
విడిపోయాం.. కానీ లెక్కలు తేలలేదు!
ఆస్తులు.. నీళ్లు.. బకాయిలు.. వివాదాలు మాత్రం ఎక్కడికక్కడే!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఇచ్చిన 10 ఏళ్ల గడువు కూడా ముగిసి రెండేళ్లు దాటింది. అయినా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య విభజనకు సంబంధించిన కీలక అంశాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.
ప్రభుత్వ భవనాలు, ఆస్తుల పంపకం, షెడ్యూల్-9, షెడ్యూల్-10 సంస్థల విభజన, కృష్ణా–గోదావరి జలాల పంపకం, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల కేటాయింపు.. ఇలా అనేక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. 2014లో విభజన జరిగినా.. కొన్ని అంశాల్లో లెక్కలు మాత్రం ఇంకా తేలలేదు. అసలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి? 12 ఏళ్లుగా ఎందుకు పరిష్కారం కావడం లేదు?
హైదరాబాద్‌లో ఇంకా ఏపీ ఆధీనంలో 589 ప్రభుత్వ భవనాలు!
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని 2,565 ప్రభుత్వ భవనాల్లో 1,976 తెలంగాణకు, 589 భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తర్వాత కూడా ఈ 589 భవనాల బదిలీ పూర్తికాలేదు. తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ వివరాల ప్రకారం.. 221 భవనాల్లో ఇప్పటికీ ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు లేదా ఉద్యోగులు కొనసాగుతున్నారు. మరో 368 భవనాలను ఏపీ ఖాళీ చేసినా.. అధికారికంగా తెలంగాణకు అప్పగించలేదు.
మలక్‌పేట్‌లో 308, పాటిగడ్డలో 95, ఎర్రమంజిల్‌లో 67, కుందన్‌బాగ్‌లో 44, బంజారాహిల్స్‌లో 33 సహా పలు ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. వీటితో పాటు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ బదిలీ కూడా వివాదంగానే ఉంది.
మొత్తంగా సుమారు రూ.1.42 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తుల పంపకంపై వివాదాలు కొనసాగుతున్నాయి.
సీఎంల సమావేశం జరిగింది.. కమిటీలు ఏర్పడ్డాయి.. అయినా పరిష్కారం ఎక్కడ?
విభజన సమస్యలకు పరిష్కారం కోసం 2024 జూలై 6న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పెండింగ్ అంశాలపై మంత్రులు, అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పరిష్కారం చూపుతామని ప్రకటించారు.
అయితే రెండేళ్లు గడుస్తున్నా.. కీలక అంశాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు.షెడ్యూల్-9లోని 91 సంస్థలు, షెడ్యూల్-10లోని 142 విద్యా, శిక్షణా సంస్థల ఆస్తుల పంపకం కూడా పూర్తికాలేదు. మొత్తం 245 సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఆస్తుల విలువ సుమారు రూ.1.42 లక్షల కోట్లుగా అంచనా.
షెడ్యూల్-9 సంస్థల్లో సుమారు 53 సంస్థల పంపకంపై ప్రాథమిక అంగీకారం వచ్చినా.. మిగిలిన సంస్థలపై ఇంకా నిర్ణయం లేదు. విభజన చట్టంలో ప్రస్తావించని మరో 12 సంస్థల ఆస్తులపైనా వివాదం కొనసాగుతోంది.
నీళ్ల లెక్క తేలలేదు.. కృష్ణా, గోదావరిపై కొనసాగుతున్న పంచాయితీ!
రాష్ట్రాల విభజన తర్వాత కూడా జలాల పంపకం రెండు రాష్ట్రాల మధ్య ప్రధాన వివాదంగానే ఉంది. కృష్ణా జలాల్లో ప్రస్తుతం తెలంగాణకు ఉన్న 299 టీఎంసీల కేటాయింపు సరిపోదని తెలంగాణ వాదిస్తోంది. మరింత న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ ముందు తన వాదనను వినిపిస్తోంది.
మరోవైపు ఏపీ చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా గోదావరి–బనకచర్ల లింక్, రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
తెలంగాణ వాదన ప్రకారం.. ముందుగా రాష్ట్ర ప్రాజెక్టులకు చట్టబద్ధమైన నీటి కేటాయింపులు ఖరారు చేయాలి. ఆ తర్వాతే మిగులు, వరద జలాల పంపకంపై నిర్ణయం తీసుకోవాలి.
విద్యుత్ బకాయిలు.. రూ.6,757 కోట్లు ఎవరు చెల్లించాలి?
విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించిన బకాయిలు కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయ్యాయి.
ఏపీ లెక్కల ప్రకారం.. తెలంగాణ విద్యుత్ సంస్థలు రూ.3,441.78 కోట్ల అసలు బకాయి చెల్లించాలి. దానికి రూ.3,315.14 కోట్ల వడ్డీ కలిపితే మొత్తం డిమాండ్ రూ.6,757 కోట్లకు పైగా ఉంటుంది.
అయితే తెలంగాణ ఈ లెక్కలను అంగీకరించడం లేదు. రెండు రాష్ట్రాల పరస్పర బకాయిలను సర్దుబాటు చేస్తే.. ఏపీ నుంచే తెలంగాణకు నికరంగా సుమారు రూ.4,457 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ అధికారులు గతంలో పేర్కొన్నారు.
అంటే.. ఏపీ అడుగుతున్న రూ.6,757 కోట్ల లెక్క ఒకవైపు ఉంటే.. పరస్పర బకాయిల సర్దుబాటు తర్వాత ఏపీనే తమకు బకాయిపడుతుందని తెలంగాణ వాదన మరోవైపు ఉంది.
ఉద్యోగుల కేటాయింపులోనూ ఇంకా మిగిలిన చిక్కులు!
రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తిగా ముగియలేదు. ఇటీవల 891 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమను తెలంగాణకు శాశ్వతంగా బదిలీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపింది.
విద్యుత్, ఆర్టీసీ వంటి సంస్థల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలు కూడా వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి.అంటే ప్రభుత్వ భవనాల నుంచి సంస్థల వరకు.. నీటి వాటాల నుంచి విద్యుత్ బకాయిల వరకు.. ఉద్యోగుల కేటాయింపు నుంచి ఆస్తుల పంపకం వరకు విభజనకు సంబంధించిన అనేక లెక్కలు 12 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా తేలలేదు.
వివాదాలు మిగిలినా.. ఆర్థికంగా మాత్రం రెండు రాష్ట్రాలు దూసుకెళ్లాయి!విభజన తర్వాత తెలంగాణకు కరెంట్ సమస్యలు.. ఏపీకి ఆదాయ సమస్యలు వస్తాయని అప్పట్లో అంచనాలు ఉన్నాయి. కానీ 12 ఏళ్ల తర్వాత పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
2024–26 తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ జీఎస్‌డీపీ సుమారు రూ.16.40 లక్షల కోట్లు, ఏపీ జీఎస్‌డీపీ రూ.15.93 లక్షల కోట్లకు పైగా ఉంది. రెండు రాష్ట్రాల కలిపిన ఆర్థిక ఉత్పత్తి సుమారు రూ.32.33 లక్షల కోట్లకు చేరింది.
హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఫార్మా, సేవా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుండగా.. ఏపీ వ్యవసాయం, ఆక్వాకల్చర్, పోర్టులు, తయారీ రంగాలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి దిశగా సాగుతోంది.అంటే రాజకీయంగా విడిపోయినా.. ఆర్థికంగా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన బలాలతో ముందుకు సాగుతున్నాయి. కానీ ఆస్తులు, సంస్థలు, నీళ్లు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగాల విషయంలో మిగిలిన వివాదాలకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుంది? అదే ఇప్పుడు అసలు ప్రశ్న.

