పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ‘పోరుబాట’
x

పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ‘పోరుబాట’


తెలంగాణలో పోలీస్ ఉద్యోగం కోసం లక్షలాది మంది యువత ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2022 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ అనంతరం ప్రభుత్వం తాజాగా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి జూలై 2026 గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈపోస్టులు సరిపోవని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ళు, ఎస్ఐ పోస్టుల భర్తీకి నాలుగేళ్ల విరామం తర్వాత జూలైలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేనషన్ జారీచేసింది.

అయితే ఇప్పటికే తమలో చాలామంది వయోపరిమితికి చేరుకున్నారని నిరుద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేయటానికి జనరల్ కేటగిరీ అభ్యర్ధుల ఏజ్ లిమిట్ 27 కాగా రిజర్వుడు క్యాటగిరీ అభ్యర్ధులకు 32 ఏళ్ళు. అందుకనే ఏజ్ లిమిట్ ను 32 నుండి 36కి పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏళ్ళతరబడి కోచింగ్ తీసుకున్నవారు కొంద‌రైతే, మ‌రికొందరు ప్రైవేట్ ఉద్యోగాలను సైతం వదిలేసి పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారు.

మొత్తం ఖాళీలు ఎన్ని ?

"పోలీస్ శాఖలో సుమారు 17 వేల ఖాళీలు ఉన్నాయని గ‌తంలో ఉన్న‌తాధికారులే చెప్పారు. కాబ‌ట్టి వాటన్నింటినీ భర్తీ చేయాలి" అని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో వయోపరిమితిని కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.పోలీస్ నియామకాలకోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు జరుగుతన్నాయి. కార్యాలయాల ముట్టడి ప్రయత్నాలు, అరెస్టులు కూడా జరిగాయి. కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులతో పాటు నిరుద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.

మంచిర్యాలకు చెందిన గుంపుల వినయ్‌ తన ఆకాంక్షను తెలంగాణ ఫెడరల్‌కు ఇలా వివరించారు. “పోలీస్ జాబ్ చేయాలన్నది నా చిన్ననాటి కల. ప్రజలకు అండగా నిలబడి, కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇవ్వడమే నా జీవిత లక్ష్యం.” అని చెప్పాడు. పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నప్పుడు కేవలం 7,437 పోస్టుల భర్తీకే ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ జారీచేసిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. శాఖలో సుమారు 17వేల ఖాళీలు ఉన్నపుడు అన్నింటినీ ఒకేసారి భర్తీ చేయచ్చు కదా అని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.

వయో పరిమితి పెంచాల్సిందేనా ?

కరీంనగర్‌కు చెందిన ఎన్‌.కుమార్‌ మాట్లాడుతూ. “ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సై పోస్టుకు 38 ఏళ్ల వరకు వయోపరిమితి ఇవ్వాలి. జీఓ 46 తీసుకువచ్చి మా జీవితాలు నాశనం చేశారు” అని ఆవేధన వ్యక్తంచేశాడు. పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతపై ఆర్థిక భారం కూడా భారీగానే ఉంటోంది.

కోచింగ్ ఫీజులకే సుమారు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతోంది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి గది అద్దె, భోజనం, లైబ్రరీ, ప్రయాణఖర్చులు కలిపి నెలకు రూ.15 వేల వరకు ఖర్చవుతున్నట్లు ఆదిలాబాద్‌కు చెందిన సోమేష్ చెప్పారు.

ఏడాది ప్రిపరేషన్‌కు సుమారు రూ.2 లక్షలు, రెండు, మూడు సంవత్సరాలకు అయితే రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. పరీక్షఫీజులు అదనపు భారంగా మారుతున్నాయి. ఇదే విషయమై గుంపుల వినయ్‌ మాట్లాడుతూ “ఉద్యోగం కోసం సిద్ధమవడం అంటే కేవలం పరీక్ష ఫీజు చెల్లించడం కాదు’’ అన్నారు. ‘‘కోచింగ్, స్టే, భోజనం, లైబ్రరీ, ప్రయాణం అన్నింటికీ ఖర్చవుతుందని, ఉద్యోగం వస్తుందో లేదో తెలియకపోయినా ప్రిపరేషన్ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.” అని తెలిపారు.

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు పోటీ ఏస్థాయిలో ఉందో గతనియామకాలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ సంవత్సరంలో ఎన్ని భర్తీ అయ్యాయి ?తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో 11,748 పోస్టులతో తొలి పోలీస్ నియామకాలు జరిగాయి. ఈ పోస్టులకు సుమారు 7.66 లక్షల మంది దరఖాస్తు చేశారు.2018లో 18,428 పోస్టులకు నియామక డ్రైవ్ చేపట్టగా సుమారు 7.19 లక్షల మంది దరఖాస్తు చేశారు.

2022లో 17,516 పోస్టులకు ఏడు నోటిఫికేషన్లు విడుదలైతే సుమారు 7,33,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 12.91 లక్షలకు చేరింది.ఇప్పుడు 2026లో పోస్టుల సంఖ్య 7,437కు పరిమితం కావడం అభ్యర్థుల్లో అసంతృప్తికి కారణమైంది. ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూడాలి. “మా నిరసన ఎందుకు కనిపించడం లేదు?” ఇందిరా నాయక్పోలీస్ ఉద్యోగాలకోసం కొంతకాలంగా నిరసన తెలియచేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

అభ్యర్థుల తరఫున నిరుద్యోగ జేఏసీ క‌న్వీన‌ర్‌ ఇందిరా నాయక్‌ మాట్లాడుతూ “గత 40 రోజులుగా నిరసన చేస్తున్నాము’’ అని గుర్తుచేశారు. ‘‘1,500 కిలోమీటర్ల దూరంలో కాక్రోచ్ జనతా పార్టీ చేసే నిరసన రేవంత్ సర్కార్‌కు కనిపిస్తోంది కానీ కేవలం 15 కిలోమీటర్ల దూరంలో గత 40 రోజులుగా చేస్తున్న మా నిరసన కనబడటంలేదా ? అని నిలదీశారు. ‘‘తమది ప్రజా ప్రభుత్వం అంటారు కదా తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పటంలేదు” అంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రస్తుతం 1,091 పోలీస్ స్టేషన్లు, 35 జైళ్లు ఉన్నాయి. 78 వేలకుపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంజూరైన పోస్టులు 91 వేలకుపైగా ఉన్నాయి. నియామకాలపై నిరుద్యోగయువత హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో ప్ర‌భుత్వం ప్రస్తావించిన అంశాన్ని పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తున్న మెంటర్‌, అడ్వైజర్ షేక్ కలేషా గుర్తు చేశారు. “ముఖ్యమంత్రి ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆహామీ ఏమైంది? అని అడిగారు. ఉద్యోగాల భర్తీపై 2023 ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన హామీని అమలుచేస్తారన్న ఆశతో ఉద్యోగాలకోసం 20 లక్షల మంది నిరుద్యోగులు, యువత ఎదురుచూస్తున్నారు.” అని ఆయ‌న వివరించారు.

వందల కోట్లు అవసరమా ?

పెరుగుతున్న జనాభా, సైబర్ నేరాలు, ట్రాఫిక్, శాంతి భద్రతలు వంటి అంశాల నేపథ్యంలో పోలీస్ శాఖకు మరింత సిబ్బంది అవసరమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖలోని ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తున్నామని చెబుతోంది. శాఖల అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, రోస్టర్ విధానం, పరిపాలనా అనుమతులను పరిగణనలోకి తీసుకుని పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అన్ని ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం వివరిస్తోంది. ఒక్కసారిగా అన్నీ ఖాళీలను భర్తీచేయాలంటే ప్రతి ఏడాది వందల కోట్లరూపాయల భారం పడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సాధారణంగా ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు వంటి వివాదాలు తప్పదనే అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన నియామకాల్లో అలాంటి వివాదాలు తలెత్తలేదని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

ఈ విషయం ఇలాగుంటే రేవంత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఫ్యూచర్ సిటి ప్రాంతంలో పోలీసు నియామకాలకు సంబంధించి ఒక్క పోస్టు కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా 26 జిల్లాల్లో మాత్రమే సివిల్, ఆర్ముడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. తెలంగాణలో ఎంతో కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాల్లో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీలో ఒక్క పోస్టు కూడా చూపించలేదు. అంటే పై జిల్లాల్లో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీ అవసరం లేదని ప్రభుత్వం అనుకున్నదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ కోసం గడచిన మూడు, నాలుగు సంవత్సరలుగా కోచింగ్ తీసుకుంటున్న యువత, నిరుద్యోగుల పరిస్ధితి ఏమిటి ? అన్నదే ఇపుడు అర్ధంకావటంలేదు.వీరి ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రావటంలేదు.

కోర్ ఏరియాలో భర్తీలు లేవా ?

పోయిన ఏడాది ఫిబ్రవరి నాటికి 717 సివిల్, ఆర్ముడ్ రిజర్వ్ ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో చెప్పింది. అప్పటి నుండి ఈ జూలై నాటికి సుమారు 400 మంది రిటైర్ అయ్యారు. అంటే మొత్తం సుమారు వెయ్యికి పైగా ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాల్సుండగా 162 ఎస్ఐ పోస్టులను మాత్రమే భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్లో ప్రభుత్వం చెప్పటమే విచిత్రంగా ఉంది. అయితే నియామక ప్రక్రియలో సవాళ్లు లేకపోలేదు. గ‌త మూడు రిక్రూట్‌మెంట్లలో కొన్ని కోర్టు కేసులు, OMR మూల్యాంకనంపై అభ్యంతరాలు, 59 మంది నకిలీ బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించిన వ్యవహారం కలకలం రేపింది. అలాగే ప్రతి నోటిఫికేషన్‌కు సగటున 7 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేశారు. అందుకనే నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత జారీ అయిన నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సవాళ్ళుగా నిలిచాయి. ఒకవైపు ప్రభుత్వ ఆర్ధిక పరిమితులు, మరోవైపు కొలువులకోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువత. ఈ రెండింటి మధ్య పోలీస్ ఉద్యోగాలభర్తీని ప్రభుత్వం ఎలాగ బ్యాలెన్స్ చేస్తుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story