బీజేపీ సభ్యత్వ కార్డే పౌరసత్వ రుజువా? .. ఓవైసీ సెటైర్
x

'బీజేపీ సభ్యత్వ కార్డే పౌరసత్వ రుజువా?' .. ఓవైసీ సెటైర్

"పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాదంటే, మరి అసలు పౌరసత్వానికి రుజువు ఏది?"


"పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాదంటే, మరి అసలు పౌరసత్వానికి రుజువు ఏది?" అని ప్రశ్నించారు హైద‌రాబాద్ ఎం.పి. అస‌దుద్దీన్ ఓవైసీ. "2030 నాటికి భారత పౌరసత్వానికి ఒక్కటే రుజువు బీజేపీ సభ్యత్వ కార్డే అవుతుందేమో" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పాస్‌పోర్ట్ జారీకి కఠినమైన పత్రాల పరిశీలన, పోలీసు వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా దాన్ని పౌరసత్వానికి రుజువుగా గుర్తించకపోవడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని అన్నారు.

పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు ఖచ్చితంగా ఈ దేశ పౌరుడు కాదు అంటోంది కేంద్ర విదేశాంగ శాఖ."పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే... అది భారత పౌరసత్వానికి రుజువు కాదు" అని కేంద్రం స్పష్టం చేసింది. అసలు కేంద్రం ఎందుకు ఇలా చెప్పింది? చట్టం ఏం చెబుతోంది? పాస్‌పోర్ట్ ఉంటే పౌరుడే కాదా? అయితే అసలు పౌరసత్వానికి రుజువు ఏది?

వివాదం ఎలా మొదలైంది?

14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. వారి ప్రకారం... పాస్‌పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణం కోసం ప్రభుత్వం జారీ చేసే పత్రం మాత్రమే. అది భారత పౌరసత్వానికి అంతిమ చట్టపరమైన రుజువు కాదు. పౌరసత్వాన్ని నిరూపించేందుకు వేరే చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రకటన బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ ప్రారంభమైంది.

కేంద్రం వాదన ఏంటి?

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రధాన అంశాలు ఇవి.

1) 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం...ప్రత్యేక పరిస్థితుల్లో భారత పౌరులు కాని వ్యక్తులకు కూడా కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ డాక్యుమెంట్లు లేదా పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. అందుకే... పాస్‌పోర్ట్ ఉండటం ఒక్కటే పౌరసత్వాన్ని నిరూపించదని ప్రభుత్వం చెబుతోంది. ఇది కొత్త నిర్ణయం కాదని... ఎన్నో సంవత్సరాలుగా ఇదే చట్టం అమల్లో ఉందని కేంద్రం వివరణ ఇచ్చింది.

కోర్టులు ఏం చెప్పాయి?

2013లో బాంబే హైకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారత పౌరుడిగా ఖచ్చితంగా నిర్ధారించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే... సుప్రీంకోర్టు కూడా గతంలో ఆధార్ కార్డు సైతం పౌరసత్వానికి రుజువు కాదని పేర్కొంది. అంటే... ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఈ మూడు కూడా గుర్తింపు పత్రాలే తప్ప... పౌరసత్వానికి అంతిమ ధ్రువీకరణ కాదన్నది చట్టపరమైన వాదన.

ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయి?

కేంద్రం వివరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా...రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్... ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్...వీళ్లంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు.

"పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాకపోతే... మరి అసలు రుజువు ఏది?" సాధారణ ప్రజల్లోనూ ఇదే సందేహం వ్యక్తమవుతోంది.

ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు

ఈ వివాదం తర్వాత సోషల్ మీడియాలో ఐదు ప్రధాన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.

1. పాస్‌పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ అయితే... విదేశీ పౌరసత్వం తీసుకున్న వెంటనే భారత పాస్‌పోర్ట్ ఎందుకు వెనక్కి ఇవ్వాలి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొత్తం ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారనే అధికారిక లెక్క లేదు. అయితే 2011 నుంచి 2024 వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 20.86 లక్షల మంది (2.086 మిలియన్లు) భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.

2.పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు? కేవలం ప్రయాణ పత్రం కోసం అంత కఠినమైన పరిశీలన ఎందుకు అవసరం?

3. భారతీయులు కానివారికి కూడా పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చని ప్రభుత్వం చెబుతోంది... అయితే ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు?

4. ఆధార్, పాన్ కార్డులు మీవే అంటారు... కానీ పాస్‌పోర్ట్ మాత్రం ప్రభుత్వ ఆస్తి అని ఎందుకు చెబుతున్నారు?

5. ఆధార్ కాదు, పాస్‌పోర్ట్ కాదు, ఓటర్ ఐడీ కాదు మరి భారత పౌరసత్వానికి అసలైన చట్టపరమైన రుజువు ఏది?

పౌరసత్వ చట్టం 1955 ఏం చెబుతోంది?

భారత పౌరసత్వానికి సంబంధించిన అసలు చట్టం...Citizenship Act – 1955ఈ చట్టం ప్రకారం ఐదు మార్గాల్లో భారత పౌరసత్వం లభిస్తుంది.

1. పుట్టుక ద్వారా

2. వంశపారంపర్యంగా

3. రిజిస్ట్రేషన్ ద్వారా

4. నేచురలైజేషన్ ద్వారా

5. భారతదేశంలో కొత్త భూభాగం విలీనమైనప్పుడు.

ఈ ఐదు ప్రక్రియల ద్వారా మాత్రమే ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వాన్ని గుర్తిస్తుంది.

అసలు పౌరసత్వ రుజువు ఏది?

చట్టపరంగా...ప్రభుత్వం జారీ చేసే Citizenship Certificate (పౌరసత్వ ధృవీకరణ పత్రం) మాత్రమే పౌరసత్వానికి ప్రత్యక్ష రుజువుగా పరిగణించబడుతుంది.

అయితే...భారతదేశంలో పుట్టిన చాలా మంది పౌరులకు ప్రత్యేక Citizenship Certificate ఉండదు. అలాంటి సందర్భాల్లో వారి పౌరసత్వం Citizenship Act, 1955లోని నిబంధనల ప్రకారం, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల వివరాలు, ఇతర సంబంధిత అధికారిక పత్రాల ఆధారంగా నిర్ధారించబడుతుంది. అందువల్ల "ఒక్కటే పత్రం అందరికీ వర్తిస్తుంది" అని చెప్పడం సరైంది కాదు.

కేంద్రం చెబుతున్నదిః

పాస్‌పోర్ట్ అనేది ప్రయాణ పత్రం... పౌరసత్వానికి అంతిమ చట్టపరమైన రుజువు కాదు.

ప్రతిపక్షాలు చెబుతున్నదిః

అంత కఠినమైన పరిశీలన తర్వాత ఇచ్చే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ రుజువుగా ఎందుకు గుర్తించరని.మొత్తానికి...ఈ వివాదం ఒక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది."భారత పౌరసత్వాన్ని చట్టపరంగా ఎలా నిర్ధారిస్తారు?"దానికి సమాధానం...పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి ఒక్క పత్రంతో కాదు... భారత పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనల ప్రకారం, సంబంధిత చట్టపరమైన ఆధారాలపై నిర్ణయిస్తారు.

Read More
Next Story