NEET అభ్యర్థులను సీజేపీ కోరిందేమిటి? (వీడియో)
x

NEET అభ్యర్థులను సీజేపీ కోరిందేమిటి? (వీడియో)

కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం ముందుంచిన డిమాండ్లు ఏమిటి?


Click the Play button to hear this message in audio format

పరీక్షా కేంద్రాల్లో లక్షల మంది నీట్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుంటే.. ఢిల్లీలో మాత్రం ఆందోళన మరింత ఉధృతమవుతోంది. “పరీక్ష పూర్తయ్యాక నేరుగా జంతర్‌మంతర్‌కు రండి” అంటూ నీట్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. ఒకవైపు రీ-ఎగ్జామ్.. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్‌.. అసలు జంతర్‌మంతర్ వద్ద ఏం జరుగుతుందో చూద్దాం..

అంతకంటే ముందుగా నీట్ పేపర్ లీక్ గురించి ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవాలి. వాస్తవానికి మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష రద్దయింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో విద్యార్థుల్లో భయం, ఆందోళన పెరిగింది.

ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాస్తున్నారు. ఇదే సమయంలో జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. వాస్తవానికి శనివారం ఉదయం ప్రారంభమయిన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాలని ఆదేశించారు. కానీ నిరసనకారులు అక్కడి నుంచి కదల్లేదు. “తమ డిమాండ్లు నెరవేరే దాకా తిరిగి వెళ్లం” అని తేల్చి చెప్పారు.

దాంతో రాత్రంతా జంతర్‌మంతర్ వద్దే ధర్నా కొనసాగింది. ప్లకార్డులు, నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ కూడా అక్కడే ఉండి నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఈ ఉద్యమానికి మద్దతుగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా రంగంలోకి దిగారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, జూన్ 27న నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.

ఈ వరుస ఆందోళనలను మొత్తంగా చూస్తే.. సీజేపీ రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. మొదటిది.. పేపర్ లీక్, పరీక్ష రద్దు కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. రెండోది.. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

ఈ ఒత్తిడికి కేంద్రం ఎలా స్పందిస్తుంది? విద్యార్థుల ఆందోళనకు తెరదించే నిర్ణయం వస్తుందా? లేక ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!

Read More
Next Story