
సెంచరీ మిస్.. రికార్డ్ హిట్..! చెలరేగిపోయిన వైభవ్ సూర్యవంశీ (వీడియో)
భారత్ స్కోర్ 377/9
భారత్ ‘ఎ’ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి సంచలనం సృష్టించాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఇండియా ‘ఎ’–శ్రీలంక ‘ఎ’ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు వైభవ్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తొలి బంతి నుంచే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిన అతడు, శ్రీలంక ‘ఎ’ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌలర్ ఎవరు, మ్యాచ్ ఫైనలా, ఫార్మాట్ ఏదన్నది ఏమాత్రం పట్టించుకోకుండా బంతి కనిపిస్తే బౌండరీ, లెంగ్త్ దొరికితే సిక్సర్ అన్నట్లుగా చెలరేగిపోయాడు.
ఈ క్రమంలో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 12 బంతుల్లో ఫిఫ్టీ రికార్డును చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే వైభవ్ దూకుడు అక్కడితో ఆగలేదు. ఫిఫ్టీ తర్వాత కూడా బౌండరీల వర్షం కురిపించాడు. చివరికి 29 బంతుల్లో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అయితే సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలోనే అతని మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది.
వైభవ్ విధ్వంసకర ఆరంభంతో భారత్ ‘ఎ’కు బలమైన పునాది పడింది. ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినా, చివర్లో అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్ వేగంగా పరుగులు జోడించడంతో భారత్ 50 ఓవర్లలో 377/9 భారీ స్కోర్ నమోదు చేసింది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే దేశీయ క్రికెట్, ఐపీఎల్, యూత్ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ బ్యాటర్, ఇప్పుడు లిస్ట్-ఏ క్రికెట్‌లో కూడా తన సత్తా చాటాడు. సెంచరీ మిస్ అయినా, ప్రపంచ రికార్డు మాత్రం సొంతం చేసుకున్న వైభవ్… భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇదే దూకుడు చూపిస్తాడా అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

