వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో అలజడి

జగన్‌కు వ్యతిరేకంగా నోరు విప్పుతున్న ఎమ్మెల్యేలు


వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో అలజడి
x
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. టికెట్లు దక్కుతాయోలేదోననే భయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించి ఓటమి తప్పదనుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను కాదని కొత్తగా నియోకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 11 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారు కూడా. దీంతో సిటింగ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో కొందరు సీఎం జగన్‌ను ధిక్కరించి బహిరంగానే మాట్లాడుతున్నారు.

ఒక్కరొక్కరుగా వైసీపీకి దూరమవుతున్న ఎమ్మెల్యేలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది జగన్‌ను ధిక్కరించడమేనని వైఎస్సార్‌సీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపంచారు. వారిలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మిగిలిన వారు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు.
నియోజకవర్గం వదిలేది లేదంటున్న తోపుదుర్తి
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా ధిక్కార స్వరం వినిపించాడని చెప్పవచ్చు. ‘రాప్తాడు నియోజకవర్గం వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచే పోటీ చేస్తా. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనేవాడు 2024లో మళ్లీ అసెంబ్లీకి పోతాడు’ అంటూ శుక్రవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం రాప్తాడు. మట్టిలో కలిసినా రాప్తాడులో పోతా. తాతల కాలం నుంచి మా ప్రయాణం రాప్తాడు ప్రజలతోనే అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారిని వదిలి ఎక్కడికి వెళ్లేది లేదంటూ స్పష్టం చేశారు. పరిటాల కుటుంబంలా అలా వచ్చి ఇలా పోయేవాడిని కాదన్నారు. దీనిని బట్టి చాలా మంది ఎమ్మెల్యేల్లో ప్రస్టేషన్‌ పెరిగిపోతుందనవచ్చు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు బయటపడి మాట్లాడలేకపోతున్నారనే చర్చ సాగుతున్నది. రెడ్డి సామాజిక వర్గం నుంచి అక్కడక్కడ ఈ ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి.


Next Story