజకీయంగా వినిపిస్తున్న రూ.4 లక్షల కోట్లు, రూ.8.21 లక్షల కోట్లు అనే గణాంకాలు ఒకే పద్ధతిలో లెక్కించినవి కావు.

ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులను మాత్రమే లెక్కిస్తే ఒక సంఖ్య వస్తుంది. అదే ప్రభుత్వ గ్యారంటీలు, కార్పొరేషన్ రుణాలు, ఆఫ్-బడ్జెట్ బాధ్యతలు, ఇతర లయబిలిటీలను కూడా కలిపితే మొత్తం ఆర్థిక భారం మరో స్థాయికి చేరుతుంది.

Read More
Next Story