కేరళ అసెంబ్లీలో ఆరోగ్యంపై వాడివేడి చర్చ..
x

కేరళ అసెంబ్లీలో ఆరోగ్యంపై వాడివేడి చర్చ..

వాయిదా తీర్మానం తిరస్కరణతో ఎల్‌డీఎఫ్ వాకౌట్


Click the Play button to hear this message in audio format

అంటువ్యాధుల వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో కేరళ అసెంబ్లీలో సోమవారం ఆరోగ్య శాఖ పనితీరుపై అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీని వాయిదా వేసి ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించడంతో ఎల్‌డీఎఫ్ సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం వచ్చాక, ఆరోగ్య రంగంలో ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న “కేరళ మోడల్” బలహీనపడుతోందని సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.ఏ. మహమ్మద్ రియాస్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. ఒక ప్రభుత్వాన్ని పూర్తిగా అంచనా వేయడానికి 35 రోజులు సరిపోకపోయినా, పరిపాలన ఏ దిశగా సాగుతోందో అర్థం చేసుకోవడానికి మాత్రం ఆ సమయం చాలుతుందని ఆయన అన్నారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రస్తుత ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఒక పార్టీ అధికారంలో ఉందని అంటువ్యాధులు వస్తాయని తమ అభిప్రాయం కాదని, కానీ గతంలో మంత్రిగారి వైఖరి మాత్రం అలా ఉండి ఉండవచ్చని రియాస్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో నిఫా, అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు నమోదవుతున్నాయని, వాటిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ఆరోగ్య శాఖతో సరైన సమన్వయం పాటించడం లేదని ఆరోపించారు. కేరళలో ఎబోలా కేసులు లేవని మంత్రి చెప్పినా, త్వరలోనే రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి ఉందని అధికారులు ప్రకటించాల్సి వస్తుందేమోనన్న భయం తనకు ఉందని రియాస్ అన్నారు.

ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న బదిలీలు, పోస్టింగ్‌లు ఆ రంగం పనితీరును దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. నాలుగు జిల్లాలు జిల్లా వైద్యాధికారులు లేకుండా నడుస్తున్నాయని, నిపా కేసు నమోదైన కోజికోడ్‌లో సీనియర్ ఆరోగ్య అధికారుల తీవ్ర కొరత ఉందని చెప్పారు. నిపా కేసు బయటపడిన కొన్ని రోజుల తర్వాతే, అదీ ప్రతిపక్షం నిరసనలు తెలిపిన తరువాతే, చికిత్సకు అవసరమైన మందులు రాష్ట్రానికి చేరాయని కూడా ఆరోపించారు.

ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం రుతుపవనాలకు ముందే అవసరమైన పారిశుధ్య, నివారణ చర్యలు తీసుకోలేదన్న ప్రభుత్వ ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న మార్చి, ఏప్రిల్ నెలలు మినహా అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు.

ఆరోగ్య శాఖ పనితీరు గాడి తప్పిందని, క్షేత్రస్థాయిలో వ్యాధి నిరోధక చర్యలు దాదాపు నిలిచిపోయాయని విజయన్ ఆరోపించారు. భారీ స్థాయిలో బదిలీలు జరగడం వల్ల ఆరోగ్య కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటోందని, ప్రజారోగ్య సేవలకు అంతరాయం కలుగుతోందని అన్నారు. “ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది” అని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు.

ఆరోపణలను ఖండించిన ఆరోగ్య శాఖ మంత్రి..

ఆరోపణలకు సమాధానంగా ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ ప్రతిపక్ష విమర్శలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల తప్పుడు నిర్ణయాలు, పదేళ్ల నిర్లక్ష్య పాలన పర్యవసానాలనే తమ ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక నిఫా కేసు మాత్రమే నమోదైందని, దేశంలో ఎక్కడా ఎబోలా కేసు నిర్ధారణ కాలేదని మంత్రి స్పష్టం చేశారు. 24 గంటల్లోపే విదేశాల నుంచి నిపా చికిత్సకు అవసరమైన మందులు తెప్పించామని, అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉందని చెప్పారు.

వ్యాధి సోకిన తర్వాత చికిత్స ఇవ్వడం మాత్రమే కాకుండా, అప్రమత్తత, ప్రజల భాగస్వామ్యంతో వ్యాప్తిని ముందుగానే అడ్డుకోవడంపైనే తమ దృష్టి ఉందని మంత్రి తెలిపారు. ఆరోగ్య, ఆహార భద్రతా విభాగాలు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ఆరోగ్య రంగంలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో జనవరి నుంచి అవసరమైన నివారణ చర్యలు చేపట్టలేదని కూడా మంత్రి ఆరోపించారు. కొత్త ప్రభుత్వానికి సహకరించడానికి ఇష్టపడని అధికారులను కీలక పదవుల నుంచి బదిలీ చేశామని చెప్పారు. అంటువ్యాధుల వ్యాప్తిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వాయిదా తీర్మానం అవసరం లేదని పేర్కొంటూ ఆ నోటీసును తిరస్కరించాలని సభను కోరారు.

అనంతరం స్పీకర్ తిరువంచూర్ రాధాకృష్ణన్ వాయిదా తీర్మానానికి అనుమతి నిరాకరించారు. దీంతో ఎల్‌డీఎఫ్ సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

Read More
Next Story