‘My Slate’ కనిపెట్టి అక్షరాల భయం పోగొట్టిన టీచర్
x

‘My Slate’ కనిపెట్టి అక్షరాల భయం పోగొట్టిన టీచర్

‘పలక’ను మంత్రదండంగా మార్చిన తెలంగాణ టీచర్


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కొంతమంది చిన్నారులకు అక్షరాలే ఒక భయంలా అనిపిస్తాయి. అక్షరాల్ని గుర్తుపట్టడం కష్టంగా అనిపిస్తుంది. పదాలు చదవడం ఒక సవాలుగా మారుతుంది. అలాంటి పిల్లలకు ఓ గురువు చూపించిన సరికొత్త మార్గం “My Slate”. అక్షరాల నుంచి పదాల వరకు, సంఖ్యల నుంచి ప్రాథమిక గణితం వరకు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా 22 భార‌తీయ‌భాష‌ల్లో పిల్లలు సులభంగా నేర్చుకునేలా మంత్రదండలా పనిచేసే పలకను తయారు చేసి పిల్లల్లో అక్షరాలంటే ఉన్న భయం పోగొట్టాడు కె.టి.నాయ‌క్.

సంగారెడ్డి జిల్లా అత్నూర‌మండ‌లం నాగారం గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో నాయ‌క్‌ ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు. ఓ టీచ‌ర్ ఆలోచన ఎలా వేలాది పిల్లల చదువు భయాన్ని తొలగించిందో తెలుసుకుందామా?ప్రభుత్వ పాఠశాల్లో చ‌దువుకుంటూ అక్ష‌రాల్ని చూసి భ‌య‌ప‌డుతున్న పిల్లలకు, వాళ్ల టీచ‌ర్‌ ఖేతావత్ తవ్రియా నాయక్ ఓ మార్గం చూపించాడు.

"ఈ పిల్ల‌ల్ని చూస్తుంటే నా పాఠ‌శాల రోజులు గుర్తుకువ‌స్తున్నాయి. మూడో తరగతి వరకు నేను నారాయణఖేడ్‌లోని నరసాపూర్ గ్రామంలోని డీ-నోటిఫైడ్ ట్రైబల్ పాఠశాలలో చదివాను. అక్కడ నా ప‌రిస్థితి ఇలాగే వుండేది,” అని ఆయన ఫెడ‌ర‌ల్‌తో మాట్టాడుతూ త‌న బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. త‌న చిన్న‌నాటి అనుభ‌వం, ప్ర‌స్తుతం పిల్ల‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం చూప‌డానికి దారి చూపిందంటారు కె.టి.నాయ‌క్‌.

2014లో టెక్కమల్ మండలంలోని కుసంగి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ నాయక్ ఒక విషయం గమనించారు. కొంత మంది చిన్నారులు అక్షరాలు గుర్తించడంలో సరళమైన పదాలు చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచన నుంచే “My Slate” ను త‌యారు చేశారు.

మొదట ఈ సాధనం చెక్కతో తయారైంది. పై భాగంలో అక్షరాలు, అచ్చులు, సంఖ్యలు ఉన్న లామినేటెడ్ షీట్ అమర్చారు. దానికి ఒక స్టాండ్ కూడా జతచేశారు. తరగతి ముందు ఉంచి గురువు బోధిస్తే, పిల్లలు వెంటనే అర్థం చేసుకునేలా రూపొందించారు. కాలక్రమేణా నాయక్ తన ఆలోచనను మరింత మెరుగుపరిచారు. 2021లో ఆయన రామచంద్రాపురంలోని జెడ్‌పీహెచ్ఎస్ ఈరులనాగులపల్లి పాఠశాలకు బదిలీ అయిన తర్వాత “My Slate” ను చిన్నదిగా, సులభంగా తీసుకెళ్లేలా మళ్లీ ఇలా రూపొందించారు.

"పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా, మళ్లీ మళ్లీ అభ్యాసం చేయగలిగేలా, అక్షరాలు, పదాలు, సంఖ్యలు, అన్నీ ఒకే చోట ఉండేలా ప్రభావవంతమైన విద్యా సాధనం “My Slate”, అని టీచ‌ర్ కృష్ణావేణి చెప్పారు.

దీంతో పిల్లలు "అక్షరాలు త్వరగా గుర్తించడం, సరళమైన పదాలు నిర్మించడం, మరల మరల రాయడం అభ్యాసం చేస్తూ నేర్చుకుంటున్నారు", అని టీచ‌ర్ సుప్రియా చెప్పారు.

"జోడింపు, తీసివేత, గుణకం, భాగహారం వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలను కూడా అభ్యసించగలరు.తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవ‌డానికి ఇది ఇలా ఉపయోగపడుతుంది", అని టీచ‌ర్ ఎస్‌.సంగీత చెప్పారు.

“My Slate” లో అక్షరాలు, ధ్వనులు, చిత్రాలు, సంఖ్యలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. మధ్యలో ఉన్న గ్రిడ్ ప్రాంతంలో పిల్లలు అక్షరాలు, పదాలు, సంఖ్యలు రాస్తూ అభ్యాసం చేస్తున్నారు", అని టీచ‌ర్ ఉమాదేవి చెప్పారు.

"ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవ‌చ్చు. టీచ‌ర్ సుల‌భంగా బోధించ‌వ‌చ్చు. పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్ల‌కు నేర్పించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. ధ్వని, పదం, అర్థం మధ్య సంబంధాన్ని త్వరగా అర్థం చేసుకునేలా మై స్లేట్‌ సహాయపడుతుంది", అని టీచ‌ర్ కె.సంగీత చెప్పారు.

"మై స్టేట్ స‌హాయంతో అక్షరాల్ని త్వరగా గుర్తించి, సరళమైన పదాలు రాస్తున్నాం. మరల మరల రాస్తూ నేర్చుకుంటున్నాం. జోడింపు, తీసివేత, గుణకం, భాగహారం వంటి ప్రాథమిక గణితం ఈజీగా చేయ‌గ‌లుగుతున్నామ‌ని", చిన్నారులు ఆర్య‌న్‌, శ్రీశాంత్ రెడ్డి, మ‌హేష్‌, జ్జాన‌శ్రీలు చెప్పారు.

“My Slate” విద్యాశాఖ నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాలు, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్లు వంటి వేదికల్లో ప్రదర్శించబడింది. ఈ ఆవిష్కరణకు అనేక ప్రశంసలు లభించాయి. నాయక్‌కు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది. “ఏ పిల్లవాడు కూడా తరగతి గదిలో వెనుకబడినట్టు అనిపించకూడదు,” అంటారు కె.టి.నాయ‌క్‌. 10 రోజుల్లోనే అక్ష‌ర అభ్యాసం, మ‌రో ప‌ది రోజుల్లో ప‌దాల కూర్పు, ఇక ఆ త‌రువాత వాక్యాల నిర్మాణం. కేవ‌లం 50 రోజుల్లోనే విద్యార్థుల్లో స్ప‌ష్ట‌మైన మార్పు చూడ‌వ‌చ్చ‌ని నాయ‌క్ ప్రాక్టిక‌ల్‌గా నిరూపించారు.

Read More
Next Story