
రామలింగారెడ్డి బాటలో మరో మంత్రి..
తనకు వ్యవసాయ శాఖ కేటాయించాలంటోన్న కె.హెచ్. మునియప్ప..
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని క్యాబినెట్లో మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించకపోవడంపై సీనియర్ లీడర్ రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే వరుసలో మరో సీనియర్ నేత ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.
తనకు సాంఘిక సంక్షేమ శాఖ లేదంటే వ్యవసాయం శాఖ కేటాయించాలని కోరుతున్నారు. దేవనహళ్లిలో మామిడి మేళాను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే 8 సార్లు ఎంపీగా, మంత్రిగా పనిచేశాను. పార్టీలో సీనియర్ లీడర్‌ను. అయినప్పటికీ శాఖల కేటాయింపులో మా సీనియారిటీని పక్కనపెట్టారు. పార్టీలో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉంది." అని మునియప్ప పేర్కొన్నారు. ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని, శాఖల కేటాయింపు సరిగ్గా జరగకపోతే, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రవాణా శాఖ మంత్రి భైరతి సురేష్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మరో శాఖ కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

