
కర్ణాటక కౌన్సిల్ ఎన్నికల్లో ..చివరకు పైచేయి ఎవరిది?
ఓటింగ్‌లో పాల్గొన్న 222 మంది శాసనసభ్యులు..
కర్ణాటక శాసనమండలిలోని ఏడు స్థానాలకు బెంగళూరు విధానసౌధలో గురువారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ ఐదుగురు అభ్యర్థులను, బీజేపీ ఇద్దరిని, జేడీఎస్ ఒక అభ్యర్థిని బరిలోకి దింపింది. హస్తం పార్టీ తరఫున కామకనూర్ తిప్పనప్ప, పి.వి. మోహన్, బి.ఎస్ శివన్న, బి.కె. హరిప్రసాద్, వినయ్ కార్తీక్ బరిలో ఉండగా, బీజేపీ తరఫున ఆర్ రఘు, లింగరాజ్ పాటిల్ పోటీలో ఉన్నారు. జేడీఎస్ తరఫున గోవింద రాజు పోటీ చేశారు.
ప్రతి అభ్యర్థి విజయానికి 28 ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 62 మంది, జేడీఎస్‌కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ మొదటి నలుగురు అభ్యర్థులు, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారు. అయితే, ఏడవ స్థానం విజయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్, జేడీఎస్ ఏకైక అభ్యర్థి గోవింద రాజు మధ్య పోటీ నెలకొంది.
ఈ సీటు గెలవడానికి రెండు పార్టీలకు ఓట్ల కొరత ఉంది. అందువల్ల రెండు పార్టీలు స్వతంత్రులు, అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లపై కన్నేశాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ బహిష్కృత ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే జనార్దన రెడ్డి ఓట్లు కీలకంగా మారాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ బహిష్కృత నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ తాను బీజేపీకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. కాషాయ పార్టీలో విలీనమైన జనార్దన రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం బీజేపీ శిబిరంలో ఆశలు రేకెత్తించింది.
5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 6.30 నిముషాలకు ఫలితం వెలువడింది. కాంగ్రెస్ ఐదో అభ్యర్థి వినయ్ కార్తీక్ జేడీఎస్ ఏకైక అభ్యర్థి గోవింద రాజుపై గెలుపొందారు.
మొత్తంగా చూస్తే.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచిన కామకనూర్ తిప్పనప్ప, పి.వి. మోహన్, బి.ఎస్ శివన్న, బి.కె. హరిప్రసాద్, వినయ్ కార్తీక్, బీజేపీ తరుపున ఆర్ రఘు, లింగరాజ్ పాటిల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీలు గోవిందరాజు, నసీర్ అహ్మద్, ఎన్. నాగరాజు, ప్రతాప్ సింహ నాయక్ కె, తిప్పన్నప్ప, సునీల్ వల్ల్యాపూర్, బి.కె. హరిప్రసాద్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రోజు ఎన్నికలు జరిగాయి.

