
మహాకవి శ్రీశ్రీ
భవితా ఓ భవితా!
మహాకవ శ్రీ శ్రీ కి పేరడీ పూర్వక నివాళి
భవితా ఓ భవితా
నువ్వోస్తావని, కలగని, కలగని కల కని
కళ్ళు మూయని రాత్రులెన్నో గడిపా, కాళ్ళు నడవని రోజులెన్నో చూసా
నువ్వోస్తావని, ఉద్ధరిస్తావని పోటీ పరీక్షలకి రాత్రిళ్ళు, పగళ్ళు జరగని ప్రగతిని కీర్తించా
చేతగాని నేతల చరితలు వల్లేవేశా
ఫ్రెంచి విప్లవం, తెల్ల దొరల దౌర్జన్యం, నల్ల సూరీడి విజయం గంటల కొద్దీ చదివా
ఏవీ కూడెట్టవని తెలిసీ, కూడెట్టే కొలువులకర్హతనిస్తాయని నమ్మి
పాఠాలన్నీ భట్టీ పట్టా, గతానికి హారతి పట్టా
భవితా, ఓ భవితా,
నువ్వోస్తావని, అమ్మకి విరామం, అయ్యకి ఆసరా తెస్తావని
ఆర కప్పు చాయ్ తో, ఒక పూట తిండితో గడిపి,
గంపెడాశతో ఎదురు చూసా
చొక్కా బొత్తం ఊడితే అమ్మ కుట్టేది
చాకలి చేయేస్తేనే మాసిన బట్టలు మెరిసేవి
మంగలి కరుణిస్తేనే ముఖం విరిసేది
చాయ్ పెట్ట రాదు, అన్నం ఉడకపెట్ట రాదు
నైపుణ్యం నేర్పని చదువు నేర్చా, వాస్తవం చెప్పని పుస్తకాలు చదివా
ఎవడో వస్తాడని, ఎవడో ఇస్తాడని, ఎవడో ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తూ
నెరుస్తున్న కురులు వెక్కిరిస్తోంటే
తలవంచుకుని ఇంకా ఉద్యోగ ప్రకటనలు చూస్తున్నా,
నా బయోడేటా ఇప్పటికీ సవరిస్తూనే ఉన్నా
పై కులాన్ని నిందించా, కింది వర్గాలని నిరసించా, నాకులం వదిలేస్తే మౌనంగా రోదించా
నా కుల నవయుగ నవాబుల గడీలు చూసి గుండె పగిలి కూలబడ్డా
పస్తుల లోకంలో కలిమి లేములే గురువని తెలపని ఊకదంపుడు ఉపన్యాసాలు విన్నా
విన్నదంతా నిజమని నమ్మా
భవితా, ఓ భవితా,
నువ్వొస్తావని తెలుసు, నేనూహించిన రూపంలో కాదేమో
పనికిరాని సమాచారం విజ్ఞాన సర్వస్వం అని విర్రవీగితే నువు మురిసి ముద్దెట్టవేమో
ఇక నీకోసం ఎదురు చూడనులే
నా భవితను నేనే సృష్టిస్తా
నా గతిని నేనే నిర్ణయిస్తా
భవితా, ఓ భవితా, నా కలల కవితా
ఇక నీవొక వాస్తవ కన్యక, స్వయంకృత గీతిక
Next Story

